Politics

TG’S Krishna Water loss: ఏపీకి యథేచ్చగా నీరు… తప్పెవరిది?

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : కృష్ణా జలాల వినియోగంతో పాటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అక్రమంగా తరలిస్తున్న నీటిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నాటి సీఎం కేసీఆర్ (KCR) సంపూర్ణ సహకారంతోనే శ్రీశైలం (Srisailam Reservoir) నుంచి ఏపీకి నీరు యథేచ్ఛగా తరలించారని, అప్పటి సీఎం వైఎస్ జగన్‌తో దోస్తానా చేసి సొంత రాష్ట్రానికి అన్యాయం చేశారని మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రాజెక్టును పండబెట్టి ‘‘బేసిన్లు లేవ్.. భేషజాల్లేవ్.. ’’అంటూ ప్రగతి భవన్‌లో విందు రాజకీయం చేసి ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజల, రైతుల నోట్లో మట్టిగొట్టారని ఆరోపించారు. మాజీ ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు (Harish Ra0) చేసిన విమర్శలకు సైతం ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఏపీ వాటాగా 512 టీఎంసీల (TMC) మేర మాత్రమే కృష్ణా జలాలను వాడుకోవాల్సి ఉన్నా ఇప్పటికి 657 టీఎంసీలను తరలించిందని, ఇప్పటికీ రోజుకు 10 వేల క్యూసెక్కుల వంతున సాగర్ కుడికాల్వ నుంచి ఆ రాష్ట్రానికి పోతున్నాయని ఆరోపించారు. తెలంగాణ 299 టీఎంసీలను వాడుకోవాల్సి ఉన్నా 220 టీఎంసీల దగ్గరే ఆగిపోయిందన్నారు.

గత ప్రభుత్వ తప్పిదమే..
ఒకవైపు సుప్రీంకోర్టులో పెండింగ్ పిటిషన్ విచారణ, మరోవైపు జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ (Justice Brijesh Kumar Tribunal) ముందు తెలంగాణ (Telangana) వాదనలు జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్య పొలిటికల్ ఫైట్ చోటుచేసుకున్నది. గత ప్రభుత్వం చేసిన తప్పిదం కారణంగానే తెలంగాణకు అన్యాయం జరిగిందని, బేసిన్ విస్తీర్ణం తెలంగాణలో ఎక్కువగా ఉన్నా 299 టీఎంసీలకే పరిమితమై ఏపీకి మాత్రం 512 టీఎంసీలు వాడుకునేలా కేసీఆర్ సహకరించారని మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా బోర్డు (KRMB) గణాంకాలనే పరిగణనలోకి తీసుకున్నా 2014-15 నుంచి 2020-21 మధ్య కృష్ణా జలాల్లో ఏపీ 64% పైగానే నీటిని వాడుకున్నదని, తెలంగాణ మాత్రం 36% కూడా వినియోగించుకోలేకపోయిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుమీద చూపించిన శ్రద్ధను కృష్ణా నది ప్రాజెక్టులపై చూపలేదని విమర్శించారు. కమీషన్ల కోసమే భారీ ప్రాజెక్టులను చేపట్టి 12% వడ్డీకి రుణాలను తీసుకున్నదని, ప్రజాధనం దుర్వినియోగం కావద్దన్న దృష్టితో సంప్రదింపులు జరిపి దాన్ని 7%కి తగ్గించుకున్నామని తెలిపారు.

కేసీఆర్ కారణంగా తెలంగాణకు అన్యాయం..
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది ముమ్మాటికీ బీఆర్ఎస్ పాలనలోనే అని మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడి నీటిని తరలించుకుపోతున్నా మౌనంగా ఉండడమే కాక సహకరించిందన్నారు. ఇప్పుడు అదే పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకు తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని మండిపడ్డారు. గులాబీ నేతలు అప్పుడే ఉల్లంఘనలపై స్పందించి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేదే కాదన్నారు. ఏపీకి సాయం చేయాలన్న ఉద్దేశంతోనే కృష్ణా జలాల వాడకాన్ని లెక్కించడానికి అమర్చాల్సిన టెలీ మెట్రీ సిస్టమ్ విషయంలో కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా తప్పిదానికి పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. కేసీఆర్ హయాంలో సాగునీటిపారుదల రంగం భ్రష్టుపట్టిందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో చేసిన అప్పులు ఈ రాష్ట్రానికి ఎప్పటికీ భారమేనని, లక్ష కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేసినా ఎకరం ఆయకట్టూ అదనంగా రాలేదన్నారు.

అప్పటి అప్పులు ఎప్పటికీ భారమే ..
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిస్తే ఇప్పుడు దాన్ని చక్కదిద్దే పనులు మొదలుపెట్టాల్సి వచ్చిందని మంత్రి వివరించారు. జేబులు నింపుకునేందుకే భారీ ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేశారని కేసీఆర్‌పై ఆరోపణలు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై రూ. 25,500 కోట్లు ఖర్చు చేసినా ప్రగతి లేదన్నారు. సకాలంలో ఎస్సెల్బీసీ (శ్రీశైలం లెప్ట్ బ్యాంక్ కెనాల్), పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు లాంటి ప్రాజెక్టులను పూర్తిచేస్తే నీటి దోపిడీ జరిగి ఉండేదే కాదన్నారు. అప్పటి వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే ఇప్పుడు హరీశ్‌రావు లాంటి బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ గొప్పగా చెప్పుకుంటే మూడు బ్యారేజీల డ్యామేజీ అయ్యాయన్నారు. ‘హృదయం’ అని మేడిగడ్డ ఇప్పుడు పనికిరాదంటూ ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చి నీటిని నిల్వ చేయొద్దని ఆదేశించిందన్నారు. తప్పుడు డిజైన్, నాసిరకం నిర్మాణం, నిర్వహణ లేకపోవడంతోనే సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు.

కేసీఆర్, హరీశ్ సమాధానం చెప్పగలరా?
బీఆర్ఎస్ పాలనలో దేవాదుల, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయల్ సాగర్, ఎస్‌ఎల్‌బీసీ, డిండి లాంటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదో, ఇప్పటికీ ఎందుకు పెండింగ్‌లో పెట్టారో చెప్పగలరా అని కేసీఆర్, హరీశ్‌రావులను మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంపైనా, తెలంగాణ జల హక్కులను కాపాడడంపైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్నారు. ప్రాజెక్టులు పూర్తికాని కారణంగా నీటి కేటాయింపులు జరగలేదని, ఆ తప్పులను చక్కదిద్దేందుకే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం గోదావరి నుంచి 67 టీఎంసీలు, సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు 44 టీఎంసీ కేటాయించేలా చర్చలు మొదలయ్యాయన్నారు. గత ప్రభుత్వం ఏపీ సర్కారుతో కుదుర్చుకున్న 512:299 టీఎంసీలు (ఏపీ:తెలంగాణ) కృష్ణా జలాల ఒప్పందాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. పరీవాహక ప్రాంతం, కరువు ప్రభావిత ప్రాంతాలు, జనాభా, సాగు విస్తీర్ణం తదితర అంశాల ఆధారంగా నీటి కేటాయింపుపై ఒత్తిడి తెస్తున్నామన్నారు.

ఏపీ కొత్త ప్రాజెక్టులపైనా కేసీఆర్ సైలెంట్ ..

కృష్ణా బోర్డు మీటింగ్ మినిట్స్‌ అంశాలను మంత్రి ఉత్తమ్ ఉదహరిస్తూ, కీలక ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించిందని, ఇది తప్పుడు నిర్ణయమని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. ఆపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్లను పిలిచేందుకు బీఆర్ఎస్ సహకరించిందన్నారు.

రహస్య ఒప్పందం మేరకే..
కేసీఆర్, వైఎస్ జగన్ మధ్య కుదిరిన రహస్య ఒప్పందం మేరకే రోజుల వ్యవధిలోనే ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించిందన్నారు. దీంతో తెలంగాణ 7 టీఎంసీల నీటిని కోల్పోయిందని, ఆంధ్రప్రదేశ్‌కు శ్రీశైలం నుంచి రోజూ 8 టీఎంసీ నీటిని తీసుకునేందుకు అనుమతి లభించిందని గుర్తుచేశారు. కృష్ణా బోర్డు లెక్కల ప్రకారం 2014-15లో ఏపీ 529.33 (69.92%) టీఎంసీ నీటిని ఉపయోగించుకుంటే తెలంగాణ కేవలం 227 టీఎంసీ (30.08%)లనే వాడుకున్నదన్నారు. 2020-21 నాటికి ఏపీ వినియోగం 629.07 టీఎంసీలకు పెరిగిందన్నారు. ఈ ఉల్లంఘనలపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ 2005లో 44,000 క్యూసెక్కులుగా ఉంటే 2023 నాటికి 92,600 క్యూసెక్కులకు పెరిగిందన్నారు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్