YCP Leaders Arrest
ఆంధ్రప్రదేశ్

YCP Leaders Arrest: హిట్ లిస్టులో ఉన్నదెవరు?

ఎక్కడున్నా అరెస్ట్ (ఇండికేషన్)
త్వరలోనే పేర్నికి ముహూర్తం!
కొడాలి నాని ఎక్కడున్నాడు?

వంశీ అరెస్టుతో మారిన రాజకీయ పరిణామాలు
తర్వాత అరెస్ట్ అయ్యేదెవరు? అని టెన్షన్ టెన్షన్
ఏకంగా పేర్లు చదివి వినిపిస్తున్న రాష్ట్ర మంత్రులు
జాబితాలో కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి..
జోగి రమేష్‌ త్వరలోనే కీలక అరెస్టులకు ఛాన్స్
వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన నేతలు
ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారోనని భయాందోళన
టీడీపీ నేతల మాటలతో ఫ్యాన్ పార్టీలో ఉక్కపోత
ఒకట్రెండు రోజుల్లో వల్లభనేనికి జగన్ పరామర్శ
రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఇప్పటికే విమర్శలు

YCP Leaders Arrest: ‘అరెస్ట్’ అనే మాట వినిపిస్తే చాలు వైసీపీ నేతలు వణికిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నప్పటికీ, లోలోపల మాత్రం ఎప్పుడు తమవంతు వస్తుందనే భయం మాత్రం లీడర్లను వెంటాడుతూనే ఉంది. ఇన్నాళ్లు సోషల్ మీడియా కార్యకర్తలు, ఇప్పుడిక నేతల వంతు అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు స్వయంగా మంత్రులే త్వరలో మరిన్ని అరెస్టులు ఉంటాయని, ఇదిగో లిస్టు అంటూ మీడియా ఎదుటే చదివి వినిపించేస్తున్నారు. దీంతో తప్పులు చేసిన, వైసీపీ హయాంలో టీడీపీని టార్గెట్ చేసిన కీలక నేతలు, మాజీ మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏం జరిగినా సరే తగ్గేదేలే, చూసుకుందాం అంటూ తన అరెస్టును ఉదహరిస్తూ ఓ వైపు అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండ్రోజులకోసారి ధైర్యం చెబుతున్నప్పటికీ రోజురోజుకూ కొందరు నేతల్లో మాత్రం టెన్షన్ అమాంతం పెరిగిపోతోంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అన్నీ అక్రమ అరెస్టులని వైసీపీ, ఇదంతా సక్రమమేనని కర్మఫలం ఏ ఒక్కరినీ వదలదని టీడీపీ చెబుతోంది.

నెక్స్ట్ ఎవరు?
వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత మంత్రులు మొదలుకొని టీడీపీ నేతల వరకూ ఎవరి నోట చూసినా నెక్స్ట్ వీళ్లే అంటూ జాబితా చదువుతున్నారు. ఇందులో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరో ఇద్దరు మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్‌ల పేర్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న ఈ నలుగురు దూకుడుగా వ్యవహరించారన్నది తెలుగు తమ్ముళ్ల ప్రధాన ఆరోపణ. అంతేకాదు కొన్ని సందర్భాల్లో పరిధి దాటి అతిగా ప్రవర్తించారని టీడీపీ అభిప్రాయం. కొడాలి, వంశీ, జోగి ఈ ముగ్గురూ చంద్రబాబు, లోకేష్‌లపై మాటల దాడి చేయగా, ఇక పేర్ని, వెల్లంపల్లి మాత్రం పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా ఎక్కువ మాట్లాడేవారన్నది అందరికీ తెలిసిన విషయమే. 2019 ఎన్నికల ముందు నుంచి మొదలైన విమర్శలు అధికారంలోకి వచ్చాక ఆఖరికి చంద్రబాబు కుటుంబ వ్యవహారాలపైనే నేరుగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీంతో వీరంతా టీడీపీ హిట్ లిస్టులో, రెడ్ బుక్‌లో చేరారనేది టీడీపీ నేతలు చెబుతున్న మాట. దీనికి తోడు ఈ నలుగురిపైనా పలు కీలక కేసులు ఉండటంతో కూటమి ప్రభుత్వానికి ఇదొక సువర్ణావకాశం మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే వంశీ అరెస్ట్ తర్వాత తప్పకుండా ఇద్దరు నానీల వంతు అన్నట్లుగా వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది.

ఒక పద్ధతి ప్రకారమే!
వంశీ, పేర్ని, కొడాలి, జోగి, వెల్లంపల్లి విషయంలో రెండు టార్గెట్‌లతో కూటమి పనిచేసిందని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. తొలుత ఈ ఐదుగుర్నీ ఆయా నియోజకవర్గాల్లో ఘోరాతి ఘోరంగా ఓడించడం, ఆ తర్వాత కటకటాల్లోకి పంపడమే రెండో టార్గెట్ అట. మొదటి టార్గెట్‌ను సాధించిన తెలుగు తమ్ముళ్లు, నెక్స్ట్ టార్గెట్ ఎప్పుడెప్పుడా? అని 8 నెలలుగా వేచి చూశారు. అనుకున్నదేమీ జరగకపోవడంతో ఆఖరికి బహిరంగంగానే ఇంకెన్ని రోజులు అరెస్టులు చేయకుండా ఆగుతారు? అని ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని ప్రదర్శించారు. అయితే ఇప్పుడిక అసలు సిసలైన సినిమా వంశీ అరెస్టుతో షురూ చేసేశారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు ఎలా పడితే అలా అరెస్టులు చేస్తే కక్షసాధింపు అనే అపవాదు వస్తుందని భావించిన టీడీపీ, అంతా ఒక పద్ధతి ప్రకారం జరగాలనే అభిప్రాయంతో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్‌లను వ్యక్తిగత విమర్శలు చేశారని కొన్ని, జగనన్న కాలనీలో అక్రమాలు, గడ్డం గ్యాంగ్‌తో అవినీతికి పాల్పడ్డారని కొడాలి నానిపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఇక పేర్ని నాని కుటుంబాన్ని రేషన్‌ బియ్యం మాయం వ్యవహారం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జోగి రమేష్‌‌ను టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులు, ఆయన కుమారుడు జోగి రాజీవ్‌ను అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారం వెంటాడుతోంది. ఇక వెల్లంపల్లిని పాత కేసులతో పాటు దేవాదాయ శాఖలో అవినీతి ఆరోపణలు వెంటాడుతున్నాయి. వాస్తవానికి వీరందరికీ న్యాయస్థానాల్లో తాత్కాలిక ఊరట దక్కింది. అయితే వంశీ అరెస్టుతో కలవరం మొదలైందని, ఎప్పుడు తమవంతు వస్తుందనే టెన్షన్ టెన్షన్‌గా ఉన్నారనే ప్రచారం జోరందుకున్నది.

భయం మొదలు.. ఎక్కడున్నా అరెస్ట్!
మంత్రులు, ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు మీడియా ముందుకొచ్చిన ప్రతిసారీ నెక్స్ట్ కొడాలి నాని, పేర్ని నాని అని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే పెద్ద పెద్ద జాబితాలను టీడీపీ కార్యకర్తలు పోస్టు చేస్తున్నారు. తదుపరి వికెట్ గుడివాడ నుంచి ఉండబోతోందని అంతా చర్చించుకుంటున్నారు. ఈ ఐదుగురితో పాటు యువనేత దేవినేని అవినాష్ పేరు కూడా గట్టిగానే ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఆఫీసుపై దాడిలో కర్త, కర్మ, క్రియ అంతా ఈయనే అన్నది టీడీపీ నేతల భావన. అందుకే మంత్రులు ధీమాగా అరెస్టులపై మాట్లాడేస్తున్నారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు చేసిన మరో తప్పే వంశీని జైలుపాలు చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. ఇక పేర్నినాని, కొడాలి నాని అరెస్ట్ మిగిలి ఉందని జోస్యం చెప్పారు. పీడీఎస్‌ రైస్‌ కేసులో బియ్యం దొంగ పేర్ని నాని అరెస్టు త్వరలోనే ఉంటుందని చెప్పారు. గుడివాడలో గుట్కా కింగ్‌ ప్రస్తుతం అడ్రస్‌ లేడని, కొడాలి అవినీతి, అరాచకాలపై కూడా విచారణ జరిపి తప్పకుండా చర్యలు తీసుకుంటామని కర్మఫలం ఏ ఒక్కరినీ వదలదని ధీమాగా చెప్పారు. ఈయన ఒక్కరే కాదు కేబినెట్‌లోని టీడీపీ మంత్రుల నోట ఇవే మాటలే, ఇదే జాబితానే వినిపిస్తోంది. అయితే ఎక్కడా ఈ అరెస్టులపైన కానీ, తదుపరి వ్యవహారాలపైన జనసేన, బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు.

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!