TTD
ఆంధ్రప్రదేశ్, తిరుపతి

వైసీపీ ఎఫెక్ట్… తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో వివాదం

తిరుమల, స్వేచ్ఛ: తిరుమల కొండపై నిర్వాసితులు, స్థానికుల ఉపాధి కోసం దుకాణాలతో పాటు తట్టలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్పించింది. అయితే పలు రకాలుగా గత వైసీపీ పాలనలోని ఐదేళ్లలో అడ్డగోలుగా దుకాణాల బదలాయింపుతో పాటు తట్టలకు అనుమతులు ఇచ్చారు. తమ కార్యకర్తల ఉపాధి అంటూ కొంతమందికి, మరికొందరికి చిల్లర కోసం ఇష్టానుసారంగా కేటాయించారు. ఇందంతా ఇప్పుడు టీటీడీ అధికారులకు తల నొప్పిగా మారింది. అయితే గొడ మీద పిల్లిలాగా ఉండే నాయకులు కొందరు కూటమిలో ఉంటూ తమ సంపాదనకు వైసీపీ కేడర్ అక్రమాలకు వంత పాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తట్టలు తొలగించాలని ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశించినా ప్రక్షాళన పేరుతో కొందరు అధికారులు అక్రమ దందాలకు సహకరిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రక్షాళన పేరుతో అక్రమాలను క్రమబద్ధీకరించే పనులు జరుగుతుండగా తనిఖీలు చేయగా అక్రమంగా వెలిసిన 151 తట్టలు, చెల్లని పాత లైసెన్సులను అధికారులు గుర్తించారు. అయితే వీటిని అధికారికంగా క్రమబద్ధీకరించేందుకు ప్రణాళిక బద్దంగా కొందరు పావులు కదుపుతున్నారు. అయితే జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసి అనంతరం ఆక్రమణలలో లైసెన్స్ లేని వాటిని తొలగిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ ఆచరణలోకి మాత్రం రాలేదు. ఎందుకంటే లోలోపల పెద్ద ఎత్తున అక్రమాలను క్రమబద్ధీకరించే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.

అంతా ఆయనే చేశారు!

కొండపై కొన్నేళ్లుగా అక్రమంగా వెలిసిన తట్టల వ్యవహారం వెనుక దాదాపు రూ.9 కోట్లు చేతులు మారినట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు టీటీడీ పంచాయతీ రెవెన్యూలో అవినీతి రారాజుగా చక్రం తిప్పిన ఏఈఓ స్థాయి అధికారి ఈ అక్రమ వ్యవహారాలకు కేంద్ర బిందువుగా వ్యవహరించారు. ఇదంతా టీటీడీ ఛైర్మన్ అండదండలతో డిజిటల్ సంతకం పేరుతో ఉన్నతాధికారి మాయాజాలాన్ని ప్రదర్శించారు. తిరుమల కొండపై షాపులు హాకరు లైసెన్సులు, తట్టల విషయంలో స్థానికులకు మాత్రమే అనుమతి, ఇందుకు తగ్గ ఆధారాలు కూడా ఉండాల్సిందే. అయితే ఇవేమీ లేకుండా స్థానికులు కాని వారందరికీ వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలు లంచాలతో స్థానికేతరులను కొండపై క్రమబద్ధీకరించే అక్రమ వ్యవహారం ఇప్పుడు గుంభనంగా సాగుతోంది.

ఫిబ్రవరి 26, 2024న పాలకమండలి విడుదల చేసిన ఆదేశాల్లో ఈ 151 తట్టలలో 29 మంది మాత్రమే రెన్యువల్‌కు అర్హత ఉండగా, మిగిలిన అనర్హత కలిగిన 122 మంది వైసీపీకి వీర విధేయులైన సానుభూతిపరులు. ఇన్ని లొసుగులు ఉన్నా వైసీపీ పాలకులు, పాలకమండలిలో గుడ్డిగా ఆమోదిస్తూ తీర్మానం చేసేశారు. అయితే ఈ తీర్మానం అమలుకు నోచుకుంటే ఎక్కడ తన మెడుకు చుట్టుకుంటుందోనని భయపడిన ఆ ఉన్నతాధికారి ఈ ఫైలును పక్కన పెట్టారు. ఈ పాపాలను కూటమి ప్రభుత్వం కూడా నెత్తికెత్తుకుని అదే తప్పులను మళ్లీ క్రమబద్ధీకరించేలా అడుగులు ముందుకు వేస్తోంది.

ఆక్రమణలకు అడ్డాగా షెడ్డు..

కొండపై యాత్రికులు సేదతీరేందుకు కోట్ల రూపాయలతో నిర్మించిన ఓ షెడ్డు ఆక్రమణలకు అడ్డాగా మారింది. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో షెడ్డు చుట్టూ అనధికారిక హాకరులు తట్టలు పెట్టేసి ఇష్టానుసారంగా రోడ్డు మొత్తం ఆక్రమించేశారు. యాత్రికులు కనీసం నడిచేందుకు దారులు లేకుండా ఆక్రమించుకున్న వ్యాపారులు అదో బర్మా బజార్‌లాగా తయారు చేశారు. ఈ షెడ్డులోపల షికారిలు, నకలోళ్లు డేరాలు కట్టుకొని కాపురాలు చేస్తున్న పరిస్థితి. ఆఖరికి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు.

ఇదే మార్గంలో రాత్రి పగలు తేడా లేకుండా నిత్యం వేలాదిమంది భక్తులు కాటేజీలు బస్టాండ్లు, వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లు, కళ్యాణకట్టకు వెళ్లేందుకు రాకపోకలు సాగిస్తుంటారు. టీటీడీ అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డుపై ఉన్న తట్టలు, హాకర్లను లేదా ఈ షెడ్డును పూర్తిగా తొలగిస్తే ఆక్రమణలకు అవకాశం లేకుండా యాత్రికులకు రోడ్డును అందుబాటులోకి తెచ్చినట్లు అవుతుందని వెంకన్న భక్తులు కోరుతున్నారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం