AP Free Bus: ఏపీలో ఉచిత బస్సు స్కీమ్ (స్త్రీ శక్తి) ప్రారంభమైంది. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అంతకుముందు చంద్రబాబుతో పాటు, పవన్.. మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఉండవల్లి నుంచి విజయవాడ బస్టాండ్ వరకూ వచ్చారు. ఈ సందర్భంగా బస్సులో జీరో ఫేర్ టికెట్ ను ఓ మహిళకు చంద్రబాబు అందజేశారు. మరోవైపు చంద్రబాబు బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో దారి పొడవునా మహిళలు మంగళహారతులు ఇచ్చారు. బస్సు వెళ్లే ప్రధాన సెంటర్లలో ప్రజలు తీన్ మార్ నృత్యాలతో హోరెత్తించారు. దీంతో విజయవాడలో పండగ వాతారణం కనిపించింది.
‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’
ఎన్నికల వేళ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల్లో భాగంగా ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక హామీని నెరవేర్చింది. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘స్త్రీశక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు (Chandrababu) లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం గురించి ఆ రోజు చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదని చంద్రబాబు అన్నారు. ‘ఈరోజు గర్వంగా చెబుతున్నా సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ అని అన్నారు. గత వైసీపీ పాలనలో ప్రజలు ఐదేళ్లపాటు నవ్వడమే మర్చిపోయారని చంద్రబాబు అన్నారు. ఇంటా బయట ప్రజలకు ఆనందం లేకుండా పోయిందని పేర్కొన్నారు.
స్త్రీ శక్తి పథకంపై..
ఉచిత బస్సు పథకం (స్త్రీ శక్తి) పథకంపై ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషకరమని అన్నారు. మహిళలకు మేలు చేస్తున్నామన్న తృప్తి కలుగుతోందని పేర్కొన్నారు. ‘మహిళలకు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాం. మహిళా సాధికారిత కోసమే డ్వాక్రా, మెప్మా సంఘాలు ఏర్పాటు చేశాం. ఆర్టీసీ కండక్టర్లుగా తొలుత మహిళలను తీసుకున్నది మేమే. మహిళలు త్వరలో ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా రావాలి. ఉచిత బస్సు వల్ల 2.62 కోట్ల మంది మహిళలకు లబ్ధి కలుగుతుంది’ అని చంద్రబాబు అన్నారు.
Also Read: UP Horror: భార్య చేతిలో చివాట్లు.. కోపంతో బిడ్డను చంపేసిన భర్త.. ఎక్కడంటే?
మాట నిలబెట్టుకున్నాం: పవన్
స్త్రీ శక్తి పథకం ఆవిర్భావ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల వేళ మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు చెప్పారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం, స్వేచ్ఛ లభిస్తాయని పవన్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం 8,450 బస్సులు సిద్ధం చేసినట్టు పవన్ చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలను సమర్థంగా అమలు పేర్కొన్నారు. అన్ని అవరోధాలను అధిగమిస్తూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ ముందుకు సాగుతోందని పవన్ చెప్పుకొచ్చారు.