Nagababu MLC
ఆంధ్రప్రదేశ్

Nagababu MLC: నాగబాబుకు ఆ ఛాన్స్ ఉందా? లేదా?

స్వేచ్ఛ సెంట్రల్ డెస్క్:Nagababu MlC: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన నుంచి కొణిదెల నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉగాది తర్వాత మెగా బ్రదర్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడి వరకూ అంతా ఓకేగానీ ఆయన్ను ఒక్కడినే కేబినెట్‌లోకి తీసుకుంటారా? పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందా? ఉంటే డేంజర్ జోన్‌లో ఉన్నదెవరు? రేసులో ఉన్నదెవరు? ఏ ప్రాంతం నుంచి ఎవరికి మంత్రి అయ్యే అవకాశాలున్నాయ్? సంక్రాంతికే మార్పులు ఉండొచ్చని జరిగిన ప్రచారం కాస్త ఉగాది దాగా వెళ్లిందా? అసలు చంద్రబాబు మనసులో ఏముంది? నాగబాబు ఇచ్చే శాఖ ఏంటి? మెగా కాంపౌండ్, జనసేనలో జరుగుతున్న చర్చేంటి? శాఖల మీద పట్టు పెంచుకోని మంత్రుల సంగతేంటి? ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని ప్రశ్నలు కూటమి పార్టీల శ్రేణులను వెంటాడుతున్నాయి. వీటన్నింటికీ అతి త్వరలోనే సమాధానాలు దొరుకుతాయని ప్రభుత్వ, టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఒక్కడితోనే సరిపెట్టుకుంటారా?
నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం కన్ఫామ్ అయ్యింది. ఆయన ఒక్కడితోనే సరిపెట్టుకుంటారా? లేదంటే పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందా? అని ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. మరోవైపు తొలి దఫాలో కేబినెట్‌లోకి తీసుకోకపోవడంతో ఈసారైనా లక్కీ ఛాన్స్ వస్తుందేమో అని సీనియర్లు, పలువురు ఆశావహులు ఎంతగానే ఎదురుచూపుల్లో ఉన్నారు.

వాస్తవానికి మంత్రివర్గ విస్తరణపై నవంబర్ నుంచే ప్రచారం నడుస్తోంది. సంక్రాంతికి కచ్చితంగా కొందరు మంత్రులను పక్కనెట్టి మార్పులు చేర్పులు చేయవచ్చని తొలుత ప్రచారం జరిగింది. కానీ ఎందుకో ఆ ప్రక్రియ ఆచరణలోకి రాలేదు.

వాస్తవానికి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి దక్కించుకున్న పలువురిపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. శాఖలపై పట్టు పెంచుకోకపోవడం, పనితీరు సరిగ్గా లేకపోవడంతో ఇప్పటికే వారందరికీ వ్యక్తిగతంగా, ఫోన్లు ద్వారా సీఎం క్లాస్ తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే తీవ్రంగానే హెచ్చరించారు కూడా.

ఆ మధ్య ర్యాంకులు ప్రకటించిన ముఖ్యమంత్రి మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే వారిలో ఇసుమంత కూడా మార్పు రాలేదట. ఇవన్నీ ఒకెత్తయితే ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో కొందరు మంత్రులపై తీవ్ర అసంతృప్తికి లోనైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ కాస్త నిశితంగా పరిశీలిస్తే నాగబాబుతో పాటు కొందరు మంత్రులను పక్కనపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

సీఎం ఆలోచనలో పడ్డారా?
కొందరు మంత్రులపై పలు విషయాల్లో సీఎం అసంతృప్తిగా ఉన్నప్పటికీ, వారిని ఇప్పటికిప్పుడు తొలగిస్తే పరిస్థితేంటి? ఏడాదికి ముందే మార్పులు చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయా? ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో? విపక్షాల నుంచి ఎలాంటి విమర్శలు వస్తాయో? ఇప్పుడు ఉన్న మంత్రులే శాఖలపై పట్టు పెంచుకోవడానికి ఇంకా సమయం తీసుకుంటూ ఉండటంతో.. మార్పులు, చేర్పులు జరిగాక కొత్త వ్యక్తులకు ఇంకెంత సమయం పడుతుందో? అని ముఖ్యమంత్రి ఆలోచనలో పడ్డారని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే కేవలం నాగబాబుతోనే సరిపెట్టొచ్చని కొందరు టీడీపీ పెద్దలు చెబుతున్నారు. లేదు తప్పకుండా మార్పులు చేర్పులు ఉంటాయని ఈ దఫా సీనియర్లకు, మరో మహిళా ఎమ్మెల్యేకు అవకాశం దక్కుతుందని మరికొందరు నేతలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఈసారి విస్తరణలో బీజేపీ నుంచి మరొకరికి అవకాశం దక్కినా దక్కొచ్చని ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు కొన్ని శాఖల్లో అధికారులదే పెత్తనం సాగుతోందని మంత్రుల పనితీరుకు కొలమానం ఏమిటి? అనే చర్చ సైతం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇందులో ఏది నిజం? ఏది ప్రచారం? అనేదానిపై అతి త్వరలోనే క్లారిటీ వస్తుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాట.

డేంజర్ జోన్‌, రేసులో ఉన్నదెవరు?
మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, కొలుసు పార్థసారధిలు డేంజర్‌ జోన్‌లో ఉన్నారని మొదట్నుంచి ప్రచారం జరుగుతోంది. సామాజిక సమీకరణల్లో భాగంగా వీరికి మంత్రి పదవులు దక్కినా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారిపై వస్తున్న ఫిర్యాదులు, ఆయా శాఖలపై పట్టు సాధించలేకపోవడం, ఒకరిద్దరిపై అవినీతి ఆరోపణలు, పార్టీలోని వారి ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లతో అధినేత ఊహించని నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదని జోరుగానే హడావుడి జరిగింది.

దీనికి తోడు వీరందరిపైనా కన్నేసిన ఇంటెలిజెన్స్ నివేదికలను కూడా సీఎంవోకు అందజేసినట్లుగా తెలిసింది. ఆ మధ్య ఓ కీలక శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న మహిళా మంత్రి ఇప్పుడు శాఖపై పట్టు, తీరు మారడంతో డేంజర్ జోన్‌లో గట్టెక్కారట. అయితే మిగిలిన నలుగురు మంత్రుల స్థానంలో ఉమ్మడి జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రెడ్డెప్పగారి మాధవీ రెడ్డి లేదా నల్లారి కిషోర్ రెడ్డి, సీనియర్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సివస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవకాశం దక్కుతుందని చర్చ నడుస్తోంది. ఇక మిగిలిన ముగ్గురి విషయంలోనూ పలువురు జూనియర్లు, సీనియర్ల పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.

మెగా బ్రదర్‌కు ఏ శాఖ?
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరున్న కీలక శాఖల్లో ఒకటి నాగబాబుకు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇది వీలుకాని పక్షంలో కందుల దుర్గేష్‌ దగ్గరున్న సినిమాటోగ్రఫీ శాఖ తీసుకోవచ్చని సమాచారం. శాఖల విషయంలో ప్రత్యేకించి మెగా బ్రదర్‌కు కేటాయించడానికి ఏమీ ఉండదని, జనసేన నుంచి మంత్రులుగా ఉన్న ముగ్గురి నుంచే కోతవేసి ఇస్తారట. వాస్తవానికి జనసేన నుంచి ఉన్న ముగ్గురి దగ్గర ఉన్నవి కూడా కీలక శాఖలే.

అయితే ఎక్కువగా సినిమాటోగ్రఫీ తీసుకోవడానికే నాగబాబు కూడా సుముఖంగా ఉన్నారని అటు మెగా కాంపౌండ్‌లో ఇటు జనసేనలో చర్చ సాగుతోంది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి చెందిన మనిషి కావడం, ఇదివరకే ‘మా’ (మూవీ ఆర్టి్స్ట్ అసోసియేషన్) ఛైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉండటం, రాష్ట్రానికి సినీ ఇండస్ట్రీని రప్పించడానికి, స్టూడియోల నిర్మాణానికి ఇండస్ట్రీ వ్యక్తి అయితే బాగుంటుందని సీఎం, డిప్యూటీ సీఎంలు కూడా ఇప్పటికే ఫిక్స్ అయ్యారని తెలుస్తున్నది. చివరికి నాగబాబు శాఖ విషయంలో, విస్తరణ విషయంలో ఏం జరుగుతుందో? చూడాలి.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు