CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఎట్టకేలకు తన తప్పు తెలుసుకున్నారు. ఈ మాటలన్నది ఎవరో కాదు సాక్షాత్తు సీఎం చంద్రబాబు. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టే నైజం గల చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ టాక్ ఆఫ్ ది టాపిక్ గా మారాయి. ఇంత వైరల్ అయ్యేలా చంద్రబాబు ఏం చెప్పారో చూద్దాం.
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. అది కూడా గతంలో తాను ఓటమి చెందిన విషయాన్ని ప్రస్తావించి చంద్రబాబు మాట్లాడడం విశేషం. సుధీర్ఘ రాజకీయ చరిత్ర గల చంద్రబాబు 2004, 2019 ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోలేక పోయారు. ఆ సమయంలో టిడిపి విజయం గ్యారంటీ అంటూ అందరూ భావించినా, రెండు సార్లు పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.
2004 ఎన్నికల్లో దివంగత సీఎం వైఎస్సార్ సీఎం కాగా, చంద్రబాబు అధికారాన్ని చేజికించుకోలేక పోయారు. 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారాన్ని చేజిక్కించుకోగా వైఎస్సార్ కుమారుడు జగన్ సీఎం అయ్యారు. ఈ రెండు దఫాలు టిడిపి అధికారాన్ని చేజిక్కించుకోలేక పోయింది. 2024 ఎన్నికల్లో మాత్రం జనసేన, బిజెపితో జత కలిసిన టిడిపి యావత్ దేశం తమవైపు చూసేలా 164 సీట్లను దక్కించుకుంది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ భాద్యతలు చేపట్టారు.
ఈ ఎన్నికల్లో ఎదుర్కొన్న ఓటమి గురించే చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సోమవారం అసెంబ్లీ వేదికగా చంద్రబాబు మాట్లాడుతూ.. 2004, 2019లో తననెవరూ ఓడించలేదని, ఆ ఎన్నికల్లో ఓటమికి తానే కారణమన్నారు. కొన్ని పనులు చేయలేకపోవడం వల్లే ఓడిపోయామని, పనిలో పడి పార్టీ, ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేకపోయినట్లు చెప్పారు. ప్రజాసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితే ఓటమి ఉండదని చంద్రబాబు అన్నారు.
అలాగే 2047 వికసిత్ భారత్ ను ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని, మనం కూడా స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ రూపొందించామన్నారు. 2047 నాటికి ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారడమే లక్ష్యమని, 2047 విజన్ అని చెప్పి, 20-30 ఏళ్ళ గురించి మాటలు చెప్పటం లేదన్నారు. ఆ లక్ష్యం సాధించటానికి ఇప్పటి నుంచే పని చేస్తున్నట్లు, ప్రతి ఏడాది ఒక టార్గెట్ పెట్టుకుని పని చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.11 శాతం మేర వృద్ధి రేటు సాధించేలా లక్ష్యం పెట్టుకుని, దాని కోసం పని చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: TTD News: శ్రీవారి దర్శన టికెట్ల జారీలో మార్పులు.. కీలక ప్రకటన జారీ చేసిన టిటిడి..
మొత్తం మీద రెండు దఫాల ఓటమికి తానే కారణమని చంద్రబాబు అంగీకరించడంతో స్థానిక ఎమ్మెల్యేలు ఖంగుతిన్నారు. అప్పుడు జరిగిన పొరపాటును తప్పక సరిదిద్దుకుంటామని చంద్రబాబు అనడంతో ఎమ్మెల్యేలందరూ సైలెంట్ అయ్యారు. అయితే ఇక్కడే రాజకీయ విశ్లేషకులు కొత్త మాట లేవనెత్తారు. బాబు తన తప్పు తెలుసుకొని, వ్యవహార శైలిలో కూడా మార్పు చూపిస్తుంటే, మరి జగన్.. తన తప్పు ఎప్పుడు తెలుసుకుంటారోనని విశ్లేషకుల మాట.2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైన విషయం తెలిసిందే. ఏదో ఒకటి తగ్గింది పుష్పా అంటూ సినిమా డైలాగ్ మాదిరిగా అసలేం జరిగిందనే కోణంలో జగన్ ఆలోచించాలని వారు సూచిస్తున్నారు.