మూడు బిల్లులను సభలో ప్రవేశపెట్టే చాన్స్
కులగణనపై రెండు బిల్లులకు కసరత్తు స్టార్ట్
స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42% కోటా
ఏకసభ్య కమిషన్ రిపోర్టు మేరకు వర్గీకరణ బిల్లు
చట్టబద్ధత తర్వాత పార్లమెంటు ఆమోదానికి
మార్చి 10న ఆల్ పార్టీ టీమ్‌తో ఢిల్లీకి సీఎం
థర్డ్ వీక్‌లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు షురూ
Assembly | తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర సర్కార్.. చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలనుకుంటున్నది. వచ్చే నెల ఫస్ట్ వీక్‌లో (వీలైతే 1 నుంచి 5వ తేదీల మధ్య) కనీసంగా ఐదు రోజుల పాటు చర్చలు జరిగేలా ఈ రెండు అంశాలకు సంబంధించి మూడు బిల్లులను ప్రవేశపెట్టేందుకు అధికారుల స్థాయిలో కసరత్తు జరుగుతున్నదని సమాచారం. కులగణన సర్వేకు చట్టబద్ధత కల్పించడం ద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుతో పాటు విద్య, ఉద్యోగాల్లోనూ అవకాశాలు కల్పించేలా రెండు వేర్వేరు బిల్లులను ఈ సెషన్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నదని తెలుస్తున్నది. మరోవైపు ఎస్సీ వర్గీకరణపైనా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సమర్పించే తుది నివేదిక ఆధారంగా ఒక బిల్లును సభ ముందుకు తీసుకురావాలనుకుంటున్నది. ఈ రెండింటిపై అన్ని పార్టీలకు చెందిన సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
పదిన ఢిల్లీకి అఖిలపక్షం! చట్టసభల ఆమోదం తర్వాత గవర్నర్ (Governor) సంతకంతో చట్టాలుగా ఇవి ఉనికిలోకి రానున్నాయి. పార్లమెంటు ఆమోదం కోసం వీటిని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ క్రమంలో వీలైతే మార్చి 10న అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళేలా సీఎం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వం ఆలోచిస్తున్న ఈ మూడు బిల్లుల ముసాయిదాలను రూపొందించడంలో సంబంధిత శాఖల అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇవి కొలిక్కి వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది రూపు ఇవ్వాలని ప్రాథమిక రోడ్ మ్యాప్ ఖరారైంది. అవసరమైన సవరణలు జరిగిన తర్వాత మంత్రివర్గం ఆమోదించి అసెంబ్లీ ప్రత్యేక సెషన్, చర్చలు, ఏకగ్రీవ ఆమోదం తదితరాలపై నిర్దిష్ట షెడ్యూల్ రూపొందించనున్నది. కులగణన, ఎస్సీ వర్గీకరణలను అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించడంతో దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలబడాలన్నది సీఎం రేవంత్ లక్ష్యంగా అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.
28 తర్వాత గణాంకాలు
ప్రస్తుతం కులగణన సెకండ్ ఫేజ్ సర్వే జరుగుతున్నందున ఈ నెల 28న ముగిసిన వెంటనే ప్లానింగ్ డిపార్టుమెంట్ గణాంకాలను సిద్ధం చేసి డెడికేటెడ్ కమిషన్‌కు అందించనున్నది. ఆ తర్వాత తుది నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా మంత్రివర్గానికి చేరనున్నది. క్యాబినెట్ భేటీలో ఆమోదంతో అసెంబ్లీ ముందుకు బిల్లుల రూపంలో రానున్నాయి. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎమ్మార్పీఎస్ సూచనల మేరకు జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ గడువును పొడిగించిన రాష్ట్ర సర్కార్ మార్చి 10వతేదీ లోగా తుది నివేదికను సమర్పించాలని ఆదేశించింది. అసెంబ్లీ స్పెషల్ సెషన్‌కు ఫస్ట్ వీక్‌లో ముహూర్తం ఖరారు కావడంతో ఈ రెండు కమిషన్ల రిపోర్టులు వెంటవెంటనే ప్రభుత్వానికి అందే అవకాశాలున్నాయి. మొత్తం మూడు బిల్లులు చట్టంగా రూపొందిన తర్వాత అఖిలపక్ష బృందాన్ని సీఎం రేవంత్ ఢిల్లీకి తీసుకెళ్ళి పార్లమెంటులో ఆమోదించేలా ఒత్తిడి తీసుకురావడానికి ప్లానింగ్ జరుగుతున్నది. ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చిన తర్వాత థర్డ్ వీక్‌లో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి.