SVSN Varma: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోవడంతో కొద్దిరోజులుగా అసంతృప్తిగా ఉన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఎట్టకేలకు అలక వీడారు. ఆదివారం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో నిరాశకు గురయ్యారు. కూటమిలో భాగంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో తన సీటును పవన్ కళ్యాణ్ కు త్యాగం చేసిన వర్మ… తనకు ఇక ప్రాధాన్యం లేదని అనుచరుల వద్ద వాపోయారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం కూటమి నాయకులు, కార్యకర్తలు వర్మను కలిసి ఆయనను బుజ్జగించారు. దీంతో ఆయన అలక వీడారు.
అనంతరం వర్మ మాట్లాడుతూ… రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని, నియోజకవర్గస్థాయిలోనే పదవులు విభజించాలంటే తీవ్ర ఒత్తిడి ఉంటుందని, దానికే మథనపడిపోతుంటామని, అలాంటిది రాష్ట్రవ్యాప్తంగా పదవులు ఇవ్వాలంటే అనేక ఇబ్బందులు ఉంటాయని మద్దతుగా మాట్లాడారు. పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు పోతామని చెప్పారు. ఇక, తమ నాయకుడు సీఎం చంద్రబాబుతో తనది 23 ఏళ్ల ప్రయాణమని, ఈ ప్రస్థానంలో ఎన్నో సమస్యలపై పనిచేశామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆదేశాలకు తనతో పాటు తన కుటుంబం, పిఠాపురం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు కట్టుబడి ఉంటామని తెలిపారు.
పిఠాపురం పవన్ అడ్డా: నాదెండ్ల
పిఠాపురం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అడ్డా అని మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) వ్యాఖ్యనించారు. మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల అంశంపై స్పందించారు. అందులో భాగంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వర్మ అలక విషయం పలువురు ప్రస్తావించగా… ఆయన సీనియర్ నేత అని చెప్పారు. ఇక ఆయనకు టికెట్ దక్కకపోవడం అనేది టీడీపీ అంతర్గత వ్యవహారమని అన్నారు. ఈనెల 14న పిఠాపురం మండలం చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పిఠాపురం ప్రజలకు కృతజ్ఞత చెప్పేందుకే ఈ సభను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సభ పూర్తయ్యాక పారిశుద్ధ్య బాధ్యత కూడా పార్టీనే తీసుకుంటుందన్నారు.