రాహుల్ కనుసన్నల్లోనే రాష్ట్ర వ్యవహారాలన్నీ
సిన్సియారిటీ కారణంగానే ఇన్‌చార్జి బాధ్యతలు
రిపోర్టులన్నీ ఎప్పటికప్పుడు రాహుల్ చెంతకు
మంత్రులు, ఎమ్మెల్యేలలో మొదలైన గుబులు
పైరవీలు, ఫిర్యాదులు పనిచేయవనే ఆందోళన
రాష్ట్రంలో జరిగేవన్నీ తెలుసని ఇప్పటికే హింట్
జూమ్ మీటింగ్‌లోనే ఆమె ఫంక్షనింగ్‌ను పసిగట్టిన నేతలు
గతంలోని ఇన్‌చార్జ్‌లకు భిన్నంగా ఉందనే టాక్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా (AICC In charge) మీనాక్షి నటరాజన్‌ను (Meenakshi Natarajan) నియమించడంతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతల్లో అలజడి మొదలైంది. ఇప్పటివరకు రాష్ట్రానికి (Telangana) ఇన్‌చార్జ్‌లుగా పనిచేసిన గులాం నబీ ఆజాద్ (Gulam Nabi Azad), దిగ్విజయ్ సింగ్(Digvijay Singh), ఆర్సీ కుంతియా, మాణిక్కం ఠాగూర్, మాణిక్‌రావ్ థాక్రే, దీపాదాస్ మున్షీ (Deepa Das Munshi) తదితరులతో పోల్చి చూసుకుంటున్నారు. ఇన్‌చార్జ్‌గా లాంఛనంగా బాధ్యతలు తీసుకోకముందే ఆమె రెండు రోజుల క్రితం రాష్ట్ర నేతలతో జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం చేసిన సూచనలతో ఆమె ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో రాష్ట్ర నేతలు పసిగట్టారు. రాహుల్‌గాంధీ దూతగా ఆమె ఇక్కడి వ్యవహారాలపై ఎప్పటికప్పుడు నేరుగా ఆయనకే రిపోర్టు ఇస్తారని అంచనా వేశారు. దీంతో పైరవీలు, ప్రలోభాలు పనిచేయవని, పనితీరే ప్రామాణికంగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు.
సీనియర్లలో గుబులు…
మంత్రుల మధ్య సఖ్యత లేదని, ఒకరిపై మరొకరు ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తున్నారని, పార్టీకి-ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదని, సమిష్టిగా జరగాల్సిన పార్టీ కార్యకలాపాలు కుంటుపడుతున్నాయని.. ఇలాంటి అనేక అంశాల నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ఫంక్షనింగ్‌పై నేతల మధ్య చర్చలు మొదలయ్యాయి. వీటన్నింటినీ చక్కదిద్దే బాధ్యతను మీనాక్షికి అప్పజెప్పడం వెనక ఆమె సిన్సియారిటీ, పార్టీ పట్ల కమిట్‌మెంట్ లాంటివే కీలకమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇకపైన పార్టీలో, ప్రభుత్వంలో జరిగేవన్నీ నేరుగా రాహుల్‌గాంధీకి చేరుతాయేమోననే గుబులు సీనియర్లలో మొదలైంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా, ఈ కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలైనా, భారీగా ప్రజాధనం ఖర్చయినా ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆశించిన స్పందన లేకపోవడానికి కారణాలపైనా రాహుల్‌గాంధీకి ఆమె రిపోర్టు ఇచ్చే అవకాశాలున్నాయనే గుబులు పలువురు నేతల్లో మొదలైంది.
లాయల్‌గా పనిచేసే వారికే బాధ్యతలు…
ఎంతోమంది సీనియర్లు ఉన్నా వారిని కాదని మీనాక్షి నటరాజన్‌ను నియమించడం వెనక పార్టీ ఉద్దేశాన్ని రాష్ట్ర నేతలు చర్చించుకుంటున్నారు. రాహుల్‌గాంధీ (Rahul Gandhi) కనుసన్నల్లోనే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఆమె ఫంక్షనింగ్ ఉంటున్నందున ఇకపైన జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంపై గుసగుసలు మొదలయ్యాయి. పైరవీలు, ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి లాయల్‌గా పనిచేయడమే ప్రయారిటీగా తీసుకుని ఆమె బాధ్యతలు అప్పగిస్తారేమోననే అంచనాలూ నెలకొన్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన జూమ్ మీటింగ్‌లో ఆమె వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలను నేతలు పరస్పరం చర్చించుకున్నారు. ‘రాష్ట్రంలో ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఎవరు ఏంటో కూడా నాకు అంచనా ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చినప్పుడే నేతల మధ్య భిన్నాభిప్రాయాలు నా దృష్టికి వచ్చాయి. అప్పట్లో నేను రాష్ట్ర వ్యవహారాల్లో లేకపోవడంతో వేలు పెట్టలేదు. అధికారంలోకి రావాలన్నదే లక్ష్యం కావడంతో అప్పట్లో నేను జోక్యం చేసుకోలేదు’. అంటూ కామెంట్లు చేసి ఇకపైన ఎలా వ్యవహరించనున్నదీ సంకేతంగా వ్యక్తం చేశారని ఆ మీటింగ్‌లో పాల్గొన్న ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
నేరుగా రాహుల్‌గాంధీకే రిపోర్టు…
లాంఛనంగా బాధ్యతలు తీసుకుని పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆమె కార్యాచరణ, పనితీరు ఎలా ఉంటుందనేది స్పష్టం కానున్నది. అధికారంలోకి రాకముందు పార్టీ యాక్టివ్‌గా ఉందనే భావన శ్రేణుల్లో నెలకొన్నా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవన్నీ నీరసపడ్డాయనే మాటలు ఓపెన్‌గానే వినిపిస్తున్నాయి. పార్టీలో, ప్రభుత్వంలో అనేక రూపాల్లో వ్యక్తమవుతున్న విభేదాలను పరిష్కరించడం, లైన్ తప్పుతున్న నేతలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం.. ఇలాంటి అంశాల్లో మీనాక్షి మార్క్ ఎలా ఉంటుందనేది పార్టీలోని అన్ని స్థాయిల లీడర్లలో చర్చనీయాంశంగా మారింది. నేరుగా రాహుల్‌గాంధీకే ఆమె రిపోర్టు చేయనున్నందున ఎప్పుడు ఎవరికి అక్కడి నుంచి పిలుపు వస్తుందనే గుబులు ఇప్పటి నుంచే మొదలైంది.
ఇవీ చదవండి
YCP: వైసీపీలో మునుపెన్నడూలేని చిత్ర విచిత్రాలు
Komatireddy Venkatreddy: గండ్రే హంతకుడు; హత్య రాజకీయాలను ప్రోత్సహించడమే కేసీఆర్ నైజం