Ys Jagan
ఆంధ్రప్రదేశ్

TDP vs YCP: పొలిటికల్ ఘాటు ; మిర్చి రేటుపై వైసీపీ, టీడీపీ మైలేజ్ ఫైట్

గుంటూరు, స్వేచ్ఛ:  ఏపీలో రాజకీయం ఘాటెక్కింది.  మంగళవారం విజయవాడ సబ్ జైలులో వల్లభనేని వంశీని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కలిసిన తర్వాత రచ్చ మరో లెవెల్ కి వెళ్లింది.  ఇటు వైసీపీ, అటు టీడీపీ నేతలు నడుమ దూషణభూషణలు తీవ్రమయ్యాయి. ముందు.. వంశీని అక్రమంగా అరెస్టు చేశారన్న జగన్ మాటలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. జగన్ అబద్ధాల కోరు అని ఆరోపిస్తూ సత్యవర్ధన్  కిడ్నాప్ వీడియో, గన్నవరం పై పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వీడియో అంటూ రెండింటిని విడుదల చేసింది. దానికి కౌంటర్ గా వైసీపీ… ‘ట్రూత్ బాంబ్’ అంటూ సత్యవర్ధన్ కోర్టులో లొంగిపోయిన స్టేట్మెంట్ ను బయటపెట్టింది. ఆ రచ్చ అంతటితో ఆగలేదు. బుధవారమూ కొనసాగింది. మిర్చి రైతులకు మద్దతుగా గుంటూరు యార్డుకు వెళ్లిన జగన్… కూటమి పై  ఘాటు వ్యాఖ్యలు చేసి మరిన్ని రాజకీయ ప్రకంపనలు పుట్టించారు. వాటిని టీడీపీ నేతలు తమదైన శైలిలో కొట్టి పారేశారు.

జగన్ ఏమన్నారంటే…  రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కొనసాగుతున్నందున… ఆయా ప్రాంతాల్లో రాజకీయ కార్యక్రమాలు నిషేధం.  అందులో గుంటూరు కూడా ఉంది. కానీ,  వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవేమీ పట్టించుకోలేదు. ఎన్నికల కమిషన్ వద్దని చెప్పినా వినలేదు. సరైన ధర లేక మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారని, గుంటూరులోని యార్డుకు వెళ్లి వారికి భరోసానిచ్చారు. జగన్ పర్యటన నేపథ్యంలో జనం భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్, కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

కూటమి రాకతో రైతులకు బ్యాడ్ టైమ్ 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయని జగన్ అన్నారు. పంటలకు మద్దతు ధర దేవుడెరుగు కనీసం అమ్ముకుందామన్నా కొనేవారు లేరని ఆరోపించారు. మొన్నటి వరకూ ధాన్యం రైతుల కష్టాలు చూశాం, ఇప్పుడు మిర్చి రైతుల బాధలు చూస్తున్నామన్నారు. చంద్రబాబు సీట్లోకి వచ్చారు, మళ్లీ రైతులను పట్టి పీడించడం మొదలుపెట్టారు అంటూ విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో క్వింటాలుకు అత్యధికంగా రూ.21 వేల నుంచి రూ.27 వేల దాకా పలికిన మిర్చి ధర, ఇప్పుడు రూ.8వేల నుంచి రూ.11 వేలకు పడిపోయిందన్నారు.

బాబుకు కనిపించడం లేదా?

రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నా సీఎం, మంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వంలో ఒక్క రివ్యూ కూడా చేయడం లేదని, గవర్నమెంట్ తరఫున రైతులకు భరోసా ఇచ్చే వారే లేరన్నారు. ‘‘సచివాలయానికి అత్యంత సమీపంలో గుంటూరు మార్కెట్‌ యార్డు ఉంది. ఇక్కడ రైతుల ఆక్రోశం, ఆవేదన చంద్రబాబుకి వినిపించడం లేదు. ఆయన పట్టించుకోకపోగా, వైసీపీ పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. ఈ క్రాప్, ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఉద్దేశపూర్వకంగా అన్నీ మూలన పెట్టేశారు’’ అంటూ మండిపడ్డారు.

కంది పరిస్థితి ఇంతే…

ఒక్క మిర్చి రైతే కాదు, కంది పండిస్తున్న రైతులు కూడా ధరలు లేక విలవిల్లాడుతున్నారు. కందిపప్పు క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.7,550 అయితే, రూ.5,500 కూడా రావడం లేదని చెప్పారు. గతేడాది రూ.9వేల నుంచి రూ.10 వేల మధ్య ధర పలికిందని గుర్తు చేశారు. ‘‘గతేడాది క్వింటాలు పత్తి ధర రూ.10 వేలు ఉండేది. ఇప్పుడు రూ.5వేలు కూడా దాటడం లేదు. పెసలు కనీస మద్దతు ధర రూ.8,558. ఇప్పుడు రూ.6వేలు రావడం కష్టంగా ఉంది. మినుములు కనీస మద్దతు ధర రూ.7,400. గతేడాది క్వింటాలుకు రూ.10వేలు రాగా, ఇప్పుడు రూ.7వేలు కూడా రావడం లేదు. టమాటో రైతులకు కిలోకి రూ.3 నుంచి రూ.5లు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రోటోకాల్ రగడ

ప్రతిపక్ష నేతకి ప్రోటోకాల్ ఇవ్వటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగన్ అన్నారు. ఎన్నికల కోడ్ అంటూ కనీసం పోలీస్ అధికారులు లేకుండా చేశారని, రాష్ట్రంలో ఏ పంటకూ కనీసం మద్దతు ధర లేదని చెప్పారు. మిర్చి రైతుల పరిస్థితి అధ్వానంగా చేశారని, వారి సమస్యలపై మాట్లాడటానికి వస్తుంటే అడ్డుకున్నారని మండిపడ్డారు. తప్పకుండా తమ ప్రభుత్వం వస్తుందని, ఆరోజు చంద్రబాబుకి కనీసం సెక్యూరిటీ లేకుండా చేయగలమని హెచ్చరించారు.

టీడీపీ నేతల కౌంటర్…

 అచ్చెన్నాయుడు ఆగ్రహం

జగన్ గుంటూరు మిర్చి యార్డు టూర్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటుగా ఉందని, రైతుకు ఎక్కువ మేలు చేయాలనేదే తమ ప్రయత్నంగా పేర్కొన్నారు. కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నామని, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని చంద్రబాబు కలుస్తారని చెప్పారు. జగన్ నిజమైన నాయకుడు అయితే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పనిచేయాలన్నారు. జగన్ పరిస్ధితి చూస్తుంటే, ఆయన మాటలు వింటుంటే మానసిక స్ధితి సరిగ్గా లేనట్టు అనిపిస్తున్నదని విమర్శించారు. రైతు దీనావస్ధలో ఉన్నాడు, పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదు అని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో 70 శాతం ప్రజలను ప్రభావితం చేసే శాఖలకు జగన్ తాళం వేశారని గుర్తు చేశారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. పనిలేక యార్డుకు వెళ్లి ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు.

ఈసీ అనుమతి లేకున్నా ఎలా చేస్తారు?

ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర కూడా వైఎస్ జగన్‌పై ఫైరయ్యారు. కొత్త డ్రామాకు తెరలేపారని, గత ప్రభుత్వంలో కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే పట్టించుకోలేదని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని, ఇప్పుడు మాత్రం నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. గుంటూరులో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నా కూడా మిర్చి యార్డుకు వెళ్లి రాద్దాంతం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ పర్యటనకు ఈసీ అనుమతి లేదని, పోలీసులు సెక్యూరిటీ ఇవ్వం అని చెప్పినా కూడా జగన్ వెళ్లారని అన్నారు. వంశీ వ్యవహారంపై స్పందిస్తూ, జైలు దగ్గర జగన్ అధికారులను బెదిరించారని, సప్తసముద్రాలు దాటినా అధికారులను ఆయన ఏం చేయలేరని సెటైర్లు వేశారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు