Bhogapuram Airport: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Bhogapuram Airport) ఇటీవలే చివరి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన తొలి కమర్షియల్ వ్యాలిడేషన్ ఫ్లైట్ విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ ఏడాది జూన్ నెలలో పూర్తి స్థాయిలో సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో, ఏపీ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ఘనత తమదంటే తమదంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే, ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న విశాఖపట్నం-నార్త్ ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు (Vishnukumar Raju) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
వందే భారత్‌లో వెళ్లడం బెస్ట్
భోగాపురం ఎయిర్‌పోర్టుపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే కంటే వందేభారత్‌లో విజయవాడ చేరుకోవడం సులభమని వ్యాఖ్యానించారు. ఎయిర్‌పోర్టు కనెక్టింగ్ రోడ్లు పూర్తి కావడానికి సమయం పడుతుందని ఆయన అన్నారు. రోడ్లు కూడా పూర్తి కాకుండానే ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తీసుకొస్తే ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బందులు పడతారని అన్నారు. ఎయిర్‌పోర్ట్ కంటే అదనంగా రెండు వందే భారత్ రైళ్లు వేయాలంటూ తాను కోరానని ఆయన వెల్లడించారు. ఎంపీ భరత్ చొరవ తీసుకొని రెండు వందే భారత్ రైళ్లు వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లడానికి ప్రస్తుతం రెండున్నర గంటల సమయం పడుతోందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక, విశాఖపట్నం విమానాశ్రయాన్ని యథావిథిగా కొనసాగించాలని అన్నారు. ఎయిర్‌పోర్టుపై ప్రజాభిప్రాయం తీసుకోవాలని, విమానాశ్రయం మూసివేతకు తాను వ్యతిరేకమని తన అభిప్రాయాన్ని చెప్పారు. విశాఖపట్నం అభివృద్ధిపై శుక్రవారం జరిగిన సమీక్షలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also- Ambani-Adani: వామ్మో.. ఒకే రోజు అంబానీ, అదానీలకు చెరో రూ.22 వేల కోట్లకుపైగా నష్టం.. ఎందుకంటే?
కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సమీక్షా మండలి సమావేశంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమీక్షలో రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి కూడా పాల్గొన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను కూడా విష్ణుకుమార్ రాజు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

