Revanth-Reddy
తెలంగాణ

CM Revanth: బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మ‌క్కు.. గుట్టంతా బయటపెట్టిన సీఎం రేవంత్

CM Revanth: బీజేపీ (BJP) తో ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ (BRS) కుమ్మ‌క్క‌యింద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. ఢిల్లీలో క‌మ‌లం పార్టీతో కారు పార్టీ చీక‌టి ఒప్పందాలు చేసుకున్న‌ద‌ని విమ‌ర్శించారు. ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల్లో బీజేపీకి మ‌ద్ద‌తుగానే బీఆర్ ఎస్ త‌న అభ్య‌ర్థిని నిలుప‌లేద‌ని అన్నారు. ఈ రెండు పార్టీలు ఒక్క‌టేన‌న్న రేవంత్‌రెడ్డి.. ర‌హ‌స్య ఒప్పందం వ‌ల్లే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌రేంద‌ర్‌రెడ్డిని ఓడించాల‌ని మాజీ మంత్రులు కేటీఆర్‌ (KTR), హ‌రీశ్‌రావు (Harish Rao) పిలుపునిస్తున్నార‌ని చెప్పారు. ఈ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (KCR), మాజీ మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్‌రావు, క‌విత ఎవ‌రికి ఓటేస్తారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సోమ‌వారం నిజామాబాద్‌, మంచిర్యాల‌, క‌రీంన‌గ‌ర్‌ల‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌ల్లో మాట్లాడారు. పార్టీ అభ్య‌ర్థి న‌రేంద‌ర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల‌ని ప‌ట్ట‌భ‌ద్రుల‌కు పిలుపునిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, కేసీఆర్‌ను కాపాడుతున్నదే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ అని ఘాటుగా విమర్శలు చేసిన సీఎం రేవంత్… విదేశాల నుంచి ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులను తెప్పించిన 48 గంటల్లోనే అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభాకర్ రావు, శ్ర‌వణ్‌రావును అమెరికాలో దాచింది బండి సంజయేనని ఆరోపించారు. ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఆ ఇద్దరినీ రప్పించడం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, అందుకే రిక్వెస్టు పెట్టామని గుర్తుచేశారు. వారిద్దరూ అమెరికా పారిపోతే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాసి ఎందుకు దేశానికి ర‌ప్పించ‌డం లేద‌ని ప్రశ్నించారు. వారిని అమెరికా నుంచి ఎప్పుడు తీసుకువస్తారో చెప్పాలంటూ బండి సంజయ్‌కు సవాలు విసిరారు. ఈ కేసులో జైలుకు పంపించిన రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు తదితరులకు 10 నెలల తర్వాత బెయిల్ వచ్చిందని, హరీష్‌రావు కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారని ఉదహరించారు.

గొర్రెల స్కామ్, ఈ-రేస్ ఫైళ్ళు ఈడీ దగ్గరున్నాయి

గొర్రెల స్కీమ్ పథకంలో జరిగిన స్కామ్, ఫార్ములా ఈ-రేస్ కేసులకు సంబంధించిన ఫైళ్ళను దర్యాప్తులో భాగంగా ఈడీ (ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) తీసుకెళ్ళిందని చెప్పిన రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్ నాయకులను ఎప్పుడు ఈడీ అరెస్టు చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ-రేస్ కేసులో కేటీఆర్‌ను ఎప్పుడు అరెస్టు చేస్తారో బండి సంజయ్ చెప్పాలన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లని హరీశ్‌రావు, కేటీఆర్ ఇప్పుడెందుకు వెళ్తున్నారు? కేంద్ర మంత్రులను ఎందుకు కలుస్తున్నారు? చీకట్లో కలవడం వెనక ఉద్దేశమేంటి? రాష్ట్రానికి నిధులు తీసుకురావడమే నిజమైతే అదే పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంతో ఎందకు కలిసిరావడంలేదు? కేంద్ర‌ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన తర్వాత చిల్లిగవ్వనైనా తెచ్చారా? కేంద్ర మంత్రులతో ఇద్దరు గులాబీ లీడర్లకు ఉన్న చీకటి ఒప్పందేమేంటి? ఈ మీటింగులెందుకో అర్థం కావడం లేదా? అంటూ సీఎం రేవంత్ ప్రశ్నల వర్షం కురిపించారు. కేటీఆర్‌ను తెలంగాణ సమాజం ఎప్పుడో బహిష్కరించిందని, ఆయనను లెక్కల్లోనే లేరని అన్నారు.

బీఆర్ఎస్ ఎందుకు పోటీచేయట్లేదు?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నిల‌దీశారు. ఆ పార్టీకి చెందినవారి ఓట్లు ఏ అభ్యర్థికి అని ప్ర‌శ్నించారు. ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు. పోటీ చేయకుండా దూరంగా ఉన్న బీఆర్ఎస్.. పరోక్షంగా బీజేపీకి మద్దతు పలుకుతున్నదని ఆరోపించారు. మోదీని ఓడించాలా? లేక రేవంత్ రెడ్డిని ఓడించాలా? బీఆర్ఎస్ తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రారని.. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టరని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ప‌డి ఉప ఎన్నికలు వ‌స్తే అప్పుడు బీఆర్ఎస్ సత్తా చూపిస్తామంటూ కేసీఆర్ చేసిన కామెంట్లకు సీఎం రేవంత్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పదేళ్లలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయా? మరి ఇప్పుడెందుకు వస్తాయి? అని కౌంట‌రిచ్చారు. ఇప్పటికీ అవే కోర్టులు, స్పీకర్లు ఉన్నారు కదా!.. తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులను కేసీఆర్ సిగ్గు లేకుండా మంత్రులను కూడా చేశారు గదా!.. అని ప్రస్తావించారు.

కేసీఆర్‌కు గతమే.. భవిష్యత్తు లేదు

కేసీఆర్‌కు ఇక మిగిలేది గతమే తప్ప భవిష్యత్తు ఉండదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఫామ్‌హౌస్‌లో పడుకునే ఆయన తమకు పోటీయే కాదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్ప‌ష్టంచేశారు. కాంగ్రెస్‌ను గెలిపించవద్ద‌ని మాట్లాడుతున్న బీఆర్ ఎస్ నేత‌లు.. త‌మ పార్టీ శ్రేణుల‌కు ఏ అభ్య‌ర్థికి ఓటేయాల‌ని చెబుతున్నార‌ని నిల‌దీశారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది.. పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే లేరు.. ఎన్నికల్లో పోటీ చేయని పార్టీకి రాజకీయ పార్టీ అని చెప్పుకునే అర్హత ఉందా?’ అని ప్రశ్నించారు. ప్రజలు బీఆర్ఎస్‌ను తిరస్కరించి, ఫామ్‌హౌస్‌లో పడుకోవాలని తీర్పు ఇచ్చారని అన్నారు. పార్టీ పేరు మార్చుకుని తెలంగాణతో సంబంధమే లేకుండా పేగుబంధాన్ని ఆ పార్టీ తెంచుకున్నదని వ్యాఖ్యానించారు. ఖజానాను ఖాళీచేసి ఫామ్‌హౌస్‌కు పోయి పడుకుంటే ఆ అప్పుల బకాయిలను తీర్చడానికి ఇప్పటి ప్రభుత్వానికి కష్టంగా మారిందని చెప్పారు. అయినా నడుము వంచి ప్రతి నెలా వెయ్యి కోట్ల బకాయిలను చెల్లిస్తున్నామ‌ని తెలిపారు.

ఫామ్‌హౌస్‌ నుంచే కేసీఆర్ కుట్రలు

ఫామ్‌హౌస్‌లో పడుకున్న కేసీఆర్.. కుట్రలను మాత్రం ఆపలేదని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రలు, కుతంత్రాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపర్చాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 చోట్ల డిపాజిట్లు కోల్పోతే బీజేపీ ఎనిమిది స్థానాల్లో గెలిచిందని, ఇందులో ఉన్న మతలబేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ఓడించాలంటూ కేటీఆర్, కవిత, హరీశ్‌రావులు ఓటర్లకు పిలుపు ఇస్తున్నారని, బీఆర్ఎస్ అభ్యర్థినే నిలబెట్టకపోవడంతో ఎవరికి ఓటు వేయాలని వారు చెప్తున్నారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో చల్లగా పడుకున్నారని, కాంగ్రెస్‌ను ఓడించడమంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించమనేగా అర్థం అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎంగా తాను కొట్లాడుతుంటే కాలు పట్టుకొని, అంగీ పట్టుకొని కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మోదీ, కేసీఆర్ కలిసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా పాలనను, అభివృద్ధి చూసి ఓటేయండి

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పట్టభద్రులు ముందు వరుసలో ఉన్నారని, బీఆర్ఎస్ పదేళ్ల పాలలో నిరుద్యోగ సమస్య కారణంగా అనేక మంది యువతీ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడానికే సరిపోయిందని, నోటిఫికేషన్లు రాలేదని.. నియామకాలూ జరగలేదని అన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్లు రాగానే కోచింగ్ సెంటర్లతో కుమ్మక్కయ్యి కోర్టులకు వెళ్లి పరీక్షలు ఆపించార‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 55,163 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ కారణంగా తొమ్మిది నెలలు మాత్రమే పాలన సాగించే వెసులుబాటు ఉన్నదన్నారు. అయినా 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని, 35 వేల మంది ప్రభుత్వ టీచర్లకు ప్రమోషన్లు కల్పించామని, 22 వేల మందికి బదిలీలు చేశామని, 17 వేల మందిని నూతనంగా నియమించామని గుర్తుచేశారు. ఇవన్నీ నిజమైతే టీచర్లు కాంగ్రెస్ అభ్యర్థికే ఓటు వేయాలని సీఎం కోరారు.

నిజాన్ని గుర్తించి ఆలోచించండి

పదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతం వచ్చేదే కాదని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు తాము ఠంచన్‌గా జమ చేస్తున్నామని సీఎం గుర్తుచేశారు. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు 8 వేల కోట్ల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్​ను కేసీఆర్ బకాయి పెడితే దాన్ని సర్దుబాటు చేయడానికి నడుము వంగిపోతున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి 7 లక్షల కోట్ల అప్పులు కేసీఆర్ నుంచి వారసత్వంగా వచ్చాయని, ప్రతి నెలా రూ.6,500 కోట్లు, సంవత్సరానికి రూ.75 వేల కోట్లను అప్పుల కింద చెల్లించాల్సి వస్తున్నదని తెలిపారు. ఈ ఏడాది రూ.65 వేల కోట్ల అప్పు చేసి, మరో 15 వేల కోట్లు కలిపి కేసీఆర్ చేసిన అప్పుల్ని తీర్చామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు గుండె మీద చేయి వేసుకుని ఫస్ట్ తారీఖున జీతం ఏ ప్రభుత్వం వేస్తున్నదో ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

మా పాలనలో సాధించిన ఫలితాలు ఇవే

నిరుద్యోగ యువత అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో 65 ఐటీఐలను రూ.2,400 కోట్లతో టాటా కంపెనీ సహకారంతో అడ్వాన్స్​డ్​ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్రాను చైర్మన్‌గా నియమించామని, శిక్షణ తర్వాత ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్ పోటీల్లో బంగారు పతకం తేలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంతో పోటీపడలేక పోతున్నామనే ఆలోచనతోనే తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన నిఖత్​ జరీన్‌కు రెండు కోట్ల నగదు ఇచ్చి గ్రూప్-1 ఆఫీసర్‌గా నియమించామని, భారత క్రికెట్ బౌలర్ సిరాజ్‌కు అన్ని మినహాయింపులు ఇచ్చి గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చామని చెప్పారు. క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వం ఆదుకుంటుందని నిరూపించామని తెలిపారు. వరంగల్ కు చెందిన కీర్తికి గ్రూప్-2 ఉద్యోగం ఇచ్చి రూ.25 లక్షల సాయం చేశామన్నారు. ఇవన్నీ నిజమైతే కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ‘రైతు రుణమాఫీతో 22 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్లు ఇచ్చాం.. రైతుభరోసాకు ప్రతీ ఎకరానికి రూ. 6 వేలు ఇస్తున్నాం.. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తున్నాం.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం.. ఇవన్నీ కళ్ళారా చూస్తున్న ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలి’ అని సీఎం కోరారు.

కులగణన తెలంగాణ సాధించిన గొప్ప విజయం

బీసీ పెద్దలమని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి బండి సంజయ్.. 2021లో జనగణన ఎందుకు చేయలేదో, అందులో కులగణన ఎందుకు చేయలేదో చెప్పాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. వందేళ్లలో బీసీ కులగణన చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర సర్కార్ ఒకటిన్నర నెలలోనే కులగణన చేసి లెక్కలు బహిర్గతం చేసిందన్నారు. గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసినా గోప్యంగా ఉంచి రాజకీయ అవసరాలకువాడుకున్నదని, ఆ చిత్తుకాగితాన్ని చూపిస్తూ బీసీ లెక్కలు తప్పు అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నదని ఆరోపించారు. నిజంగా లెక్కల్లో తప్పు ఉంటే బండి సంజయ్ చూపించాలని డిమాండ్ చేశారు. మైనారిటీలను బీసీల్లో ఎలా కలుపుతారని ప్రశ్నిస్తున్న బండి సంజయ్.. 1960 నుంచే రిజర్వేషన్లు ఎలా పొందుతున్నారో, గుజరాత్‌లో 29% ఎందుకు అమలవుతున్నాయో.. బీజేపీ పాలనలో ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఎందుకు ఇదే విధానం కొనసాగుతూ ఉన్నదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిజాలను చెప్పేందుకు ఆ రాష్ట్రాలకు నిజనిర్ధారణ కమిటీలను పంపుదామా? అని ప్రశ్నించారు. వీధి నాటకాలను ఇప్పటికైన ఆపేయాలని డిమాండ్ చేశారు. పదేళ్ల పాలనలో తెలంగాణకు బీజేపీ చేసిందేంటని రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. ప్రాణహిత చేవేళ్లకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. మెట్రో విస్తరణకు అనుమతులు ఇవ్వడం లేదని చెప్పారు. ట్రిపుల్ అర్ రింగ్​ రోడ్డు పనులకు పైసా ఇవ్వడం లేదని మండిపడ్డారు. అలాంటి బీజేపీ అభ్యర్థికి ఓటు వేయవద్దని పట్టభద్రులను కోరారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ.. తెలంగాణలో రెండే రెండు ఉద్యోగాలు ఇచ్చారని, అవి కేంద్రమంత్రి పదవుల రూపంలో ఒకటి బండి సంజయ్​ కు, మరోటి కిషన్​ రెడ్డికి దక్కాయని ఎద్దేవా చేశారు. వారిద్దరికీ పదవులు దక్కినా.. తెలంగాణ అభివృద్ధికి నిధులు మాత్రం తేలేదని ఆరోపించారు. ఢిల్లీలో యమునా నదిని సుందరీకరిస్తామన్న బీజేపీ.. ఇక్కడ మూసీ ప్రక్షాళనకు మాత్రం అడ్డం పడుతున్నదని విమర్శించారు.

వర్గీకరణతో దళిత సోదరులు అండగా ఉండాలి

ఎస్సీ వర్గీకరణ కోసం దళిత సోదరులు 30 ఏళ్ల నుంచి కోట్లాడుతున్నారని, ఎన్నో త్యాగాలు చేశారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. క్రిష్ణ మాదిగకు ప్రధాని మోదీ ముద్దు పెట్టారుగానీ లెక్క తేల్చలేదని ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఎస్సీ వర్గీకరణను అమలు చేసే మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని అసెంబ్లీ వేదికగానే హామీ ఇచ్చానని, ఏక సభ్య కమిషన్ రిపోర్టును మంత్రివర్గంలో ఆమోదించి అసెంబ్లీలో బిల్లుపెట్టి చట్టబద్ధత కల్పించనున్నామని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసింది రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ కు ఓటు వేయాలి.. సమస్యకు పరిష్కారం చూపించిన కాంగ్రెస్‌వైపు దళిత సోదరులు నిలబడాలి.. అని పిలుపునిచ్చారు. శానసమండలిలో పట్టభద్రుల సమస్యను ప్రస్తావించి పరిష్కరించే నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కావాల్సిన అవసరం ఉన్నదని, ఓడిపోతే ప్రభుత్వంతో చర్చించేవారే లేకుండా పోతారని, అది పట్టభద్రులకు నష్టమని అన్నారు. ప్రభుత్వానికి, పట్టభద్రులకు వారధిగా ఉంటారనే నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టామన్నారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ పట్టణాల్లో పట్టభద్రతులు, టీచర్లతో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశాల్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్, మంత్రులు శ్రీదర్ బాబు, సీతక్క, ఎమ్మెల్యేలు బోజ్జు పటేల్, వివేక్ వెంకట స్వామి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: KRMB Meeting: తెగని నీటి పంచాయితీ.. బోర్డు కీలక ఆదేశాలు

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?