AP Govt: ఏపీలో కేబినేట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన జరిగిన ఈ భేటికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు కేబినేట్ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై కేబినేట్ సుదీర్ఘంగా చర్చించింది. ఈ సందర్భంగా రేషన్ సరఫరాకు సంబంధించి కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భేటి అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు.
గత వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రత్యేక వ్యాన్ల ద్వారా రేషన్ ను ఇంటింటికీ సరఫరా చేసిన సంగతి తెలిసిందే. అయితే జూన్ ఒకటో తేదీ నుంచి ఈ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) స్పష్టం చేశారు. చౌకధర దుకాణాల ద్వారానే రేషన్ సరఫరా ఉంటుందని స్పష్టం చేశారు. 66 ఏళ్లు పైబడిన వృద్ధులకు మాత్రమే డోర్ డెలివరీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
గతంలో 29వేల చౌక దుకాణాల ద్వారా బియ్యం సహా ఇతర సరుకుల రవాణా జరిగేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ వ్యవస్థను గత వైకాపా ప్రభుత్వం నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9,260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్‌ల కోసం రూ.1860 కోట్లు వృథా చేశారని మండిపడ్డారు. 30శాతం మందికి రేషన్ అందడం లేదని ఐవీఆర్ఎస్ సర్వేలో తేలిందని పేర్కొన్నారు. రేషన్ సరఫరాకు వాహనాలు వచ్చిన తర్వాత.. జవాబుదారీతనం లోపించిందని అన్నారు. సరుకులు ఎటు వెళ్తున్నాయో కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఒకప్పటిలా చౌకదుకాణాల ద్వారానే తిరిగి రేషన్ ను పంపిణీ చేయాలని కేబినేట్ నిర్ణయించినట్లు మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు.
Also Read: TTD Update: టీటీడీ సీరియస్.. ఆ మూవీ టీమ్‌కు నోటీసులు.. అన్యమతస్తులపై వేటు!
గత ప్రభుత్వం 29వేల రేషన్ దుకాణాల స్థానంలో తీసుకొచ్చిన 9 వేల వాహనాలు రేషన్ పంపిణీకి సరిపోతాయా? అని మంత్రి నాదెండ్ల ప్రశ్నించారు. ఒక్కో వాహనానికి ప్రభుత్వం రూ.27వేలు ఖర్చు చేస్తోందని అన్నారు. ఇలా చాలా అంశాలు పరిశీలించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్లు నాదెండ్ల అన్నారు. చౌక దుకాణాలు ప్రతినెల 1 నుంచి 15 తేదీ వరకూ అందుబాటులో ఉంటాయన్న మంత్రి.. వీలు దొరికినప్పుడూ తమ రేషన్ ను పొందవచ్చని చెప్పారు.