Bird Flu | ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. కోళ్లు గత జనవరి నెల నుంచి లక్షల్లో చనిపోతున్నాయి. ఏ పౌల్ట్రీ ఫామ్ లో చూసినా కుప్పలు, తెప్పలుగా కోళ్లు చచ్చిపోతున్నాయి. మరీ ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలోని కానూరు ప్రాంతంలోని రెండు ఫామ్ లలో చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ను మధ్యప్రదేశ్ లోని భోపాల్ నేషనల్ ల్యాబ్ కు పంపించగా.. బర్డ్ ఫ్లూ(Bird Flu) పాజిటివ్ వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దాంతో ఈ ప్రాంతంలో ఉన్న అన్ని పౌల్ట్రీ ఫామ్ లలోని కోళ్లను, గుడ్లను పూడ్చి పెట్టాలని ఆదేశించారు. ఆ ప్రాంతంలో ఉండే చికెన్ సెంటర్లను కూడా మేసేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు.
మిగతా జిల్లాల్లో పెద్దగా ఈ బర్డ్ ఫ్లూ ప్రభావం లేదని.. అక్కడి చికెన్ సెంటర్లను మూసేయాల్సిన అవసరం లేదన్నారు. ఇక పూడ్చిపెట్టిన ప్రతి కోడికి రూ.90 వరకు నష్టపరిహారం ఇస్తామన్నారు. ఉత్తర భారతదేశం నుంచి చలికాలంలో ఏపీకి వచ్చిన కొన్ని పక్షుల నుంచే ఈ బర్డ్ ఫ్లూ సోకిందని అధికారులు గుర్తించారు. ఈ వైరస్ 34 సెం.మీ వేడి దగ్గర బతకలేదని.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అంతకన్నా ఎక్కువ వేడి ఉన్నట్టు వివరించారు. ప్రజలు చికెన్ ను బాగా ఉడికించి తింటే ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.