SVSN Varma Tweet: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ట్వీట్ చేశారు. పవన్ పర్యటన సంధర్భంగా జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని వర్మ ఈ ట్వీట్ చేశారని చెప్పవచ్చు. వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసింది. ఆ ట్వీట్ పరమార్థం ఏమిటంటే..
పిఠాపురం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం పిఠాపురం ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరించే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ సైతం పాల్గొన్నారు.
గతంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన సమయంలో టిడిపి కార్యకర్తలు కాస్త హంగామా చేసిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో వర్మ పాల్గొనకుండా దూరంగా ఉన్నారు. అందుకు ఎన్ని కారణాలు ఉన్నా, వర్మ మాత్రం ఆ పర్యటనకు దూరంగా ఉన్నారు. అయితే టిడిపి కార్యకర్తలు మాత్రం తమ హవా సాగించారు. ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ పర్యటన సందర్భంగా ఆహ్వానం అందుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ అక్కడికి టిడిపి శ్రేణులతో కలిసి చేరుకున్నారు.
ఇక్కడే వర్మ వెంట వచ్చిన వారిని పోలీసులు అనుమతించలేదు. దీనితో వర్మ సైతం బయటే ఉండిపోయారు. స్వయంగా పవన్ వచ్చి మరీ వర్మను పార్టీ శ్రేణులను తీసుకువెళ్లారు. కానీ ఇక్కడే వర్మకు ఎస్పీ కి వివాదం సాగిందని వార్తలు వినిపించాయి. వర్మతో పాటు వచ్చిన శ్రేణులను అనుమతించమని ఎస్పీ స్వయంగా చెప్పడంతో వర్మ కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఇదే ఇప్పుడు వర్మ ట్వీట్ కు కారణమైంది.
Also Read: Tirumala Updates: తిరుమలలో ఇకపై అలా చెల్లదు.. వారికి వార్నింగ్..
వర్మ ట్వీట్ ఏమిటంటే.. రాష్ట్రంలో ఇంకా వైసిపి అధికారంలోనే ఉందన్న భ్రమలో ఓ జిల్లా పోలీస్ అధికారి ఉన్నారని, తెలుగుదేశం పార్టీ జెండా అంటే అంత చిన్న చూపా అంటూ ట్వీట్ చేశారు.
అయినా క్రమశిక్షణతో భరిస్తున్నామని ట్వీట్ చేశారు. అంటే తనకు జరిగిన అవమానాన్ని ఇలా వర్మ వ్యక్తపరిచారని అనుకోవచ్చు. మొత్తం మీద పవన్ పర్యటన పూర్తి కాగానే వర్మ ట్వీట్ చేయడం ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. మరి దీనికి జనసేన ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
రాష్ట్రంలో ఇంకా వైసిపి అధికారంలోనే ఉందన్న భ్రమలో ఓ జిల్లా పోలీస్ అధికారి
తెలుగుదేశం పార్టీ జెండా అంటే అంత చిన్న చూపా
అయినా క్రమశిక్షణతో భరి స్తున్నాం
— SVSN Varma (@SVSN_Varma) April 25, 2025