మెదక్ బ్యూరో, స్వేచ్ఛ : మెదక్- నిజామాబాద్- కరీంనగర్- ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్నది. దీంతో జిల్లాల్లో ప్రలోభాల పర్వం ఊపందుకున్నది. ఎంత ఖర్చుపెట్టి ప్రచారం చేసినా, ఎన్ని హామీలు ఇచ్చినా.. చివరకు పంచాల్సింది డబ్బులే అని, అవి పంచకపోతే ఓట్లు రాలవని అభ్యర్థులకు అర్థమైపోయినట్లున్నది. ఓటర్లు కూడా నేతలు ఇచ్చే డబ్బుల కోసం ఎదురుచూస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గ్రూపులుగా ఏర్పడి డబ్బులు గంప గుత్తగా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. తమ గ్రూప్‌లో 40 నుంచి 50 మంది ఓటర్లు ఉన్నారని, అందరికీ కలిపి డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామంటూ అభ్యర్థులతో బేరసారాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
పక్కా ప్రణాళికతో డబ్బు పంపిణీ…
ఓ రాజకీయ పార్టీ మద్దతుతో పోటీలో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థి ఒకరు ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలని తన అనుచరులు, సన్నిహితుల ద్వారా ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. సదరు అభ్యర్థికి సంబంధించిన వ్యక్తుల ద్వారా సీల్డ్ కవర్‌లో ఓటర్ లిస్ట్ ఆధారంగా ఇప్పటికే పంపిణీ కూడా మొదలైనట్లు తెలుస్తున్నది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. ఒక రాజకీయ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థికి సంబంధించిన వ్యక్తులు, రాష్ట్రంలోనే పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులను కలిగి ఉన్న ఉపాధ్యాయ సంఘం నుండి మద్దతు ఇచ్చి నిలబెట్టిన సంఘంలోని కీలక నేతకే సీల్డ్ కవర్ రావడం.. అందులో రూ.5వేలు నగదు ఉండడంతో ఆశ్చర్యపోయారని మెదక్ పట్టణంలో ప్రచారం జరుగుతున్నది. ఓటు వేయకున్నా పర్లేదు ఉంచండి.. అంటూ కవర్ చేతికి ఇచ్చి వెళ్లినట్లు తెలుస్తున్నది. డబ్బులు తీసుకున్న వ్యక్తి మొదటి ప్రాధాన్యత ఓటు వేయకున్నా.. రెండో ప్రాధాన్యత ఓటు వేస్తారని.. దాని ద్వారానే గెలవచ్చని డబ్బుల పంపిణీ కార్యక్రమానికి, ప్రలోభాలకు పకడ్బందీగా స్కెచ్ వేసి అమలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు జిల్లాలో ప్రధాన పోటీదారుడిగా ఉన్న వ్యక్తి ఆధిపత్యానికి గండి కొట్టి.. మొదటి, లేదా రెండో ప్రాధాన్యత ఓటు కచ్చితంగా తెచ్చుకొనే ప్లాన్ చేశారని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అపవిత్ర బాట…
మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నుండి మల్క కొమరయ్య, పీఆర్టీయూ బలపరిచిన వంగ మహేందర్‌రెడ్డి, తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం మద్దతు, టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం మద్దతుతో అశోక్‌కుమార్, బీఎస్పీ మద్దతుతో ప్రసన్న హరికృష్ణ, ఎస్‌టీయూ ఉపాధ్యాయ సంఘం బలపరిచిన రఘోత్తంరెడ్డి, మరో ఉపాధ్యాయ సంఘం మద్దతుతో మామిడి సుధాకర్‌రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ప్రజాస్వామ్యంలో అవినీతి రహిత సమాజాన్ని తయారుచేయడానికి, భావి భారత విద్యార్థి లోకాన్ని తీర్చిదిద్దే పవిత్ర ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న కొందరు మేధావులు అపవిత్ర బాటను ఎంచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులకు లొంగిపోయి ఎమ్మెల్సీ ఎన్నికను అపవిత్రం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కార్పొరేట్ స్థాయి వ్యక్తి బరిలోకి దిగడంతో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో బేరసారాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇతరులు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో మొత్తం కలిపి 7,226 ఓట్లు ఉండడంతో మెజార్టీ ఓట్ల కొనుగోలుకు సదరు ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇక్కడి నేతలకు సంబంధం లేకుండా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరుకు, ఓటర్ల జాబితా ఆధారంగా రూ.5వేల సీల్డ్ కవర్ పోటీ చేస్తున్న(ఒక అభ్యర్థికి సంబంధించిన వ్యక్తులే) డైరెక్టు ఓటర్లను కలిసి ఇస్తున్నట్లు సమాచారం. పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్న అభ్యర్థి సైతం ఓటర్ లిస్ట్ ఆధారంగా రూ.3వేలు అందజేస్తున్నట్లు సమాచారం.
ఉపాధ్యాయులకు మద్యం దావత్…
ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ప్రలోభాలకు తెరలేపారని, గతంలో ఈ తతంగాన్ని ఎన్నడూ చూడలేదని సీనియర్ ఉపాధ్యాయులు కొందరు బహిరంగంగా బాధపడుతున్నట్లు తెలుస్తున్నది. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలలో పనిచేసే, ఉపాధ్యాయులను కలుస్తూ వారితో ఆత్మీయ సమావేశాల పేరుతో (పుట్టిన రోజు) ఇతర కారణాలు చూపుతూ రాత్రిపూట ఫామ్ హౌస్‌లు, ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లలో పార్టీలు నడుస్తున్నట్లు సమాచారం. ఈ తతంగాన్ని కొందరు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలే నడిపిస్తున్నారని, వీరికి అండగా ఆ పార్టీ జిల్లా, మండల, బూత్ స్థాయి కమిటీ రాజకీయ నాయకులు ఉంటున్నట్లు తెలుస్తున్నది. మొత్తం మీద ఆ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రలోభాలకు తెరలేపారు. పోటీ సంఘంలోని ప్రతిపక్ష, ఉపాధ్యాయ, నేతలను సైతం ప్రలోభాలకు గురి చేయడం అశ్చర్యం కలిగిస్తున్నదని తెలుస్తున్నది.
టూవీలర్ ఇస్తామని బాండ్‌లు..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న మామిడి సుధాకర్‌రెడ్డి తాను గెలుస్తే మహిళా ఉపాధ్యాయులకు ఎలక్ట్రికల్ టూవీలర్ వాహనాలు కొనిస్తానని ఏకంగా బాండ్ పేపర్ రాసి ఇస్తున్నట్లు సమాచారం. బాధ్యతాయుత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన మహిళ ఉపాధ్యాయులకు లేఖలు పంపిస్తున్నట్లు తెలుస్తున్నది. అంతేకాదు మెదక్‌లో మీడియా సమావేశం పెట్టి బాండ్‌ను విడుదల చేయడం కలకలం రేపుతున్నది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి సహితం ఓటుకు రూ.3 వేలు ఇచ్చేందుకు పక్కా స్కెచ్‌తో ముందుకు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. వీటితో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల్లోని కొందరు నేతలు ప్రతినిత్యం విందులు వినోదాల్లో మునిగి తేలుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతున్నది.