MP Etela Rajender: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు అందుబాటులో ఉండే, అవసరాలను తీర్చగల నాయకులను ఎన్నుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వ్యాపారాల్లో నిమగ్నమైన వారికి ఓటు వేస్తే ప్రజలు నష్టపోతారని హెచ్చరించారు. శుక్రవారం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ ర్యాలీలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. తాను డబ్బులు, దావత్ కాకుండా పనిని చూసి ప్రజలు ఓటు వేసినందువల్లనే నాలుగు లక్షల మెజారిటీతో గెలిచానని అన్నారు. ఇక్కడి ప్రజలు డబ్బుకు లొంగని వారని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి మాటలు కోటలు
కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్లీ వస్తే వారిని నిలదీయాలని, నాలుగు వేల, ఆరు వేల పెన్షన్లు ఎక్కడని ప్రశ్నించాలని సూచించారు. తులం బంగారం, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయో అడగాలని అన్నారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయని కానీ పనులు కనిపించడం లేదని విమర్శించారు. గ్రామాభివృద్ధికి నిధులు అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వం మాత్రమేనని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేస్తే నిధులు రావని అన్నారు. స్మార్ట్ సిటీ పేరుతో నిధులు తీసుకొచ్చింది తానేనని ప్రజలకు గుర్తు చేశారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులుగా పనిచేస్తారని, అభివృద్ధికి నిధులు తీసుకొస్తారని తెలిపారు. హైడ్రా(Hydraa) పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతలను అడ్డుకున్నది బీజేపీ నేతలేనని, పేదల భూముల కబ్జాపై పోరాడింది తామేనని పేర్కొన్నారు.
Also Read: Janasena MLA Controversy: ఎమ్మెల్యే రాసలీలల వివాదంలో ట్విస్ట్.. కీలక ఆధారాలు బయటపెట్టిన బాధితురాలు!
మద్యం ప్రభావానికి లోనుకాకుండా..
ప్రజలు వినియోగిస్తున్న బియ్యం ప్రధాని నరేంద్ర మోదీ(PM Modhi) పంపిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్కాములు జరిగాయని విమర్శించారు. మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో గౌరవం పొందిందని అన్నారు. డబ్బులు, మద్యం ప్రభావానికి లోనుకాకుండా బీజేపీ అభ్యర్థులకు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్, మున్సిపల్ అధ్యక్షులు నరేందర్, జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, జిల్లా పార్టీ ఇన్చార్జి సామ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

