Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్రానికి చెందిన జలాశయాలలో ద్రోహానికి పునాది పడిందే బీఆర్ఎస్ పాలనలోనే అని మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆరోపించారు.విందుల కోసం తెలంగాణ ప్రయోజనాలను కేసీఆర్ ఏపీకి తాకట్టు పెట్టారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ నుంచి జూమ్ మీటింగ్ తో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు జలాశయాలలో తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. కృష్ణా,గోదావరి జలాశయాలలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడిఉందన్నారు. తెలంగాణాకు చెందాల్సిన ఒక్క నీటి బొట్టును కూడా వదులు కునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రగతిభవన్‌లో ఏపీ మాజీ సీఎం జగన్ కు విందులు ఇచ్చి గోదావరి జలాలను తెలంగాణ నుంచి తీసుకెళ్లి రాయలసీమను రతనాల సీమ చేస్తామని ప్రకటించలేదా? అని నిలదీశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం ఏర్పడితే పదేండ్లపాటు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేసిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నీటిపారుదల రంగాన్ని భ్రష్టు
పదే పదే అబద్ధాలు చెబుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం తప్ప బీఆర్ఎస్ నేతల మాటలు సత్యదూరం అన్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖమంత్రి హరీష్ రావుల నేతృత్వంలో తెలంగాణ రైతాంగాన్ని వంచనకు గురి చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రాల విభజన మీదట కృష్ణా జలాశయాలలో ఆంద్రప్రదేశ్ కు అప్పనంగా 811 టీఎంసీలలో 66:34 పద్దతిలో 511 టీఎంసీల నీటిని అప్పగించి తెలంగాణకు 211 టీఎంసీలకు పరిమితంచేసిన ఘనత బీఆర్ఎస్ పాలకులదేఅని ఎద్దేవా చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొన్న హరీష్ రావు తెలంగాణాకు ద్రోహం చేసే ఒప్పందాన్ని ఖరారు చేశారని విమర్శించారు. తెలంగాణ నీటిపారుదల రంగాన్ని భ్రష్టు పట్టించేందే బీఆర్ఎస్ పాలకులు అని విరుచుకుపడ్డారు.
Also Read: Uttam Kumar Reddy: రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో వేగం పెంచండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
1.80లక్షల కోట్లు ఖర్చు
నీటిపారుదల రంగంపై 1.80లక్షల కోట్లు ఖర్చు చేసి కొత్తగా ఒక్క ఎకర ఆయకట్టుకు నీరు అందించ లేక పోయారని అన్నారు. వారి ప్రభుత్వంలోనే డిజైన్ చేసి వారి పాలనలోనే నిర్మించి ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండె కాయగా చెప్పారని అటువంటి గుండెకాయ అయిన మేడిగడ్డ వారి హయంలోనే కుప్పకూలిన విషయం నిజం కాదా? అని నిలదీశారు. మేడిగడ్డ బ్యారేజ్ కుప్పకూలడం ఘోరమైన విపత్తుగా అభివర్ణించారు. నదీజలాశయాలలో తెలంగాణా హక్కులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. జాతీయ ప్రాజెక్టుల భద్రతా సంస్థ(ఎన్డీఎస్ఏ) ఇచ్చిన నివేదికలోనూ దేశ చరిత్రలోనే జరిగిన అతిపెద్ద మానవ తప్పిదంగా నివేదికఇచ్చిందన్నారు. ఐదేళ్ళ వ్యవధిలో ఎత్తిపోసిన నీరు కేవలం 165 టీఎంసీలు మాత్రమేనని ఆ తరువాత సంభవించిన వరదలకు నీరు కొట్టుకు పోయి వాస్తవ వినియోగానికి ఉపయోగపడింది కేవలము 65 నుంచి 70 టీఎంసీలు మాత్రమే అన్నారు. కొత్తగా ఆయకట్టు సేద్యంలోకి రాలేదని, కానీ బీఆర్ఎస్ మాత్రం గణనీయమైన ఆయకట్టు సేద్యంలోకి వచ్చిందని చెప్పడం అర్ధరహితం అన్నారు.
కృష్ణా జలాశయాలలో 70 శాతం
బీఆర్ఎస్ పాలనలో కోల్పోయిన నష్టాన్ని భర్తీ చేసి తెలంగాణా వాటాను సాదించేందుకు కేంద్ర జలశక్తి మంత్రి దగ్గర, ట్రిబ్యునల్ లో ,కోర్టులలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. గతపాలనలో జరిగిన ఒప్పందాలకు భిన్నంగా కృష్ణా జలాశయాలలో 70 శాతం వాటా కోసం డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణాలో ఉన్న 68% క్యాచ్ మెంట్ ఏరియాకు అనుగుణంగా చేస్తున్న డిమాండ్ న్యాయ సమ్మతమైనదని ఇదే అంశాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ,సుప్రీంకోర్టు,కేంద్రప్రభుత్వం వద్ద బలంగా వాదనలు వినిపిస్తున్నామన్నారు. గోదావరి వరద జలాల నుంచి ప్రతి సంవత్సరం 200 టీఎంసీల నీటిని కృష్ణా బేసిన్ ప్రాంతాలకు, రాయలసీమ కు తరలించాలనే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ప్రతిఘటిస్తున్నదన్నారు. ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ,ట్రిబ్యునల్ తీర్పులకు ఇది పూర్తిగా విరుద్ధమని ఆయన తేల్చిచెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఎటువంటి అనుమతులు లేవని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్.పాటిల్ తో పాటు సి.డబ్ల్యూ.సి నుంచి లిఖిత పూర్వకంగా హామీలు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఇదే విషయమై సి.డబ్ల్యూ.సి చైర్మన్ ఎలాంటి అనుమతులు లేవని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు
కృష్ణా జలాల్లో 70 శాతం వాటా కోసం బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌లో పోరాడుతున్నామన్నారు. అన్ని వేదికల్లోనూ పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), కేంద్ర జలశక్తి శాఖ, గోదావరి, కృష్ణా బోర్డులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)లకు దానిని వ్యతిరేకిస్తూ లేఖలు రాశామన్నారు. కేంద్రంతో జరిగిన పలు సమావేశాల్లో ఈ ప్రాజెక్టును వ్యతిరేకించామని ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూచనలతో పిటిషన్ ను వెనక్కితీసుకొని, ఒరిజనల్ సూట్ వేస్తున్నామన్నారు. పోలవరం- నల్లమలసాగర్ పీఎఫ్ఆర్పై రెండు రోజుల క్రితం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖ రాశామని, ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదంటూ లేఖ ద్వారా సమాచారం ఇచ్చారని చెప్పారు. దీనిపై పదే పదే అబద్ధాలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
వివాదాల వల్ల ఆగిన ప్రాజెక్టులపై చర్చ
పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మీదటనే కృష్ణా,గోదావరి జలాశయాలలో ఎక్కువ నీటిని వినియోగించామన్నారు.యావత్ భారత దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఉత్పత్తి అయిన ధాన్యం ఇందుకు నిదర్శనమన్నారు.సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంపై హరీశ్ రావు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు చెప్పారు. పోలవరం- నల్లమలసాగర్‌ను అజెండాలో చేర్చేందుకు వీల్లేదని సమావేశంలో అధికారులు చెప్పారని, అంతరాష్ట్ర వివాదాల వల్ల ఆగిన ప్రాజెక్టులపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మాత్రమే చెప్పామని పేర్కొన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై హరీశ్ రావు సలహాలు అక్కర్లేదన్నారు.నీటిపారుదల శాఖ సలహాదారుగా ఆదిత్య నాధ్ దాస్ ను నియమించడం ముమ్మాటికి సమర్ధనీయమని పేర్కొన్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆయనకు ఉన్న అనుభవం తెలంగాణ నీటి అవసరాలతో పాటు హక్కుల సాధనకు ఆయనకున్న లోతైన అనుభవం ఉపకరిస్తుందని దీనిపై బీఆర్ఎస్ అనవసరంగా రాద్దాంతం చేస్తుందని మండిపడ్డారు.

