Bride Came for Group-2 Exam: ఆదివారం ఏపీలో గ్రూప్- 2 పరీక్ష . షెడ్యూల్ ప్రకారం జరుగుతుండటంతో యథావిధిగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల సెంటర్ లో ఓ విచిత్రం జరిగింది. మరికొద్ది నిమిషాల్లో పరీక్ష ప్రారంభమవుతుందనగా… పట్టుచీర కట్టుకొని, కాళ్లకు పారాణి పెట్టుకొని, తలపై జీలకర్ర బెల్లంతో పెళ్లి కూతురు గెటప్ లో ఓ అమ్మాయి పరుగు పరుగున ఎగ్జామ్ సెంటర్ కు వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఈవిడ ఏంటీ ఇలా.. అని! విషయమేంటంటే… ఆదివారం తెల్లవారు జామునే ఆమె వివాహం జరిగింది. పరీక్ష కూడా ఇవాళే ఉండటంతో ఆమె రాక తప్పలేదు.
వివరాల్లోకి వెళ్తే… తిరుపతికి చెందిన నమిత గ్రూప్- 2 ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయింది. దాంతో ఇవాళ జరిగే మెయిన్స్ తప్పనిసరి రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె పెళ్లి కూడా ఈరోజే ఉండటంతో… తెల్లవారు జామున వివాహం చేసుకొని అనంతరం ఎగ్జామ్ సెంటర్ కు వచ్చింది. అయితే మన సంప్రదాయం ప్రకారం అప్పగింతలు వగైరా అయ్యే వరకు పెళ్లి దుస్తుల్లోనే ఉండాలి కదా బహుశా అవే దుస్తులతో ఎగ్జామ్ కు హాజరై ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.
ఏదైమైనా.. ఇలా పెళ్లి జరిగిన రోజే పరీక్ష రాయడం నమిత జీవితంలో మరిచిపోలేని సంఘటన. పెళ్లి రోజే పరీక్ష రాసిన అతి తక్కువ మంది వ్యక్తుల్లో ఆమె నిలిచిపోతుంది. మరోవైపు ఆమె కమిట్మెంట్ మెచ్చకోతగిందనే చెప్పాలి. మొత్తానికి ఎగ్జామ్ సెంటర్ కు పెళ్లి కూతురులా వచ్చిన నమితకు… ఆమె పెళ్లి కవరేజీ తో పాటు సోషల్ మీడియా కవరేజీ అదనంగా దక్కిందని చెప్పుకోవాలి.
కాగా, ఏపీలో గ్రూప్- 2 పరీక్షలు ప్రశాతంగా మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. ఉదయం 10 గంటలకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటలకు పేపర్-2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. దాదాపు 92 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు తెలుస్తోంది.