Private Bus Accident: ఇటీవల ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు వరుసగా ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో మరో యాక్సిడెంట్ (Private Bus Accident) వెలుగుచూసింది. భవానీలతో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్తుండగా, దోర్నాల ఘాట్ వద్ద ప్రమాదానికి గురైంది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో వేగంగా దూసుకెళ్లి డివైడర్ రైలింగ్‌ను ఢీకొట్టింది. బ్రేకులు ఫెయిలైనప్పటికీ డివైడర్ రైలింగ్‌ను ఢీకొట్టడంతో బస్సు ఆగిపోయింది. దీంతో, పెనుప్రమాదం తప్పినట్టు అయింది. బస్సులోని 40 మంది భవానీలు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో, అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు. శ్రీదుర్గ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదానికి గురైనట్టు గుర్తించారు.
తృటిలో తప్పిన పెనుప్రమాదం
దోర్నాల ఘాట్ మీద ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు డివైడర్ రైలింగ్‌ను ఢీకొట్టి, కొద్దిమేర ముందుకు కూడా చొచ్చుకెళ్లి ఆగిపోయింది. బస్సు ఇంకాస్త ముందుకు వెళ్లి ఉంటే ఊహించలేని ఘోరం జరిగిపోయి ఉండేది. అదృష్టం కొద్దీ బస్సు లోయలోకి పడిపోకుండా ఆగిపోయింది. దీంతో, బస్సులో ప్రయాణిస్తున్న భవానీలు అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Read Also- Soggadu Re-release: శోభన్ బాబు ‘సోగ్గాడు’ మళ్లీ వస్తున్నాడు థియేటర్‌లలోకి.. ఎప్పుడంటే?
ఏపీలో వరుసగా ప్రమాదాలు
ఇటీవలి కాలంలో ఏపీ రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఘోరమైన ప్రమాదానికి గురయ్యాయి. కర్నూల్‌కు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అక్టోబర్ నెలలో దగ్ధమైంది. చిన్నటేకూరు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో కాలిబూడిదయ్యారు. ఓ బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడం, చాలా దూరం లాక్కెళ్లడంతో మంటలు చెలరేగి బస్సుకు అంటుకొని ఈ ప్రమాదం జరిగింది.
ఇక, మూడు నాలుగు రోజులక్రితమే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. రాజుగారి మెట్ట సమీపంలో జరిగింది. ఈ బస్సు భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పలువురు మృతి చెందగా, చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

