Janasena vs TDP: జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం పర్యటన రచ్చ రచ్చగా మారింది. టీడీపీ- జనసేనల మధ్య వివాదం బట్టబయలైంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా మెగాబ్రదర్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అయితే ఈ రెండ్రోజుల పర్యటనలోనూ టీడీపీ, జనసేన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడం, ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడంతో నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇవన్నీ ఒకెత్తయితే ఈ పర్యటనకు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ హాజరుకాలేదు.
ఆయనకు కనీసం పిలుపు రాకపోవడంతో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఫైర్ అయ్యారు. కుమారపురం గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చిన నాగబాబును అడ్డుకుని, టీడీపీ కార్యకర్తలు ‘జై వర్మ.. జై తెలుగుదేశం’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో జనసేన నేతలపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు.
Also read: Nara Lokesh: ‘నేనున్నా.. మిమ్మల్ని టచ్ చేయలేరు’.. మహిళకు లోకేష్ భరోసా
ఈ విమర్శలు, బలప్రదర్శన వాగ్వాదానికి దారి తీసింది. దీంతో తనను దూషించారని జనసేన నేత ఫిర్యాదుతో చినజగ్గంపేటకు చెందిన టీడీపీ నేతలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ నేతలను అదుపులోనికి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ కేసుల వ్యవహారంపై టీడీపీ నేతలు, వర్మ గుర్రుగా ఉన్నారని తెలిసింది. దీనిపై ఇంతవరకూ స్పందించనప్పటికీ, ఎలా ముందుకెళ్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.