Sadarem Slots: అర్హత ఉండి, ఆ ఒక్క ధృవీకరణ పత్రం లేదన్న ఒకే ఒక్క కారణంతో దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కూటమి ప్రభుత్వం రాగానే, ముందుగా అర్హత లేకుండా ధృవీకరణ పత్రాలు పొందిన వారిని ఏరివేసే కార్యక్రమం చేపట్టింది. అయితే సంబంధిత ధృవీకరణ పత్రాలు లేక ఎందరో దివ్యాంగులు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలకు దూరమవుతున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం తాజాగా అలాంటి వారి కోసం శుభవార్త చెప్పింది.
దివ్యాంగులకు ప్రభుత్వం నుండి అందించే సంక్షేమ పథకాలు వర్తించాలంటే, ఖచ్చితంగా సదరమ్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. ఈ సర్టిఫికెట్ ఉంటేనే.. వికలాంగ పింఛన్ మంజూరవుతుంది. అలాగే ఇతర వారికి రావాల్సిన ప్రయోజనాలు దరి చేరుతాయి. అయితే కొంతమంది దివ్యాంగత్వం లేకున్నా, ధృవీకరణ పత్రాలు పొంది ప్రయోజనాలు పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది.
అందుకే కొద్దిరోజులు సదరమ్ ధృవీకరణ పత్రాల జారీని నిలిపివేసింది. ఆ తర్వాత పెన్షనర్ల రీవెరీఫికేషన్ పూర్తి చేసిన ప్రభుత్వం, తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సాధరణంగా సదరమ్ ధృవీకరణ పత్రం మంజూరు కావాలంటే స్లాట్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్స్ బుక్ చేసుకున్న అనంతరం, సంబంధిత వైద్యుడి వద్దకు వెళితే ఎంత శాతం మేరకు దివ్యాంగత్వం ఉందో పరీక్షిస్తారు. అప్పుడే ఆ వైద్యుని ధృవీకరణతో సర్టిఫికెట్ మంజూరవుతుంది.
అందుకే ప్రభుత్వం సదరమ్ స్లాట్లను ఏప్రిల్ 1 నుండి తిరిగి ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షనర్ల వెరిఫికేషన్ కారణంగా జనవరిలో విడుదల కావలసిన సదరమ్ స్లాట్లు నిలిపివేయబడ్డాయి. దివ్యాంగ సంఘాల విజ్ఞప్తుల మేరకు, వెరిఫికేషన్ తో పాటు స్లాట్లను తిరిగి ప్రారంభించి, అర్హులైన వారికి సర్టిఫికెట్లు అందజేయనున్నారు.
Also Read: Heatwave Alert: మండే ఎండలపై లేటెస్ట్ అప్ డేట్.. మళ్లీ మొదలైంది..
ఈ స్లాట్లు ఎంపిక చేసిన ఏరియా, జిల్లా, టీచింగ్ ఆసుపత్రులు, జీజీహెచ్ లలో ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 1, 2025 నుండి ఈ సేవలు అమలులోకి వస్తాయని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డాక్టర్ ఎ. సిరి తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. మరెందుకు ఆలస్యం.. మీకు అర్హత ఉందా.. సదరమ్ క్యాంపుకు వెళ్ళండి.. ధృవీకరణ పత్రం పొందండి.