Group-2 : ఏపీలో వాగ్వాదాల నడుమ గ్రూప్–2 మెయిన్స్ ఎగ్జామ్ నేడు నిర్వహిస్తున్నారు. ఏపీలో ఎమ్మెల్సీ కోడ్ (mlc code) ఉన్నందును ఈ ఎగ్జామ్ ను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన విభాగానికి చెందిన ముఖ్య కార్యదర్శి ఏపీపీఎస్సీ కార్యదర్శికి లేఖ కూడా రాశారు. హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉన్నందున.. ఎగ్జామ్ నిర్వహించడం స్టూడెంట్లకు మంచిది కాదని ఆ లేఖలో రాశారు. కానీ దానికి ఏపీపీఎస్సీ కార్యదర్శి ఒప్పుకోలేదు. అలా చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని..పరీక్షలు వాయిదా వేయడం కుదరదని ఏపీపీఎస్సీ కార్యదర్శి లేఖ రాశారు.
ఎన్నికలు నిర్వహిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనే ఏపీపీఎస్సీ ఉన్నట్టు అందులో చెప్పుకొచ్చారు. అయితే ఏపీపీఎస్సీ తీరుపై అటు ప్రభుత్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓ పక్క సోషల్ మీడియాలో మాత్రం పరీక్ష వాయిదా పడింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దాంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఎగ్జామ్ ఉందా లేదా అని చాలా విధాలుగా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో గ్రూప్–2 ప్రిలిమ్స్ ద్వారా 92 వేల మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పాటు.. అటు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉన్నందున ప్రభుత్వం వాయిదా వేసేందుకు మొగ్గు చూపినా..ఏపీపీఎస్సీ మాత్రం వెనక్కు తగ్గకపోవడం గమనార్హం.