అమరావతి, స్వేచ్ఛ : సంపద సృష్టించలేని, ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని నాయకులు వేస్టే అని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. ఏపీ, ఢిల్లీ పరిస్థితులను గుర్తు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని, మౌలిక వసతులు వస్తాయని అన్నారు.
సుపరిపాలన ఇస్తే మంచి రాజకీయాలకు నాంది పలికినట్లేనని, 1991 తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని గుర్తు చేశారు. ఆ ఆర్థిక సంస్కరణలను తెలుగు బిడ్డ పీవీ తీసుకువచ్చారని, 1995-2024 మధ్య మన తలసరి ఆదాయం 9 రెట్లు పెరిగిందని వివరించారు.
ఇది దేశ ప్రజల గెలుపు
హస్తినలో ఎన్డీఏ గెలుపు, కేవలం అక్కడి ప్రజల గెలుపు కాదని, ఇది దేశ ప్రజల గెలుపుగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పేర్కొన్నారు. పీపుల్స్ ఫస్ట్ అనే మోడల్ మాత్రమే పని చేస్తుందని ఈ ఎన్నిక మరోసారి నిరూపించిందన్నారు. ఢిల్లీ ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మంచి నాయకత్వంలో ముందుకెళ్తే 2047 నాటికి అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయని తెలిపారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారి, అక్కడి ప్రజలు తరలిపోతున్నారని అన్నారు.
ఏపీ, ఢిల్లీకి పోలికలు
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పాలనలో జరిగిన మద్యం స్కాంతో పోల్చుకుంటే, ఢిల్లీలో కేజ్రీవాల్ పాలనలో జరిగిన స్కాం చాలా చిన్నదని చంద్రబాబు చెప్పారు. మద్యం కుంభకోణంలో వచ్చే డబ్బు పాపిష్టిదని, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి, వేల కోట్లు దోచుకున్నారని విమర్శలు చేశారు. ఆప్ పాలనలో ఢిల్లీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయిందని అన్నారు. కొన్ని విధానాల వల్ల కాలుష్య నగరంగా మారిందని వివరించారు.
ఏపీలో, ఢిల్లీలో అమలు చేసిన పాలసీలకు విజయం దక్కలేదని వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలను వైసీపీ, ఆప్ పట్టించుకోలేదని, అందుకే ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ‘‘ఢిల్లీలో షీష్ మహల్, మనకి ఇక్కడ రుషికొండ ప్యాలెస్. ఇలాంటి విచ్చలవిడితనాన్ని ప్రజలు ఆమోదించరు అని చెప్పటానికి, మొన్న ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఒక ఉదాహరణ. రెండు చోట్లా వాళ్ళు కట్టుకున్న ప్యాలెస్‌లోకి ప్రజలు వెళ్ళనివ్వకుండా తీర్పు ఇచ్చారు’’ అని చెప్పారు.
బీఆర్ఎస్‌పై సెటైర్
రాష్ట్రాల్లో సుపరిపాలన ఇస్తే మంచి రాజకీయాలకు నాంది పలికట్టు అవుతుందని చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. ఈ సందర్భంగా తన అరెస్ట్, తెలంగాణలో బీఆర్ఎస్ పాలనపైనా స్పందించారు. ‘‘నా అరెస్ట్ సమయంలో 60 దేశాల్లో నిరసనలు తెలిపారు. అప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ నిరసన ప్రదర్శనలను అణగదొక్కాలని చూసింది. తర్వాత ఆ ప్రభుత్వం ఫలితాన్ని అనుభవించింది. ప్రజలు వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.
నాకు వ్యక్తులను విమర్శించాలని ఉండదు. వాళ్లు అవలంభించిన విధానాలు సరిగా లేవు. కమ్యూనిస్టులకు ఒకప్పుడు మంచి ఆదరణ ఉండేది. కాలానికి తగ్గట్టు ఎవరైనా మారాలి. నేను ఎప్పుడూ సిద్ధాంతాల ఆధారంగానే రాజకీయాలు చేశా కానీ, వ్యక్తిగతంగా ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు. ఈ రోజు మన రాష్ట్రంలో ఇలాంటి అహంకారులతో రాజకీయాలు చేయాల్సి వస్తున్నందుకు బాధగా ఉంది’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.