Buggana Rajendranath
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Andhra Pradesh: చంద్రబాబు పచ్చి అబద్దాలు.. సూపర్ సిక్స్‌పై నిస్సిగ్గుగా ప్రకటన!

Andhra Pradesh: ఏడాది కూటమి పాలనలో చంద్రబాబు నిస్సిగ్గుగా సూపర్ సిక్స్ (Super Six) హామీలను అమలు చేశానంటూ పచ్చి అబద్దాలు మాట్లాడారని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ పాలనలో అప్పులు తగ్గి, ఆదాయం పెరిగితే, కూటమి ఏడాది పాలనలో ఆదాయం తగ్గి, అప్పులు పెరిగాయంటూ సాధికారికంగా పూర్తి ఆధారాలను, గణాంకాలను వెల్లడించారు. వాస్తవాలను దాచిపెట్టి, అద్భుతమైన పాలనను అందించామని, హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తే సహించనంటూ చంద్రబాబు బెదిరింపులకు దిగడం ఆయన దిగజారుడుతనంకు నిదర్శనమని ధ్వజమెత్తారు. తాను వెల్లడించిన గణాంకాలు వాస్తవం కాదు అని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. ‘ తల్లికి వందనం స్కీమ్ ప్రారంభం, ఏడాది పాలన పూర్తి సందర్భంగా చంద్రబాబు మీడియా ద్వారా పలు అబద్దాలను మాట్లాడారు. సూపర్‌సిక్స్‌ హామీలను అమలు చేసేశామంటూ, దానిపై మాట్లాడినే నాలుక మందం అంటూ ప్రతిపక్షంతో పాటు ప్రజలకు కూడా హెచ్చరిక వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఆర్థికశాఖపై ముఖ్యమంత్రే సమీక్ష చేస్తుంటే, ఇక ఆర్థికశాఖ మంత్రి ఏం చేస్తున్నారు? ఎక్సైజ్ రెవెన్యూ తాకట్టు పెట్టలేదని మాట్లాడుతున్న చంద్రబాబు రాష్ట్రానికి చెందిన మొత్తం ఖనిజ సంపదను రూ.9000 కోట్లకు తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా? ప్రభుత్వరంగ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీకి 300 పైచిలుకు మైనింగ్ లీజులు అప్పచెప్పి, వాటిపై అప్పులు తీసుకుంటున్న విషయం నిజం కాదా? చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ఖజానానే అప్పులు ఇచ్చిన వారికి హామీగా పెట్టి, రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా డబ్బు తీసుకునేందుకు అనుమతించలేదా?’ అని బుగ్గన ప్రశ్నించారు.

Buggana Rajendranath

పథకాల అమలు ఎప్పుడు?
‘ ఎన్నికల ముందు తల్లికి వందనం (Thalliki Vandanam) కింద ప్రతి విద్యార్ధికి రూ.15వేల చొప్పున 87 లక్షల మందికి ఇస్తామంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. నేడు దానిలో 30 లక్షల మందికి ఎగ్గొట్టారు. అలాగే ఇస్తున్న అరకొర కూడా కేవలం రూ.13వేలు మాత్రమే ఇస్తున్నారు. యాబై ఏళ్ళ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.4000 చొప్పున పెన్షన్ ఇస్తామన్నారు. ఆడబిడ్డ నిధి కింద 2.07 కోట్ల మందికి నెలకు రూ.1500 ఇస్తామన్నారు. రాష్ట్రంలో 53.50 లక్షల మంది రైతులకు రైతుభరోసా కింద రూ.20వేలు ఇస్తామన్నారు. ఇందుకు ఏడాదికి రూ.10వేల కోట్లకు పైగా అవసరం కాగా, కేవలం రూ.1000 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారు. ఉద్యోగం రాని యువతకు నెలకు రూ.3000, మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం, రాష్ట్రంలోని 1,54,047 మందికి ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితం అని ఊదరగొట్టారు. వాటిని ఎప్పుడు ఇస్తారని నేడు ప్రజలు అడుగుతున్నారు. ప్రజల తరుఫున ప్రతిపక్షంగా వాటినే వైసీపీ అడుగుతోంది. వాటికి సమాధానంగా అన్ని సూపర్ సిక్స్ హామీలను ఇచ్చేశానని చంద్రబాబు (CM Chandrababu) చెప్పడం విడ్డూరంగా ఉంది. పెర్ఫార్మెన్స్‌ వర్సెస్ ప్రామిస్ అనే అంశంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దానిని ఒక కేస్‌ స్టడీగా తీసుకోవచ్చు. వైసీపీ హయాంలో సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి ప్రతినెలా పథకాలను నిర్ధిష్టమైన తేదీల్లో అమలు చేశాం. కోవిడ్ వంటి సంక్షోభ సమయంలోనూ పథకాలను క్రమం తప్పకుండా అమలు చేసిన ఘనత జగన్‌కు దక్కుతుంది. సూపర్ సిక్స్ అంటూ చెప్పుకునే చంద్రబాబు మొదటి బాల్‌లోనే ప్రజల దృష్టిలో అవుట్ అయ్యారు’ అని బుగ్గన వెల్లడించారు.

Buggana

Read Also- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నిజంగానే బరువు తగ్గారా.. ఎందుకిన్ని డౌట్స్?

బడ్జెట్, వ్యయాలు, సంక్షేమ లెక్కలివి
‘ వైసీపీ ప్రభుత్వ హయాం 2023-24లో బడ్జెట్ రూ.2,35,780 కోట్లు. 2024-25లో కూటమి ప్రభుత్వ బడ్జెట్ రూ.2,45,076 కోట్లు. అంటే మా కంటే కూటమి ప్రభుత్వం రూ.10వేల కోట్లు బడ్జెట్‌ ఎక్కువగా పెట్టింది. వైసీపీ (YSR Congress) హయాంలో ఏడాదికి జీతాల కోసం వెచ్చించింది రూ.52వేల కోట్లు. పెన్షన్లు రూ. 21,500 కోట్లు, వడ్డీ చెల్లింపులు రూ.29,500 కోట్లు, ఇవ్వన్నీ కలిపితే మొత్తం రూ.1,03,000 మా హయాంలో చేసిన వ్యయం. మూలధనం పెట్టుబడి కింద చేసిన వ్యయం రూ.23,300 కోట్లు. మొత్తం బడ్జెట్‌ రూ. 2,35,780 కోట్లలోనే జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు చేసిన వ్యయంను తీసేస్తే మిగిలిన నిధులు సుమారుగా రూ.1,09,000 కోట్లు. ఈ నిధుల నుంచే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రకటించిన అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేశాం. అలాగే కూటమి ప్రభుత్వంలో కూడా అన్ని వ్యయాలు, మిగులు నిధులు, వాటిని ఎలా ఖర్చు చేస్తున్నారో ఒకసారి చూద్దాం. కూటమి ప్రభుత్వం జీతాల కోసం ఖర్చు చేసింది రూ.59 వేల కోట్లు, పెన్షన్లు రూ.27 వేల కోట్లు, వడ్డీ చెల్లింపులు రూ.31వేల కోట్లు, ఇవ్వన్నీ కలిపితే కూటమి హయాంలో చేసిన వ్యయం మొత్తం రూ.1,18,000 కోట్లు. కూటమి ప్రభుత్వంలో చేసిన మూలధన పెట్టుబడి వ్యయం రూ.19వేల కోట్లు. కూటమి ఏడాది బడ్జెట్‌లోంచి జీతాలు, వడ్డీలు, పెన్షన్లకు చేసిన వ్యయం తీసేస్తే మిగిలిన నిధులు మొత్తం రూ.1,07,000 కోట్లు. మరి ఇన్ని నిధులు ఉండి కూడా ఎందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదో చంద్రబాబు వివరణ ఇవ్వాలి. కేవలం కూటమి ప్రభుత్వంలో హామీల్లో అమలు చేసింది ఒక్క వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం తప్ప మరొకటి కనిపించడం లేదు’ అని బుగ్గన తెలిపారు.

Babu And Pawan

ఏడాదిలోనే తీవ్ర ప్రజావ్యతిరేకత
‘ ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అంటున్న పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) ఎందుకు దీనిపై మౌనంగా ఉన్నారు? వైసీపీ హయాంలో ఏడాది బడ్జెట్‌, కూటమి ఏడాది బడ్జెట్‌ను భేరీజు వేసుకుంటే నిధులను ఎలా వినియోగిస్తున్నారో అర్థమవుతుంది. ఇంత స్పష్టంగా మేం లెక్కతో సహా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను అన్ని ఆధారాలతో సహా చూపిస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో అన్ని దుకాణాలు వెలవెలపోతుంటే, ఒక్క మద్యం దుకాణాలు మాత్రమే కళకళలాడుతున్నాయి. గ్రామాల్లో వ్యాపారాల కోసం కాల్‌ మనీ నుంచి ఫైనాన్స్ తీసుకుని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఏడాది కూటమి పాలనపై కేకే సర్వేలోనే తీవ్ర ప్రజావ్యతిరేకత ఉందని తేల్చి చెప్పారు. జనాభాను పెంచండి, చూసుకునే బాధ్యత నాదేనని చంద్రబాబు పదేపదే చెప్పారు. ఇప్పుడు ఆయన చేస్తున్నదేమిటీ? ఏడాది పాలన తరువాత కూటమి ప్రభుత్వంలో ప్రజలను బెదిరిస్తున్నారు, ప్రభుత్వం భయపడుతోంది. ఏడాదిలో రాష్ట్రంలో అరాచకం సృష్టించారు. చివరికి ప్రశ్నించే జర్నలిస్ట్‌లను కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి, వేధించారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వంటి సీనియర్ పాత్రికేయుడి పట్ల దుర్మార్గంగా చంద్రబాబు వ్యవహరించారు’ అని బుగ్గన విమర్శలు గుప్పించారు.

Read Also- Plane Crash: పాపం.. భార్య చివరి కోరిక తీర్చేందుకు వచ్చి..

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు