Politics-on-Tunnel
Politics

SLBC Tunnel: బీఆర్ఎస్ టన్నెల్ పాలిటిక్స్.. చేసిందంతా చేసి!

SLBC Tunnel: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్సెల్బీసీ) టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై విపక్ష బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్‌కు కౌంటర్లు వస్తున్నాయి. ఇప్పటివరకు ఘటనా స్థలానికి వెళ్లలేదు.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించలేదు.. ప్రధాన ప్రతిపక్షంగా తన వంతు బాధ్యత నిర్వహించలేదు.. అంటూ కేటీఆర్‌పై ఎక్స్ (ట్విట్టర్)లో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమీషన్ల వేటలో పర్యవేక్షణను గాలికొదిలేశారు.. నాణ్యతా ప్రమాణాల్లో రాజీపడ్డారు. అందుకే వరుస ఘటనలు జరుగుతున్నాయి.’ అంటూ కేటీఆర్ తన ట్వీట్‌లో ప్రస్తావించడంతో దానికి కౌంటర్‌గా ‘కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం… మీ తండ్రి కేసీఆరే’ అంటూ ఘాటుగానే రిప్లై ఇస్తున్నారు.

పనులు అప్పగించింది బీఆర్ఎస్ సర్కారే

కాంట్రాక్టు పనులను అప్పగించే అంశంపై నవంబర్ 11, 2014న అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఎస్సెల్బీసీ టన్నెల్ నిర్మాణంపై అప్పటి సీఎం కేసీఆర్ లోతుగా చర్చించారు. ఇప్పటికిప్పుడు కాంట్రాక్టు సంస్థను మారిస్తే లీగల్ చిక్కులతో పాటు పనుల పురోగతిలో మరింత జాప్యం జరుగుతుందన్నారు. పనులు వీలైనంత తొందరగా ప్రారంభం కావాలన్నారు. ఒకవేళ ఈ సంస్థ ముందుకు రాకుంటే ప్రత్యామ్నాయంగా మరో కంపెనీ గురించి ఆలోచిద్దామన్నారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆహ్వానించాలని, పనులను టేకప్ చేయడంపై చర్చించాలని కేసీఆర్‌కు ఎమ్మెల్యేలు సూచించారు. ప్రభుత్వం బకాయిలను చెల్లించనందువల్లనే కాంట్రాక్టు సంస్థ పనులను పెండింగ్‌లో పెట్టిందని వివరించారు. దీనికి కొనసాగింపుగా 2014-15 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 325 కోట్లను కేటాయించింది.

ప్రకటనలకే పరిమితమైన బీజేపీ

ఇదిలా ఉండగా బీజేపీ నేతలు సైతం ఎస్సెల్బీసీ ఘటనపై ప్రకటనలకు పరిమితమయ్యారు. ఘటనా స్థలానికి వెళ్లలేదు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్నీ పరామర్శించలేదు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులతోనూ సమీక్షించలేదు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రంలోనే ఉన్నా ఘటనా స్థలానికి చేరుకోలేదు. మూడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఎనిమిది మంది ప్రాణాలు ప్రశ్నార్థకంగా మారితే ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. సహాయక చర్యలకు అన్ని విధాల సహకారాన్ని అందిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినా బీజేపీ నేతలు లైట్‌గా తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమనే తీరులో బీజేపీ, బీఆర్ఎస్ వ్యవహరించడం కూడా రాష్ట్ర ప్రజల్లో చర్చకు దారితీసింది. ప్రమాదం జరిగినప్పుడు రాజకీయాలతో సంబంధం లేకుండా పరామర్శించడం, ప్రభుత్వానికి సూచనలు చేయడం అవసరమైనా ఈ రెండు విపక్ష పార్టీల తీరును తప్పుపడుతున్నారు.

ఘటనా స్థలంలోనే మంత్రుల సమీక్ష

ఎస్సెల్బీసీ టన్నెల్ ప్రమాదంలో 42 మంది సురక్షితంగా బైటకు వచ్చినా ఎనిమిది మంది ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఘటనా స్థలంలోనే ఉంటూ రెస్క్యూ ఆపరేషన్‌ను సమీక్షిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సికింద్రాబాద్‌లోని 54వ ఇన్‌ఫ్యాంట్రీ డివిజన్‌కు చెందిన 7వ ఇంజినీర్ రెజిమెంట్, సింగరేణి కాలరీస్‌ చెందిన నిపుణుల బృందం, జాతీయ రహదారుల మౌలిక సౌకర్యాల అభివృద్ధి సంస్థ నిపుణులు, రాష్ట్ర పోలీసు, అగ్నిమాపకశాఖ .. ఇలా వివిధ విభాగాలు టన్నెల్ లోపలకు వెళ్లి ఎనిమిది మందిని రక్షించడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రధాని మోదీ సైతం సీఎం రేవంత్‌తో టెలిఫోన్‌లో మాట్లాడి కేంద్రం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. సీఎం రేవంత్ సైతం ఎప్పటికప్పుడు సహాయక చర్యల పురోగతిపై మంత్రులు, అధికారుల ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు.

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్