Elephants Attack: ఏపీలో దారుణం జరిగింది. శివరాత్రి సందర్భంగా దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండల పరిధిలోని గుండాల కోనలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే, గుండాల కోనలో ఉన్న శివాలయానికి శివరాత్రి పండుగ సందర్భంగా భక్తులు తరలివెళుతుంటారు. అదే విధంగా సోమవారం రాత్రి 14 మంది భక్తులు కాలినడకన అటవీ మార్గంలో వెళ్తుండగా వారిపై ఏనుగుల గుంపు దాడి చేసింది. దాడి నుంచి 11 మంది భక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. మృతులంతా ఉర్లగడ్డ పోడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
గుండాలకోన ఏనుగుల దాడి (Elephant Attack) ఘటనపై సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు… క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు. ఈ సందర్భంగా… మృతుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యేలకు సూచించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జరిగిన దుర్ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులతో మాట్లాడిన ఆయన… సంఘటన వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు నష్ట పరిహారంగా ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అలాగే, మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను దర్శించుకునే భక్తులకి తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.