Prasanna Vadanam Teaser : షార్ట్ ఫిలిమ్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటుడు సుహాస్ తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ అందరినీ అలరించాడు. ఎక్కువగా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌లో చేసేవాడు.
అతడికి ఇచ్చిన ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయేవాడు. పలు సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ తన నటనతో ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు టైం వస్తుంది. ఆ రోజును సక్రమంగా వినియోగించుకున్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. అలాంటి ఒక రోజును సక్రమంగా వినియోగించుకున్న వారిలో నటుడు సుహాస్ ఒకడు. సైడ్ క్యారెక్టర్ల నుంచి హీరోగా మొదటి సారి ప్రమోషన్ పొందాడు.
కలర్ ఫొటో సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ ప్రేక్షకాభిమానులకు బాగా కనెక్ట్ కావడంతో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నాడు. స్టోరీతో పాటు నటన పరంగా సుహాస్ అదరగొట్టేశాడు. దీంతో ఫస్ట్ మూవీతోనే మంచి హిట్‌ను అందుకున్నాడు.
ఇక ఆ తర్వాత హిట్ 2 మూవీలో నెగెటివ్ పాత్రలో నటించి మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ మూవీ ద్వారా కూడా మంచి మార్కులను కొట్టేశాడు సుహాస్. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. గతేడాది రైటర్ పద్మభూషణ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి ఎనలేని ఘనవిజయాన్ని కైవసం చేసుకున్నాడు.
ఈ మూవీతో సుహాస్ తన కెరీర్‌లో మరో మెట్టు ఎక్కాడు. ఆ తర్వాత ఓ వెబ్‌సిరీస్‌లో నటించాడు. ఆ సిరీస్ కూడా ఓటీటీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇలా వరుస పెట్టి సినిమాలతో సూపర్ హిట్లను అందుకున్న సుహాస్ ఇటీవల అంబాజీపేట మ్యారేజీబ్యాండు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
దుష్యంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. అంతేకాకుండా కలెక్షన్లలో కూడా తన హవా చూపించింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలకు లాభాల పంట పండించింది. ఇక థియేటర్‌లలో అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చి అక్కడ కూడా తన హవా కనబరిచింది.
ఇక ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుండగానే.. సుహాస్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైపోయాడు. ఇందులో భాగంగా ఇప్పుడు అర్జున్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి గానూ ‘ప్రసన్నవదనం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఇప్పుడు ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌ను మేకర్స్ అందించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈ టీజర్ ప్రకారం చూస్తుంటే.. ఈ మూవీ కూడా సుహాస్‌కు మంచి హిట్టు ఇచ్చేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కూడా సుహాస్ ఉరుకులు, పరుగులతో ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నట్లు టీజర్‌లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ అందిరినీ ఆకట్టుకుంటోంది.
కాగా లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్‌పై ఈ మూవీని మణికంఠ, ప్రశాద్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో సుహాస్ సరసన హీరోయిన్లుగా పాయల్ రాధాకృష్ణ, రాశిసింగ్ నటిస్తున్నారు. అలాగే వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేతా సహా మరికొంత మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు.