అమరావతి, స్వేచ్ఛ: Purandeswari on YCP: గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో అభివృద్ధికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయిందన్నారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నూతన అధ్యక్షులు, జిల్లా ఇన్‌ఛార్జీలు, ఆహ్వానితులతో పురందేశ్వరి భేటీ అయ్యారు. సంస్థాగత అంశాలు, రాజకీయ కార్యాచరణపై లోతుగా చర్చించారు.
ఏప్రిల్ 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 14న అంబేద్కర్ జయంతి నిర్వహణపై నేతలకు ఆమె పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా పురందేశ్వరి మాట్లాడుతూ గత ఐదేళ్లు ప్రశ్నించిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టారని మండిపడ్డారు. ‘ రోడ్ల దుస్థితి మరీ దారుణంగా తయారైంది. మద్యం, విద్యుత్‌లో భారీగా అక్రమాలకు వైసీపీ నేతలు పాల్పడ్డారు. బీజేపీ ప్రజాగళం వినిపించింది కాబట్టే ఈరోజు ఏపీ డబల్ ఇంజన్‌తో అభివృద్ధి సుపరిపాలన అందిస్తోంది. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమన్వయంతో ముందుకు సాగుతున్నారు.
Also read: BJP party: హైదరాబాద్ స్థానికంపై బిజెపి డైలమా? అసలేం జరుగుతోంది?
కేంద్రం ఏపీకి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నది. అందులో భాగంగానే నిధులను అందిస్తోంది. బీజేపీ పేదరిక నిర్మూలనకు కట్టుబడి ఉంది. అందుకే పీ4 కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాంతర ఆలోచనలతో ఎందుకు వెళ్తున్నాయి. కూటమి పాలనను ప్రజలు హర్షిస్తున్నారు. జిల్లాల అధ్యక్షులతో పార్టీ సంస్థాగత విషయాలపై చర్చిస్తున్నాం’ అని పురందేశ్వరి వెల్లడించారు.