Pawan Kalyan | చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ మీద దాడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఈ దాడిని తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. రంగరాజన్ మీద దాడి జరిగిందని తెలిసి తీవ్ర మనోవేదనకు గురైనట్టు చెప్పారు. ఇది వ్యక్తిపై దాడి కాదని.. ధర్మ పరిరక్షణ మీద దాడిగా భావించాలన్నారు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఎందుకంటే రంగరాజన్ హిందూ ధర్మ పరిరక్షణ కోసం పరితపిస్తున్నారని.. ఎన్నో పోరాటాలు చేస్తున్నారని.. అలాంటి వ్యక్తిపై దాడి చేయడం బాధాకరం అన్నారు.
‘నిందితులను రేవంత్ ప్రభుత్వం గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. రంగరాజన్ ధర్మ పరిరక్షణ గురించి నాకు ఎన్నో రకాల సూచనలు చేశారు. టెంపుల్ మూమెంట్ తీసుకుని ఆలయాల పరిరక్షణ, సంప్రదాయాల పరిరక్షణ కోసం కృషి చేసిన వ్యక్తి రంగరాజన్’ అని పవన్ తెలిపారు. త్వరలోనే తెలంగాణ జనసేన నేతలు ఆయన్ను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇవ్వాలని పవన్ దిశానిర్దేశం చేశారు. ఇక రంగరాజన్ మీద దాడి రెండు రోజులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన మీద ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వీర రాఘవరెడ్డి బ్యాచ్ దాడికి పాల్పడింది. ఇప్పటికే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.