Animal Fat Row: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన కల్తీ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందనే దుమారం (Animal Fat Row) కొత్త మలుపు తీసుకున్న విషయం తెలిసిందే. ఏడాదిన్నర పాటు సమగ్ర దర్యాప్తు జరిపిన సీబీఐ సిట్… ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత మరోసారి రాజకీయ వివాదం రాజుకుంది. జంతు కొవ్వు కలిసినట్టుగా సీబీఐ పేర్కొనకపోవడంతో విపక్ష వైసీపీ రాజకీయాస్త్రంగా (YSRCP) మార్చుకుంది. జంతు కొవ్వు లేదని తేలడంతో నిరాధారమైన ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను (Pawan Kalyan) డిమాండ్ చేస్తోంది. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారంటూ జనాల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలకు వైసీపీ నేతలు పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) స్పందించారు.
జంతు కొవ్వు లేదని ఎక్కడా లేదు
నెయ్యిలో నూటికి నూరు శాతం కల్తీ జరిగిందని బీఆర్ నాయుడు అన్నారు. అయితే, జంతువుల కొవ్వులు లేవని ఎక్కడా నిర్ధరణ కాలేదని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో లడ్డూ తయారీలో ప్రాణాలను హరించే రసాయనాలను వినియోగించారని సీబీఐ ఛార్జిషీటును ప్రస్తావించారు. కల్తీ నెయ్యితో ఏకంగా 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని పేర్కొన్నారు. పాలు, వెన్న లేకుండా 60 లక్షల కిలోల నెయ్యి ఎలా వచ్చిందని బీఆర్ నాయుడు ప్రశ్నించారు. అయితే, ఈ రసాయనాలను వాసన వచ్చేందుకు వాడారా, ఇంకేదైనా కారణం ఉందా అనేది తెలియదన్నారు. హిందువుల ప్రాణాలు హరించడానికే కెమికల్స్ వాడారని పేర్కొన్నారు. కేవలం కమీషన్ల కోసం భోలే బాబా డెయిరీకి టెండర్లు అప్పగించారని అన్నారు. సుబ్బారెడ్డి పీఏగా వ్యవహరించిన చిన్నప్ప అకౌంట్లోకి కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. చిన్నప్ప అకౌంట్ నుంచి డబ్బు ఎక్కడికి వెళ్లిందో సీబీఐ నిగ్గుతేల్చాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాకుంటే ఆ కల్తీ నెయ్యి దందా ఇంకా కొనసాగేదని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
Read Also- Gudivada Amarnath: కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్ ఫైర్.. ఏమన్నారంటే
ఛార్జిషీటులో లోపాలు.. స్టడీ చేస్తున్నారు
జంతు కొవ్వు కలిసిందంటూ ప్రభుత్వం కూడా ఆరోపించినట్టే కదా? అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బీఆర్ నాయుడు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. సీబీఐ చార్జ్‌షీట్‌లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తమ సీనియర్ న్యాయవాదులు స్టడీ చేస్తున్నారని, సీబీఐ వాళ్లు సరిగా దర్యాప్తు జరిపించలేదని కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు. అది కూడా త్వరలోనే బయటపెడతామని బీఆర్ నాయుడు చెప్పారు. వైసీపీ విమర్శలను ఉద్దేశిస్తూ వాళ్లు విమర్శించడానికి ఏముంది? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు అది నెయ్యే కాదని, నూటికి నూరు శాతం కల్తీ అని అన్నారు. ఈ కొవ్వు ఆ కొవ్వు ఉందా! అన్నీ వచ్చాయిగా అని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

