Director Shankar: దర్శకుడు శంకర్.. ఈ పేరు వినగానే ఎక్కువగా గుర్తుకు వచ్చేది భారీతనం. భారీ ఫిలిమ్స్. ‘జెంటిల్‌మ్యాన్, ప్రేమికుడు, భారతీయుడు, ఒకే ఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, రోబో’ వంటి అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాలు ఇచ్చిన శంకర్‌కు ఈ మధ్య బ్యాడ్ టైమ్ బాగా నడుస్తుంది. ఆయన చేసిన ‘భారతీయుడు 2’, ‘గేమ్ చేంజర్’ సినిమాలు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాయి. ముఖ్యంగా ‘గేమ్ చేంజర్’ విషయంలో ఇప్పటికే మెగా ఫ్యాన్స్ శంకర్‌ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ‘గేమ్ చేంజర్’ (Game Changer) సినిమా విడుదల తర్వాత ఎక్కడా కనిపించని శంకర్, తాజాగా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ (Return of the Dragon) మూవీపై ప్రశంసలు వర్షం కురిపిస్తూ ఎమోషనల్ అయ్యాడు. తాజాగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో వచ్చిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ చిత్రం చూసిన శంకర్, ఆ సినిమాను పొగడ్తలతో ముంచెత్తుతూ చిన్నపాటి రివ్యూనే ఇచ్చేశాడు.
Also Read- Mokshagna Teja: 2025లోనూ మోక్షం లేనట్టేనా?
సోషల్ మీడియా వేదికగా సినిమా విశేషాలు పంచుకున్న శంకర్, ఈ మూవీ చాలా నచ్చిందని చెప్పారు. సినిమాను అద్భుతంగా రూపొందించారంటూ యూనిట్ అందరినీ మెచ్చుకున్నారు. ఈ చిత్రం తనను భావోద్వేగానికి గురి చేసిందని, నటీనటులందరూ ఎక్స్‌లెంట్‌గా యాక్ట్ చేశారని ప్రశంసించారు. పాత్రలకు తగ్గట్టుగా నటించారని, డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటుడిగా మరోసారో ప్రూవ్ చేసుకున్నాడని తెలిపారు. రాఘవన్ రోల్‌లో ప్రదీప్ రంగనాథన్ నటించిన తీరు అద్భుతంగా ఉందని, ముస్కిన్, అనుపమ పరమేశ్వరన్, జార్జ్ మరియన్ పాత్రలు ఎప్పటికీ గుర్తు ఉండి పోతాయని అన్నారు. ఇక మూవీ లాస్ట్ 20 నిమిషాలు మాత్రం ఎంతో ఎమోషనల్‌గా ఉందని పేర్కొన్నారు. క్లైమాక్స్ సన్నివేశాలు చూసి కన్నీరు పెట్టానని చెప్పుకొచ్చారు. సమాజానికి ఇలాంటి చిత్రాలు అవసరమని పేర్కొన్నారు. ఈ మూవీ నిర్మాణ సంస్థకు అభినందనలు తెలిపారు. శంకర్ చేసిన పోస్ట్‌కు ప్రదీప్ రంగనాథన్ రిప్లై ఇచ్చారు.
‘మీ చిత్రాలే చూస్తూ పెరిగాను. మీరే నా ఫేవరేట్ డైరెక్టర్. మీరే నాకు రోల్ మోడల్. మీరు నా సినిమాపై ఈ విధంగా స్పందిస్తారని ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఇది నమ్మలేక పోతున్నా. ఇంతటి ఆనందం మాటల్లో చెప్పలేనిది. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలి. మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు’ రంగనాథన్ తన సంతోషాన్ని తెలియజేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ, ఇదే విషయంపై శంకర్‌ని నెటిజన్లు కొందరు ట్రోల్ చేస్తున్నారు. నీకు అంత బడ్జెట్ ఇచ్చి, గ్లోబల్ స్టార్‌ని హీరోగా ఇస్తే, నాసిరకం సినిమా తీసి.. చిన్నపిల్లలు చేసిన సినిమాను పొగుడుతున్నావా? అసలు ‘గేమ్ చేంజర్’ సినిమా రిలీజైన తర్వాత ఒక్కటంటే ఒక్క మీడియా సమావేశం నిర్వహించారా? కనీసం సోషల్ మీడియాలో అయినా రెస్పాండ్ అయ్యారా? ఇప్పుడొక చిన్న సినిమా కోసం, మీరు ఇలా రియాక్ట్ అయ్యి, మీ స్థాయిని తగ్గించుకున్నారంటూ మెగాభిమానులు శంకర్‌ని టార్గెట్ చేస్తున్నారు.