Andhra Pradesh: గత ఐదేళ్లలో గుంతలు- గోతులతో నరకప్రాయంగా మారిన రోడ్ల నుంచి కేవలం ఒక్క ఏడాది కాలంలోనే సీఎం చంద్రబాబు (CM Chandrababu) నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అనూహ్య మార్పులు తీసుకొచ్చింది. దేశంలోనే మెరుగైన రహదారుల కల్పనకు ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో మెరుగైన విధానాలను అవలంభిస్తున్నారు. ఇప్పటికే ఆర్ అండ్ బీ శాఖ గుంతల రోడ్ల పనులను సకాలంలో పూర్తి చేసి, ప్రజల మన్ననలు పొందడంలో విజయం సాధించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన, సుస్థిరమైన, సుదీర్ఘకాలం పాటు నిలిచే రహదారులే లక్ష్యంగా డానిష్ ఆస్ఫాల్ట్ ఫైబర్ టెక్నాలజీతో రేపు (జూలై 4న) బనగానపల్లె నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్టును ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించనున్నారు. తద్వారా రహదారుల నిర్మాణం- అభివృద్ధిలో సరికొత్త విధానాలకు, వినూత్న ఆలోచనలకు, అధునాతన ఆవిష్కరణలకు ఆర్ అండ్ బీ శాఖ శ్రీకారం చుట్టనుంది. ఈనెల 4న రాష్ట్రంలోని తొలిసారిగా డానిష్ ఫైబర్ విధానం ద్వారా నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ముదిగేడు-సంజామల మధ్య నిర్మించ తలపెట్టిన 2 వరుసల రహదారి-ఈ సరికొత్త ప్రయోగానికి వేదిక కానుంది. ఈ కార్యక్రమం విజయవంతం అయితే రాష్ట్రంలో రహదారుల దశ తిరిగినట్లే.
Read Also- Mega Family: ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్‌పై మెగా హీరోల స్పందనిదే..
గర్వకారణం!
ప్రపంచ వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధిలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ నేడు డానిష్ ఆస్ఫాల్ట్ రీ-ఇన్ఫోర్సింగ్ ఫైబర్ టెక్నాలజీతో పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం మన రాష్ట్రానికే గర్వకారణం. డెన్మార్క్‌కు చెందిన ఈ ఆధునాతన టెక్నాలజీని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హీత్రో ఎయిర్‌పోర్ట్ (UK), దుబాయ్ మెట్రో, A7 మోటార్‌వే (జర్మనీ) లాంటి ప్రాజెక్టుల్లో ఇప్పటికే విజయవంతంగా ఉపయోగించారు. ఐబీక్యూ జర్మనీ, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో విజయవంతంగా ఈ సాంకేతిక నిరూపించడమైంది. ఈ టెక్నాలజీ ద్వారా అరమిడ్, పాలియోలెఫిన్ అనే అధిక బలం కలిగిన ఫైబర్లు ఆస్ఫాల్ట్ మిశ్రమంలో కలపబడతాయి. వీటి వల్ల సాధారణంగా రహదారులపై పడే గుంతలు – గోతులు, రోడ్లపై చీలికలు వంటి ధీర్ఘకాలిక సమస్యలకు చెక్ పెట్టే అవకాశం ఉంది. తారు రోడ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అధునాతన విధానం ఇది. కొత్త, పాత తారు రోడ్ల నిర్మాణంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ టెక్నాలజీ ద్వారా తారు రోడ్లపై 100 శాతం గుంతలను నివారించవచ్చు. సాంప్రదాయ తారు కంటే ఈ ఫైబర్ కలిపి తారు చాలా బలంగా ఉంటుంది. ముఖ్యంగా రోడ్లపై పగుళ్లు, చీలికలు, ప్రకృతి వైఫరీత్యాలు వంటి కఠిన వాతావరణ పరిస్థితులను
తట్టుకుని దీర్ఘకాలం పాటు పనిచేస్తోంది.
ట్రా‘ఫికర్’ హుష్!
అధిక వాహనాలతో నిరంతరాయంగా రద్దీగా ఉండే రోడ్లపై అధిక ఒత్తిడి పడకుండా ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టెక్నాలజీ ద్వారా రోడ్ల నాణ్యతా ప్రమాణాలు పెరగడంతో పాటు, రహదారుల జీవితకాలం కూడా 50 శాతం పైగా పెరగనుంది. ఈ అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా రోడ్ల మరమ్మతులకు చెక్ పెడితే, నిరంతరాయంగా గతుకులు, గుంతలు లేని రహదారులపై సాఫీగా, వేగంగా ప్రయాణించే వెసులుబాటు వస్తోంది. అది పరోక్షంగా ట్రాఫిక్ సమస్యలకు చాలా మేరకు తగ్గిస్తోంది. హెవీ లోడ్‌లతో కూడిన రవాణా వాహనాలు రహదారులపై వెళ్తున్న క్రమంలో సాధారణంగా ఆయా రోడ్లపై ఒకే ప్రాంతంలో ఒక్కసారిగా అధిక భారం పడి, అది అంతిమంగా రోడ్లు కుంగిపోవడం, గుంతలు పడి పాడైపోవడం, పగుళ్లు రావడం వంటి వాటికి దారితీస్తోంది. కానీ అదే ఈ డానిష్ ఫైబర్ టెక్నాలజీ రోడ్లలో ఉన్న ఫైబర్, హెవీ లోడ్స్, కంటెనర్ల వంటి భారీ వాహనాల భారాన్ని అన్ని వైపుల నుంచి (త్రి డైమన్షనల్‌గా) ఎదుర్కొవడం వల్ల రోడ్లపై ఆయా ప్రాంతాల్లో ఏక కాలంలో ఒకచోటే ఎక్కువ భారం పడకుండా ఈ టెక్నాలజీ అడ్డుకుంటుంది. తద్వారా ఈ రోడ్లపై ఒత్తిడి తగ్గి, ఎక్కువ కాలం మన్నికకు కారణమవుతోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ప్రభుత్వాలపై మరమ్మతుల భారం తగ్గడం ద్వారా పరోక్షంగా మెయింటెనెన్స్ కూడా భారీగా తగ్గుతుంది. కొత్త యంత్రాలు అవసరం లేకుండానే ఈ టెక్నాలజీ ఉపయోగించుకునే అవకాశం ఉండటం.. ఈ రోడ్లపై వాడే డానిష్ ఫైబర్ తిరిగి వినియోగించుకునే వీలు ఉన్న నేపథ్యంలో ఇది పర్యావరణ పరంగా చూసుకున్న చాలా అనుకూలమైనది.
కాగా, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రహదారుల కల్పించాలనే ఆలోచనతో ఈ ఫైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే.. భవిష్యత్తులో రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా రహదారులకు కూడా ఈ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా నిలవనుంది. రాబోయే రోజుల్లో ఇది రాష్ట్రంలో రహదారుల నిర్మాణంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పడంలో సందేహాలు అక్కర్లేదు.
Read Also- YSRCP: ఎన్నికలైన ఏడాదికి మేల్కొన్న వైసీపీ.. ఇప్పుడెందుకో?