Sathya Sai District News: తాగితే లోకం తలకిందులవుతుంది అంటారు. ఈ సంఘటన వింటే అది అక్షరాల నిజమే అనుకుంటారు మీరు కూడా. అప్పుడప్పుడు తాగి వింతగా ప్రవర్తించే, విచిత్రంగా వ్యవహరించే వ్యక్తులు మనకు అంతర్జాలంలో కనిపిస్తూనే ఉంటారు. తప్ప తాగి ట్రాఫిక్ పోలీసులనే ‘నువ్వేంత’ అనే మహానుభావులు చాలా మందిని చూస్తూనే ఉంటాం. అలాగే బాగా తాగేసి చల్లదనం కోసం చెరువులో పడుకున్న వ్యక్తులు కూడా ఇంటర్నెట్ పుణ్యమా అని నెటిజన్ల కంటపడ్డారు. తాగి క్రూర జంతువులకు ఎదురెళ్లిన వాళ్లు, విష కీటకాలను ఆరగించిన వారు ఈ జాబితాలోకే వస్తారు.
తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు(Kottacheruvu)లో అలాంటి సంఘటనే జరిగింది. ఫూటుగా తాగిన ఓ వ్యక్తి(Drunken man) బస్సు కింద పడుకున్నాడు. అప్పుడే ఆశ్చర్యపోకండి. అలా కొద్ది దూరం ప్రయాణించాడు కూడా. తీరా ఆ విచిత్రాన్ని గమనించిన కొందరు దాన్ని డ్రైవర్ చెవిన వేశారు. హడలిపోయిన బస్సు డ్రైవర్ .. విషయాన్ని ఆరా తీశాడు. అప్పడు తెలిసింది.. ఆ పడుకున్న బాబు మాములు బాబు కాదని.. మందు బాబు అని. మందేసి బస్సు స్టెపిని టైర్ నే హంసతూలిక తల్పంలా భావించి అక్కడ పవళించి సేదతీరుతున్నాడని తెలిసి షాక్ అయ్యి.. అతని ప్రాణం పోనందుకు తనపై కేస్ అయ్యే ప్రమాదం తప్పినందుకు సంతోషించి ప్రయాణాన్ని కొనసాగించాడు.
అసలు కథ
శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు నుండి హిందూపురం వెళ్లే ఆర్టీసీ బస్సు ఆగి ఉండగా. ఓ తాగుబోతు వచ్చాడు. కిక్కు ఎక్కువై ఓపిక లేకపోవడం చేతనో లేక తాగిన మత్తులో చల్లదనం కోసమో లేక వెరైటీగా ఉంటుందనో తెలియదు కానీ ఓ వింత పని చేశాడు. ఎవరైనా బస్సు లోపలికి ఎక్కి కుర్చుంటారు అదీ కాదు జనం ఎక్కువుంటే పైన ఎక్కి కూర్చుంటారు. కానీ సదరు తాగుబోతు మాత్రం… బస్సు కింద వెనుక చక్రాల మధ్యన స్పేర్ టైర్ పైన పడుకున్నాడు. మాంచి మత్తులో ఉన్నాడేమో వెంటనే నిద్ర పట్టేసింది. కింద సంగతి ఏం తెలుస్తుంది. అందుకని.. కండక్టర్ రైట్..రైట్ అనడంతో డ్రైవర్ బస్సును ముందుకు లాగించాడు. అలా దాదాపు 15 కిలోమీటర్ల వరకు ప్రయాణం సాగింది.
బస్సు వెనుక వస్తున్న వాహనదారులకు బస్సు కింద ఎవరో వేలాడుతున్నట్లు అనిపించింది. అదే విషయాన్ని బస్సు డ్రైవర్ కు చెప్పారు. దాంతో షాక్ తిన్న ఆర్టసీ బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపి వెనక టైర్ దగ్గర ఏముంది అని చూడగా… అక్కడ మందుబాబు పడుకొని ఉన్నాడు. ఖంగుతిన్న బస్సు డ్రైవర్ వెంటనే మందు బాబును బస్సు కింద నుంచి ఆ బాబును బయటకు తీశారు.
ఈ సంగతి విన్నవారంతా… ఒక్కొలా కామెంట్ చేస్తున్నారు. రోజు ఒక్క లాగే ప్రయాణిస్తే ఏముంటుంది కిక్కు.. ఇలా అయితే డబల్ కిక్కు అంటున్నారు. ఇక, మరికొందరేమో.. బస్సు ఎక్కి పడుకోవడం మాములే.. కింద పడుకోవడం ద్వారా ఓ కొత్త కాన్సెప్టుకు తెర తీశాడని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.