AP Rains: గత రెండు రోజుల నుంచి ఏపీలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఇక కొన్నిప్రాంతాల్లో అయితే వర్షాలు బాదుడే బాదుడు అన్నట్టు పడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఈదురు గాలులు ఎక్కువయ్యాయి. గంటకు 50 నుంచి 70 కిలో మీటర్లకుపైగా వేగంతో ఈదురు గాలులతోపాటు వర్షం పడింది. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల చెట్లు, కరెంట్ తీగలు తెగపోయి విద్యుత్ కు అంతరాయం కలిగింది.ఇక వరి పంట వేసిన రైతులు కన్నీరు ఒక్కటే తక్కువ. ధాన్యం మొత్తం తడిసిపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు, గాలివాన బీభత్సంతోపాటు పిడుగులు పడి కొందరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో, ప్రజలు వానలు పడేటప్పుడు బయటకు రావాలన్న కూడా భయపడుతున్నారు.
Also Read: Janulyri Divorce: జాను లిరీ మొదటి భర్త అంత పని చేశాడా.. అందుకే విడాకులు ఇచ్చిందా?
పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా తీరం మీదుగా ఉత్తర కోస్తా (ఏపీ) వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఈ రోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏలూరు, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కృష్ణా, విజయనగరం, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి చిరు జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 10 తర్వాత అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని మీద మరి కొద్దిరోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.