Nara Lokesh
ఆంధ్రప్రదేశ్

Nara Lokesh: నాలో నమ్మకం పెరిగింది.. డిప్యూటీపై లోకేశ్ క్లారిటీ  

దావోస్, స్వేచ్ఛ: ఆంధ్రప్రదేశ్‌కు భారీ ఎత్తున పెట్టుబడులను తీసుకువచ్చేందుకు దావోస్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు విరామం లేకుండా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వివిధరంగాలకు చెందిన కంపెనీల సీఈవోలతో, అధిపతులతో చర్చలు జరుపుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలలో ఒకటైన డెన్మార్క్‌కు చెందిన మార్స్క్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. 130 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ప్రపంచ రవాణా రంగంలో రారాజులా వున్న మార్స్క్ రాష్ట్రానికి వస్తే సముద్ర రవాణాలో ఏపీ దేశంలోనే అగ్రగామి రాష్ట్రం అవుతుంది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సు రెండో రోజు చంద్రబాబు మార్స్క్ కంపెనీ సీఈవో విన్సెంట్ క్లర్క్‌తో కీలక చర్చలు జరిపారు. వెయ్యి కిలోమీటర్ల పైనే తీరప్రాంతం కలిగి వుండటం, విస్తారంగా పోర్టులు ఉండటం, ఏపీ బలమని, మానవ వనరులకు ఎలాంటి లోటు లేదని క్లర్క్‌కు ముఖ్యమంత్రి వివరించారు.

మార్స్క్ రాష్ట్రానికి వస్తే..
ప్రపంచ వ్యాప్తంగా భారీ ఉత్పత్తులు, వాణిజ్య వస్తువులు సముద్ర మార్గం ద్వారా రవాణా చేయడంలో మార్స్క్‌‌కు తిరుగులేదు. మార్స్క్ ఏపీకి వస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. రాష్ట్రంలోని ఓడరేవులు, ప్రధానంగా విశాఖపట్నం పోర్టు మరింత అభివృద్ధి చెందుతాయి. ఆసియా పసిఫిక్ మార్కెట్లకు రవాణా హబ్‌గా ఏపీ మారే అవకాశం ఉంటుంది. అటు ఎగుమతులు, దిగుమతుల రంగం బలపడుతుంది. ఏపీ ఒక గ్లోబల్ లాజిస్టిక్ హబ్‌గా ఎదగడమే కాకుండా, భారతదేశ ఆర్థిక వృద్ధిలో ప్రధాన పాత్ర పోషించేందుకు దోహదపడుతుంది. ఇలా రెండో రోజు 15 కంపెనీలకు పైగా ప్రతినిధులతో అటు చంద్రబాబు, ఇటు లోకేశ్ భేటీ అయ్యి రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను నిశితంగా వివరించి, పలు కంపెనీల సీఈవోలను మెప్పించారు కూడా.

రండి.. రారండి
ఈథర్‌నెట్, ఆప్టికల్, వైర్‌లెస్, మొబిలిటీ వంటి నెట్‌వర్కింగ్‌లో సాంకేతికతలను అందించడం, డేటా సెంటర్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో పేరున్న మల్టీ-నేషనల్ టెక్నాలజీ సంస్థ సిస్కో చైర్మన్, సీఈవో చుక్ రాబిన్స్‌తో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి తన ఆకాంక్ష వ్యక్తం చేశారు. విశాఖపట్నం లేదా తిరుపతిలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటుకు యోచన చేయమని రాష్ట్రంలో ప్రతిభకు లోటు లేదని చెప్పారు. ఏపీలో నెట్‌వర్క్ భాగాల తయారీకి ఆహ్వానించారు. మరోవైపు ఎల్జీ కెమ్ లిమిటెడ్ సీఈవో షిన్ హక్ చియోల్‌కు రాష్ట్రంలో వివిధరంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను చంద్రబాబు వివరించారు. పెట్రో కెమికల్ రంగంలో యూనిట్లు మూలపేట – విశాఖలోనూ, సెమీకండక్టర్ యూనిట్ తిరుపతిలోనూ నెలకొల్పేందుకు వున్న అవకాశాలను పరిశీలించమని సీఎం సూచించారు.

కార్ల్స్‌బెర్గ్ గ్రూప్, ఆర్సెల్లార్ మిట్టల్‌‌తోనూ..
పళ్ల రసాలు, శీతల పానీయాలు, బీర్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌, ఉత్పత్తి చేసే కార్ల్స్ బెర్గ్ గ్రూప్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్‌తోనూ చంద్రబాబు చర్చలు జరిపారు. ఇంటిగ్రేటెడ్ బ్రూవరీ, బాట్లింగ్ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయమని అభ్యర్థించారు. ఇందుకోసం విశాఖపట్నం, కృష్ణపట్నం, శ్రీ సిటీలోని ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించమని చెప్పారు. బార్లీ, మొక్కజొన్న, వరి వంటి అధిక నాణ్యమైన ఆహార ఉత్పత్తులను సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని రైతులతో భాగస్వామి కావాల్సిందిగా కోరారు. మరోవైపు అనకాపల్లిలో రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడితో 17.8 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్టుపై ఆర్సెలార్ మిట్టల్/నిప్పన్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ ఎన్. మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్‌తో చంద్రబాబు చర్చించారు. ఈ బృహత్తర గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ ఇటీవలి కాలంలో రాష్ట్రానికి వచ్చిన అతిపెద్ద పెట్టుబడులలో ఒకటిగా నిలిచింది. అలాగే వెల్స్‌పన్ చైర్మన్ బీకే గోయింకాతో కూడా పెట్టుబడులపై ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. దీనిపై ఎక్స్ వేదిగా సీఎం స్పందిస్తూ అనకాపల్లిలో ఏర్పాటయ్యే ఆర్సెలార్‌ మిత్తల్‌, నిప్పాన్‌ స్టీల్‌ ప్లాంట్‌ అతిపెద్ద ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టుల్లో ఒకటిగా అది నిలుస్తుందనిపేర్కొన్నారు.

నాలో నమ్మకం పెరిగింది..
గ్రీన్‌ ఇండస్ట్రియలైజేషన్‌పై నిర్వహించిన సదస్సులో సీఎం మాట్లాడుతూ భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయన్నారు. ప్రపంచ దేశాలకు భారతీయులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఇక్కడున్న వ్యాపారవేత్తలను చూస్తుంటే తనలో నమ్మకం పెరిగిందని, భవిష్యత్‌లో కలలు నిజమవుతాయనే నమ్మకం కలిగిందని చెప్పారు. రాష్ట్రంలో ఆర్గానిక్ వ్యవసాయంపైనా దృష్టి పెట్టామని, గ్లోబల్ కమ్యూనిటీ కోసం ఏపీ ఓ మంచి మోడల్ అవుతుందని వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసేందుకు ఏపీలో ఉన్న అవకాశాలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలను చంద్రబాబు కోరారు. ఎక్కడికి వెళ్లినా ఏపీ పారిశ్రామికవేత్తలే కనిపిస్తున్నారని, భారతీయులు అందిస్తున్న సేవలపట్ల తాను గర్వంగా ఫీలవుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాబోయే రోజుల్లో భారత్ ఆర్ధికంగా ఒకటి లేదా రెండో స్థానంలోకి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

స్మోక్‌ ఫ్రీ సిగరెట్ యూనిట్..
దావోస్ పర్యటనలో అటు చంద్రబాబు, ఇటు లోకేశ్ బిజిబిజీగా గడుపుతున్నారు. ఫిలిప్‌ మోరిస్ సంస్థ ప్రతినిధితో భేటీ అయిన లోకేశ్ ఏపీలో స్మోక్‌ ఫ్రీ సిగరెట్ యూనిట్ ఏర్పాటుపై చర్చించారు. ఏపీలో వ్యూహాత్మక విస్తరణకు ప్రకాశం, గుంటూరు పరిసర ప్రాంతాలు అనుకూలమని వెల్లడించారు. మరోవైపు జెడ్ఎఫ్‌‌ ఫాక్స్‌కాన్ సీఈవోతోనూ సమావేశమై, సప్లయ్‌ చైన్ కార్యకలాపాల విస్తరణకు ఏపీలో ఉన్న అనుకూలతలను వివరించారు. రాష్ట్రంలో వాహన తయారీ యూనిట్ నెలకొల్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ 27 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో మిగులు విద్యుత్‌ ఉందని, 1054 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతం, 6 ఆపరేషనల్ పోర్టులు కలిగి మారిటైమ్ ట్రేడ్‌కు అనుకూల వాతావరణం కలిగి ఉందని లోకేశ్ వివరించారు. పర్యావరణ పరిరక్షణ- వాతావరణ ఉద్యమ భవిష్యత్ అనే అంశంపై స్వనీతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉష్ణోగ్రతలను అదుపు చేయడానికి క్లీన్ ఎనర్జీ ఒక్కటే ఏకైక పరిష్కారమని సూచించారు. ఈ సందర్భంగా పలు కంపెనీలతో లోకేశ్ ఎంవోయూలు కూడా చేసుకున్నారు.

డిప్యూటీపై లోకేశ్ క్లారిటీ
గత వారం రోజులుగా హాట్ టాపిక్ అయిన డిప్యూటీ సీఎం పదవిపై మంత్రి నారా లోకేశ్ తొలిసారి పెదవి విప్పారు. దావోస్‌ పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్న ఆయన ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అనే వార్తలు వస్తున్నాయి, ఇంతకీ మీ రాజకీయ ఆశయం ఏంటి? అని ప్రశ్నకు లాజిక్‌కు యువనేత బదులిచ్చారు. ‘ అవన్నీ రాజకీయపరమైన కామెంట్స్. నేను రాజకీయంగా సెటిల్‌గా ఉన్నాను. ఎన్నికల్లో 94 శాతం సీట్లలో కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించారు. నాకు ప్రస్తుతం చేతి నిండా పని ఉంది. అంతకుమించి నాపై బాధ్యత కూడా ఉంది. నాకు అప్పగించిన శాఖలపై పనిచేస్తున్నాను. గత ఐదేళ్లలో రాష్ట్రం ఇబ్బందుల పాలైంది. ఆంధ్రా మెడల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. సీఎం చంద్రబాబు ఇచ్చిన టార్గెట్‌ 2.5 ట్రిలియన్ల డాలర్ల ఎకానమీకి చేరుకోవాలి’ అని లోకేశ్ వెల్లడించారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం