Gorantla Madhav : ఏపీలో వరుస అరెస్టులు కలకలం రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో రెచ్చిపోయిన వారందరి పరిస్థితి ఇలాగే ఉంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ వంతు వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. అనంతపురం జిల్లాకు వెళ్లిన విజయవాడ (vijayawada) పోలీసులు మార్చి 5న విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు.
గతంలో సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించారని ఆయన మీద విజయవాడలో కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగానే మాధవ్ కు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. చూస్తుంటే మాధవ్ ను కూడా అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. లోకేష్ రెడ్ బుక్ లో మాధవ్ పేరు కూడా ప్రధానంగా ఉందని.. అది ఇప్పుడు అమలు అయ్యే అవకాశం ఉందంటున్నారు. మాధవ్ చాలా రోజులుగా సైలెంట్ గానే ఉంటున్నారు. వైసీపీ హయాంలో ఆయన ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నారో అందరికీ తెలిసిందే.
విచారణ పూర్తయ్యే లోపు ఆయన అరెస్ట్ తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. దీంతో మాధవ్ కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే న్యాయనిపుణులతో మాట్లాడుతున్నారంట మాధవ్. మాధవ్ ఈ నోటీసులపై స్పందించారు. తాను కేవలం మీడియాలో వచ్చిన వారి పేర్లను మాత్రమే ప్రస్తావించానని చెబుతున్నారు. రాష్ట్రంలో బావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోయిందని.. నేరం చేసిన వారిని వదిలిపెట్టి ప్రతిపక్ష పార్టీలను వేధించడం అన్యాయం అంటూ చెప్పుకొచ్చారు.