Chhava: మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ఛావా’. ఫిబ్రవరి 14న కేవలం హిందీ భాషలోనే రిలీజైన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తుంది. విలక్షణ నటుడు విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు జనం నీరాజనాలు పడుతుండగా రూ. 200 కోట్ల కలెక్షన్స్ దాటి దూసుకుపోతుంది. గత కొన్ని ఏళ్లుగా గడ్డు పరిస్థితులను ఎదురుకుంటున్న బాలీవుడ్‌కు సంచలన విజయాన్ని అందించిన ‘ఛావా’ కథేంటి? థియేటర్‌లలో చిన్న,పెద్ద తేడా లేకుండా ప్రతొక్కరూ ఎందుకు కన్నీరు పెడుతున్నారు? సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ట్రెండ్ అవుతున్న స్లొగన్స్ ఏంటి? ఇదంతా తెలియాలంటే ‘ఛావా’ కథ తెలియాలి.
‘ఛావా’ ఏంటి?
‘ఛావా’ అంటే సింహం బిడ్డ అని అర్థం! సర్వమత సమానత్వంతో సువిశాల హిందూసామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ మరణానంతరం హిందూ రాజ్యంపై దురాక్రమణకు సిద్ధమైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దురాగతాలను శంభాజీ మహరాజ్ ఎలా ఎదురుకున్నాడు అనే నేపథ్యంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. సువిశాల సైనిక బలం కలిగిన ఔరంగజేబు దారుణంగా హిందూ సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తాడు. మొదట ఆలయాల కూల్చివేతే లక్ష్యంగా సాగిన మొఘలుల యాత్ర తర్వాత మతమార్పిడిలుకు తెగిస్తారు. ఇస్లాం మతం స్వీకరించకపోతే తీవ్రమైన చిత్రహింసలకు తెగపడతారు. ఈ క్రమంలోనే శంభాజీ అధర్మానికి వ్యతిరేకంగా యుద్ధభేరి మోగిస్తాడు. శంభాజీ వీరత్వాన్ని ఏ మాత్రం అంచనా వేయని మొఘలులకు శంభాజీ పరాక్రమం చూసి వెన్నులో చలి పుడుతుంది. కేవలం తన రాజ్య పరిధిలోనే కాకుండా సువిశాల మొఘల్ రాజ్యాన్ని అన్ని దిశల నుండి అంతం చేసే యజ్ఞం ప్రారంభిస్తారు. దీనికి భయపడిన ఔరంగజేబ్ శంభాజీకి ఓ ప్రతిపాదన పంపిస్తాడు. ఇందులో ‘ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి, స్వేచ్ఛగా మరాఠా సామ్రాజ్యాన్ని ఏలుకో ’ అనే ప్రతిపాదన పంపిస్తాడు. దీనికి సమాధానంగా శంభాజీ ‘ నీ కూతురిని నాకిచ్చి పెళ్లి చెయ్, అప్పుడు ప్రతిపాదనను అంగీకరిస్తా’ అని ప్రత్యుత్తరం పంపిస్తాడు. ఇది మరో పోరాటానికి కారణమవుతుంది. ఆ తర్వాత ఏమైంది అనే కథను సినిమాలోనే చూడాలి.
నట విశ్వరూపం
కేవలం ప్రస్తుత తరంలోనే కాదు ఇంకో పది తరాలు చెప్పుకునే నటుడు విక్కీ కౌషల్. మరోసారి అలవోకగా తన నటనతో విశ్వరూపం చూపించాడు. మేకింగ్, టెక్నీకల్‌గా కొన్ని లోపాలున్న తన నటనతో సినిమాకు ప్రాణం పోశాడు. ఎంతటి వీరుడి కథనైనా మేకింగ్ సరిగ్గా లేకపోతే ప్రేక్షకులు ఆదరించలేరు. ఈ సినిమాకు దక్కుతున్న ఆదరణను చూస్తే విక్కీ ఎంతగా ప్రాణం పెట్టాడో అర్ధం చేసుకోవచ్చు. ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా, ఏసుబాయిగా రష్మిక వారి పాత్రలకు న్యాయం చేశారు.
బాక్సాఫీస్ వద్ద ఊచకోత
రూ. 130 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే రూ. 200 కోట్ల మార్కును దాటింది. బుధవారం 25 కోట్లకు పైగానే సాధించినట్లు తెలుస్తుంది. హిందీ ప్రభావం లేని రాష్ట్రాల్లో కూడా జనాలు విరగబడి చూస్తుండటం భారీ కలెక్షన్స్‌కు కారణమవుతుంది. అన్ని వయసుల ఆడియెన్స్ సినిమాను రిపీటెడ్‌గా చూస్తుండటం సక్సెస్‌కు ప్రధాన కారణంగా మారింది.
థియేటర్‌లలో స్లొగన్స్ ఏంటి?
ఔరంగజేబు ప్రకటించిన రెండో యుద్ధ సన్నాహాల్లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో శంభాజీ రహస్యాలను ఆయన బావమరిది గాణోజీ షిర్కీ మొగలాయిలకు అందజేస్తాడు. దీంతో శంభాజీ ఆయన మంత్రి కవికలశ్ ఔరంగజేబుకు చిక్కుతారు. ఔరంగజేబు వారిని బంధించి ఇస్లాం స్వీకరిస్తే ప్రాణాలతో వదిలేస్తామంటాడు. అలాగే గుప్తా నిధుల రహస్యాలను అడుగుతాడు. దీంతో ఇద్దరు ‘ మా కళ్లు పీకినా, నాలుక కోసినా హిందువుగానే జీవిస్తాం.. హరహర మహాదేవ్. హిందూధర్మం అనాది. అది.. అనంతంగా ప్రవహిస్తూనే ఉంటుంది, మేము మరణించినా సత్యం ధర్మం జయిస్తాయి, హరహర మహాదేవ్’ అంటూ నినాదాలు చేస్తూ వీర మరణం పొందుతారు. ఈ నినాదాలనే ప్రేక్షకులు థియేటర్‌లలో ఉద్వేగంతో చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలే ప్రస్తుతం కోకొల్లలుగా వైరల్ అవుతున్నాయి. ఈ సన్నివేశంలోనే వారిని తీవ్రంగా హింసించి కారం, ఉప్పు ఒంటికి పూసి దారుణంగా హింసించే దృశ్యాలను చూసి థియేటర్‌లలో అందరు కన్నీరు మున్నీరు అయ్యారు.
ఇవి కూడా చదవండి:
Laila Movie: డామిట్.. ‘లైలా’ బట్టలు, మేకప్ ఖర్చు కూడా రాలేదా?
Harish Shankar Leaks: ఆశలు పెట్టుకోకు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఆ సీన్ వాడేశా!