Kadapa New Mayor: ఆంధ్రప్రదేశ్ లోని కడప మేయర్ సురేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. కొత్త మేయర్ ఎంపికకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 7న మేయర్ ఎన్నికకు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నెల 11న కొత్త మేయర్ ను కార్పోరేటర్లు ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే అవినీతి ఆరోపణల నేపథ్యంలో వైసీపీ నేత అయిన సురేష్ బాబును ఏపీ ప్రభుత్వం తొలగించింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మేయర్ ఎంపిక వరకూ డిప్యూటీ మేయర్ ముంతాజ్ భేగం ను ఇన్చార్జ్ మేయర్ గా నియమిస్తూ ఇటీవల మున్సిపల్ శాఖ సెక్రటరీ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
మేయర్‌పై ఆరోపణలు ఏంటంటే?
కడప మేయర్ గా సురేష్ బాబు అవినీతి పాల్పడుతున్నారంటూ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై మున్సిపల్ శాఖ విజిలెన్స్ అధికారులతో విచారణ ఆదేశించింది. కడప నగరపాలక సంస్థల్లో ఆయన తన కుటుంబీకుల ద్వారా సివిల్ కాంట్రాక్టులు చేపట్టారని విజిలెన్స్ అధికారులు తేల్చారు. దీంతో ఈ ఏడాది మార్చి 24న ఏపీ పురపాలక శాఖ ఆయనకు నోటీసులు జారీ చేసింది. మే నెలలో మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టును ఆశ్రయించిన మేయర్
తనను మేయర్ పదవి నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ సురేష్ బాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 17న హైకోర్టులో వాదనలు జరిగాయి. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి.. విజిలెన్స్ విచారణలో బయటపడ్డ అంశాలను కోర్టు ముందు ఉంచారు. దీంతో సురేష్ బాబు తొలగింపునకు హైకోర్టు ఎలాంటి అడ్డంకులు విధించలేదు. ఫలితంగా పురపాలక శాఖ మరోసారి సురేష్ బాబును పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: Putin Lands in Delhi: ఢిల్లీలో అడుగుపెట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ
వైసీపీలో గుబులు..
త్వరలో కడప కొత్త మేయర్ ఎంపిక జరగనున్న నేపథ్యంలో వైసీపీకి కొత్త భయాలు మెుదలయ్యాయి. 2021 మున్సిపల్ ఎన్నికల్లో 50 డివిజన్లకు గాను 48 వైకాపా గెలుచుకుంది. టీడీపీ 1, ఇండిపెండెంట్ ఒక స్థానంలో విజయం సాధించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైసీపీ కార్పోరేటర్లు మూడు వర్గాలుగా చీలి పోయారు. వైకాపాను వీడి ఏడుగురు కార్పోరేటర్లు టీడీపీలో చేరారు. ఇద్దరు కార్పోరేటర్లు మృతి చెందారు. ప్రస్తుతం 40 మంది కార్పోరేటర్లతో వైసీపీ బలంగానే కనిపిస్తోంది. కానీ కూటమి ప్రభుత్వం ఏదైనా ప్రలోభాలకు గురిచేసి.. తమ కార్పోరేటర్లను లాక్కుంటుందన్న ఆందోళనలో వైసీపీ నేతల్లో ఉంది. ఈ నేపథ్యంలో కడప మేయర్ ఎంపిక ఆసక్తికరంగా మారనుంది.
