MLC Elections: బీఆర్ఎస్ శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక హాట్ టాపిక్గా మారింది. అధినేత కేసీఆర్ కొత్తవారికి అవకాశం ఇస్తారా? లేక ప్రస్తుతం పదవీకాలం ముగుస్తున్నవారికే రెన్యూవల్ చేస్తారా? అనే చర్చమొదలైంది. ఈ చర్చ ఎలా ఉన్నా.. కొంతమంది సీనియర్లు మాత్రం ఎమ్మెల్సీ కోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎవరికి కేసీఆర్ ఆశీస్సులు ఉంటాయనేది నేతలకు అర్థంకాని పరిస్థితి. గతంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను గవర్నర్ కోటాకు సిఫార్సు చేసినా.. నాటి గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. వారిని మళ్లీ ఎమ్మెల్యే కోటాలో సిఫార్సు చేస్తారా? అనే అంశంపైనా చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే నెల 29న ఖాళీ అవుతున్నాయి. అందులో బీఆర్ఎస్ నుంచి శేరి శుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీతోపాటు.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎగ్గె మల్లేశం, ఎంఐఎంకు చెందిన మీర్జా రియాజ్ ఉల్ హసన్ స్థానాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 6న హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో బీఆర్ఎస్ నుంచి ఎంపికై ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంఎస్ ప్రభాకర్ పదవీకాలం పూర్తవుతుంది. ఈ స్థానాలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో బీఆర్ఎస్‌లోని ఆశావహులు.. ఎవరికి వారుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేటీఆర్, హరీశ్ రావు, కవితను సైతం కలిసి విజ్ఞప్తులు చేస్తున్నట్లు విశ్వసనీయసమాచారం. కొంతమంది నేతలు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లి.. కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది.
బీఆర్ఎస్‌కు ఒకే స్థానం
నోటిఫికేషన్ వెలువడబోయే 5 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం మాత్రమే దక్కనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో విజయం సాధించగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. దాంతో బీఆర్ఎస్ బలం 38 మందిగా ఉన్నది. అందులో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో గులాబీ ప్రాతినిధ్యం 28కి పడిపోయింది. త్వరలో జరుగబోయే శాసనసభ్యుల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి సగటున 23 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. దీంతో బీఆర్ఎస్ ఒక ఎమ్మెల్సీ తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఒకటి ఎంఐఎం, మూడు కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి. దీంతో ఆ ఒక్కస్థానం బీఆర్ఎస్‌లో ఎవరికి దక్కుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్నది. ఇటీవలి కాలంలో బీఆర్ ఎస్ బీసీ వాదం ఎత్తుకుని కుల గణన, బీసీ రిజర్వేషన్ అంశాలను ప్రస్తావిస్తున్న నేపథ్యంలో బీసీకి అవకాశం ఏమన్నా ఇస్తారా? అనే చర్చలు పార్టీలో నడుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వాదంతో వెళ్లి మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలంటే ఈ ఎమ్మెల్సీ కూడా కీలకం కానుంది.
మళ్లీ సత్యవతి రాథోడ్ కు రెన్యూవల్?
బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీలకు ప్రభుత్వ పథకాలను అందించలేదని ఆ వర్గ ప్రజలు గుర్రుగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులు కారును పట్టించుకోలేదని ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గ ఫలితాలు స్పష్టం చేశాయి. ఆ వర్గాలను మళ్లీ దగ్గరకు చేర్చుకోవాలనే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉన్నది. అలా చూసినప్పుడు సత్యవతికి మళ్లీ అవకాశం ఇవ్వచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఈ నెల 4న సత్యవతి రాథోడ్ ను మండలిలో బీఆర్ఎస్ విప్ గా ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఆమెను తొలగిస్తే విప్ నెల రోజుల ముచ్చటగానే మారనుంది. ఇది వచ్చే అన్ని ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలుపుపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
విప్ జారీ చేసే ఆలోచనలో బీఆర్ఎస్?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఆ 10 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను సైతం అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తున్నది. పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. తద్వారా కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాలన్నది గులాబీ అధిష్ఠానం ఆలోచనగా చెబుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు విప్ జారీ చేసినా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తే కోర్టులో దీనిని అస్త్రంగా చేసుకుంటామని బీఆర్ ఎస్ నేతలు అంటున్నారు.
Also Read:
Ponnam Prabhakar: 317 జీవో …స్థానికత్వం అంశం కేంద్ర పరిధిలోనిది
SLBC Tunnel: బీఆర్ఎస్ టన్నెల్ పాలిటిక్స్.. చేసిందంతా చేసి!