AP Rains Alert: రానున్న 24 గంటల వ్యవధిలో ఏపీలోని పల్లి జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనితో ఆయా జిల్లాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఇప్పటికే భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సైతం అప్రమత్తమై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసింది.
నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఇది వచ్చే 24 గంటల్లో ఉత్తర వాయువ్యదిశగా, ఆ తర్వాత ఉత్తర – ఈశాన్య దిశగా వచ్చి ఆతదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడనున్నట్లు తెలిపారు.
రేపు, ఎల్లుండి అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందన్నారు. శుక్రవారం 11వ తేదిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. చెట్లు క్రింద నిలబడరాదని సూచించారు. మంగళవారం నంద్యాల జిల్లా దొర్నిపాడు, వైఎస్సార్ జిల్లా మద్దూరులో 41.5°C, కర్నూలు జిల్లా కామవరం 40.7 C, పల్నాడు జిల్లా రావిపాడులో 40.6°C, ప్రకాశం జిల్లా దరిమడుగలో 40.6°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు.
Also Read: Pawan Kalyan: కొడుకు ప్రమాదంపై.. పవన్ ఫస్ట్ రియాక్షన్.. వారే లేకుంటే?
25 ప్రాంతాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వెల్లడించారు. అల్లూరి జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు మండలాల్లో తీవ్రవడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. 9న వడగాలులు 25 మండలాలలో వీస్తాయని, 10న 56 మండలాల్లో వడగాలులు వీస్తాయని ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.