Trivikram Srinivas: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రాసలు, పంచులు పరిచయం చేసిన రచయిత.. హీరోలు తమ కెరీర్‌లో ఒక్క సినిమా అయినా ఆయనతో చేయాలని కోరుకునే దర్శకుడు.. వీటన్నింటికి మించి, స్నేహం చేస్తే ఇలాంటి వ్యక్తితోనే చేయాలనిపించేంతగా స్నేహం స్థాయిని పెంచిన స్నేహితుడు.. ఇలా చెప్పుకుంటూపోతే ఆయన గురించి చెప్పడానికి మాటలు, రాయడానికి కలాలు సరిపోవు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరని అనుకుంటున్నారా? ఇంకెవరు? ది వన్ అండ్ ఓన్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ పేరు తెలుగువారికి పరిచయం అక్కరలేని పేరు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీని, గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో అగ్రస్థానంలో నిలిచే దర్శకుడాయన.
రచయితగా, మాటల మాంత్రికుడిగా పయనం మొదలుపెట్టి, దర్శకుడిగా తన సత్తా చాటుకున్న త్రివిక్రమ్, ఇకపై ఇండస్ట్రీకి దూరం అవుతున్నాడా? అంటే అవుననే చెబుతున్నాయి టాలీవుడ్ వర్గాలు. టాలీవుడ్ అగ్ర దర్శకుల లిస్ట్‌లో టాప్ 3లో నిలిచే వ్యక్తి.. కథ రెడీగా ఉంది సినిమా చేద్దామా? అంటే చాలు మరో ఆలోచన లేకుండా ఎటువంటి స్టార్ హీరో అయినా డేట్స్ ఇచ్చేసే ఇమేజ్ ఉన్న దర్శకుడు, ఇలా ఒక్కసారిగా సినిమాలకు దూరం అవుతున్నాడంటే, అది సామాన్యమైన విషయం కానే కాదు. కానీ, కొన్ని రోజులుగా త్రివిక్రమ్ నడవడికను చూసిన వారంతా అదే అభిప్రాయపడుతున్నారు. అసలు త్రివిక్రమ్‌పై ఇటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు రావడానికి కారణం ఏమిటి?
Also Read- Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆ ఫోబియా పోలేదా!
త్రివిక్రమ్ వంటి దర్శకుడు ఖాళీగా ఉన్నాడని తెలిస్తే, ఆయన కోసం హీరోలు క్యూ కడతారు. ఎందుకంటే, ఆయన రచనా శక్తి అలాంటిది. తెలుగు సినిమా చరిత్రలో ఉన్న అత్యుత్తమ రచయితలలో త్రివిక్రమ్ ఒకరు. అలాంటి త్రివిక్రమ్ ఏడాదికి ఒక సినిమా కూడా చేయకుండా కాలయాపన చేస్తున్నారు. కాంట్రవర్సీలలో చిక్కుకుంటున్నారు. ఆయన నుండి సినిమా వచ్చి సంవత్సరం పైనే అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) హీరోగా చేసిన ‘గుంటూరు కారం’ ఆయన చివరి చిత్రం. ఆ సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun)తో ఓ సినిమా ప్రకటించినా, ఇంత వరకు అది పట్టాలెక్కలేదు.
అసలు ఆ ప్రాజెక్ట్ ఉంటుందో, లేదో తెలియనంతగా అనుమానాలు పెరిగిపోయాయి. పాన్ వరల్డ్ సినిమా అన్నారు.. అద్భుతమైన కథ రెడీ చేశారని చెప్పారు. కానీ, ఇంత వరకు ఆ ప్రాజెక్ట్ ఎంత వరకు వచ్చిందనేది మాత్రం ఎవరికీ తెలియదు. ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమా త్రివిక్రమ్‌తోనే అనేలా ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తుంటే, ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి అట్లీ వచ్చి చేరారు. అల్లు అర్జున్ – అట్లీ ప్రాజెక్ట్‌పై రోజుకో వార్త వైరల్ అవుతుంది కానీ, త్రివిక్రమ్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్‌పై చిన్న గాసిప్ కూడా లేదు. అందుకే త్రివిక్రమ్ సినిమాలకు దూరం అవుతున్నాడనేలా వార్తలు మొదలయ్యాయి.

అసలు విషయం ఇదేనా?
త్రివిక్రమ్ పేరు సినిమాల విషయంలో వినిపించడం లేదు కానీ, పొలిటికల్ సర్కిల్స్‌లో ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పేరు కనబడిన ప్రతిసారి ఆయన పేరు హైలెట్ అవుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో త్రివిక్రమ్ పాత్ర ఏమిటో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎన్నికల సమయంలో జనసేనాని మాట్లాడిన ప్రతి మాట, ఈ మాంత్రికుడు రాసిచ్చిందే అనేలా పొలిటికల్ సర్కిల్స్ మాట్లాడుకున్నాయి. పవన్, ఆయన పార్టీ గెలవడంలోనూ, గెలిచిన తర్వాత కూడా త్రివిక్రమ్ అడుగడుగునా వెన్నంటే ఉంటున్నాడనేదానికి సాక్ష్యాలు ఎన్నో చెప్పుకోవచ్చు. ఇటీవల కుంభమేళా పుణ్య స్నానాలకు వెళ్లిన సేనాని వెంటే ఉన్నాడు త్రివిక్రమ్.
ఇలా జనసేన (Janasena) రాజకీయ కార్యక్రమాలలో త్రివిక్రమ్ కీలక పాత్ర పోషిస్తూ.. వారంలో మూడు, నాలుగు రోజులు హైదరాబాద్ వదిలి, అమరావతిలోనే ఉంటున్నాడనేది ఎప్పటి నుంచో వినిపిస్తోంది. మధ్యలో చాలా సార్లు త్రివిక్రమ్ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చాడు కూడా. ఇవన్నీ చూస్తుంటే, సినిమాలు పూర్తిగా వదిలేసి పొలిటికల్‌గా త్రివిక్రమ్ బిజీ కాబోతున్నాడనేది టాక్. ఈ నేపథ్యంలో ఆయనకు జనసేన పార్టీ తరపున కీలక పదవి దక్కబోతున్నట్లుగా అటు సినిమా, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాజకీయంగా పవన్ కళ్యాణ్‌కు ప్రధాన సలహాదారుడిగా, లేదంటే ఎస్వీబీసీ ఛైర్మన్‌గా త్రివిక్రమ్‌ను నియమిస్తారనేలా జనసేన వర్గాల్లో ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇదే నిజమైతే, ఇకపై ఈ మాటల మాంత్రికుడి నోట రాబోయే పొలిటికల్ పంచ్‌లు, ప్రాసలు ఎలా ఉంటాయో చూడాలి.
ఇవి కూడా చదవండి: