Sri Sathya Sai Jayanthi: ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. అలాగే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయితో తమకు ఉన్న అనుబంధాన్ని, ఆయన సేవా గుణాన్ని ప్రముఖులు గుర్తుచేసుకున్నారు.
30 లక్షల మంది దాహం తీర్చారు: సీఎం
శతజయంతి ఉత్సవాల్లో భాగంగా సీఎం చంద్రబాబు.. దివంగత సత్యసాయి గురించి మాట్లాడారు. సేవ, ప్రేమకు ఆయన ప్రతిరూపమని వ్యాఖ్యానించారు. తమకు తెలిసిన, ప్రత్యక్ష్యంగా చూసిన దైవం.. సత్యసాయి అని కొనియాడారు. అంతేకాదు ఆయన 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీటిని అందించారని చంద్రబాబు గుర్తుచేశారు. 102 విద్యాలాయాలు, ఎన్నో వైద్యాలయాలు, 140 దేశాల్లో సత్యసాయి ట్రస్టులు స్థాపించి సేవలు అందించారని పేర్కొన్నారు. ఆయన స్థాపించిన ట్రస్టుల్లో ఏకంగా 7 లక్షల మంది వాలంటీర్లు ఉండేవారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారని చంద్రబాబు కొనియాడారు.
Also Read: BC Reservations: గందరగోళంలో బీసీ లీడర్లు.. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా సాధ్యం..?
మన కంటే విదేశీయులకే బాగా తెలుసు: పవన్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో మాట్లాడారు. ‘సత్యసాయి గొప్పతనం గురించి మన భారతీయులకంటే విదేశీయులకే ఎక్కువ తెలుసు. చైనీయులు ఆయన చిత్రపటాన్ని, విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టుకుని ఆరాధిస్తారు. గతంలో ఓ ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ సత్యసాయి దర్శనం కావాలని చిరంజీవిని అడిగితే నేను ఆశ్చర్యపోయాను. కరవు ప్రాంతమైన అనంతపురంలో పుట్టిన సాయిబాబా.. సురక్షిత మంచినీరు అందించి ప్రజల దాహార్తి తీర్చారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్ కి అంకురార్పణ చేసింది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ అని పనన్ కళ్యాణ్ అన్నారు.
సత్యసాయి జీవిత మనకు పాఠం: లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్.. సత్యసాయి జీవన శైలి గురించి మాట్లాడారు. ఇక్కడి ప్రశాంతి నిలయం.. ప్రశాంతతకు ఆలయమని పేర్కొన్నారు. సత్యసాయి జీవితం.. మనందరికీ ఒక పాఠమని అన్నారు. భగవాన్ స్ఫూర్తి భావితరాలకు మార్గనిర్దేశమని లోకేశ్ అభిప్రాయపడ్డారు. సమాజానికి సత్యసాయి ట్రస్ట్ అద్భుతమైన సేవలను అందిస్తోందని లోకేశ్ కొనియాడారు. మనసులో ఆయన పట్ల ప్రేమ ఉన్నంతవరకూ సత్యసాయి మనతోనే ఉంటారని లోకేశ్ వ్యాఖ్యానించారు. ‘సేవే మన కులం.. సమానత్వమే మన మతం’ అని సత్యసాయి చెప్పారని దానిని ప్రతీ ఒక్కరూ పాటించాలని లోకేశ్ సూచించారు.
సేవ చేయడమే సత్యసాయి లక్ష్యం: సచిన్
సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సైతం మాట్లాడారు. బాబాతో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. ప్రజలను ఎప్పుడు జడ్జ్ చేయకూడదని.. వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి ఎప్పుడూ చెప్పేవారని సచిన్ అన్నారు. ఇలాంటి ఆలోచన ధోరణి వల్ల ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయని పేర్కొన్నారు. అంతేకాదు ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యంగా సత్యసాయి పెట్టుకున్నారని సచిన్ గుర్తుచేశారు. బలహీలన వర్గాలకు సాయం చేయడంలోనే నిజమైన గెలుపు ఉందని ఆయన నిరూపించినట్లు పేర్కొన్నారు. 2011 వరల్డ్ కప్ ఆడుతున్న సమయంలో చాలా ఎమోషనల్ గా ఉండేవాడినని.. ఈ విషయాన్ని ఆ సమయంలో సత్యసాయి తనకు ఫోన్ చేసి ఓ పుస్తకాన్ని పంపారని తెలిపారు. ఆ బుక్ తనలో ఎంతో స్ఫూర్తిని రగిలించినట్లు సచిన్ పేర్కొన్నారు.
