Heavy Rains in AP: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విచిత్ర వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పలు ఏరియాలు ఉక్కపోతతో అల్లాడుతుంటే.. మరికొన్ని ప్రాంతాలు వర్షాలతో తడిచి ముద్ద అవుతున్నాయి. కొన్ని ఏరియాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. ఇంకొన్ని చోట్ల అకాల వర్షాలతో పంటలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (APSDMA) ఎండీ కీలక ప్రకటన చేశారు. ఇవాళ రాత్రి పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని సూచించారు.
ఆ జిల్లాల్లో రాత్రి వర్షం
ఇవాళ రాత్రి ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడనున్నట్లు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ (Ronanki Kurmanadh) వెల్లడించారు. ఇవాళ రాత్రి శ్రీకాకుళం, అరకు, విజయనగరం, అనాకపల్లి, పార్వతిపురం, వైజాగ్, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప, చిత్తూరు, తిరుపతి, అనంతపరం ఏరియాల్లో వర్షం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రేపు ఆ ప్రాంతాల్లో వర్షాలు
శనివారం కూడా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురుస్తుందని పేర్కొన్నారు. రెండు మూడు చోట్ల భారీవర్షాలకు అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, తూర్పు గోదావరి, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
పుట్టపర్తిలో జోరువాన
సత్యసాయిజిల్లా పుట్టపుర్తిలో జోరుగా వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండవేడిమితో ఇబ్బంది పడ్డ ప్రజలు.. ఒక్కసారిగా మారిపోయిన వాతావరణంతో ఉపశమనం పొందారు. పుట్టపర్తితో పాటు కొత్త చెరువు, బుక్కపట్నం మండలాల్లో కురిసిన వర్షానికి రహదారులు తడిచి ముద్దయ్యాయి. పలు ప్రాంతాల్లోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
Also Read: MMTS Assault Case: అత్యాచారయత్నం కేసులో ట్విస్ట్ మీద ట్విస్ట్.. ఎవరు చెప్పేది నమ్మాలి?
ఆ ఏరియాల్లో వడగాలులు
అదే సమయంలో ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, పల్నాడు జిల్లా అమరావతి, పెదకూరపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని తెలిపారు. అలాగే 73 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు.