Medaram Jatara: భక్త జన సందోహంతో మేడారం వనదేవతల జాతర కిక్కిరిసిపోయింది. బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న, నాగులమ్మ లు గద్దెల పైకి వచ్చి ఆకాశీనులయ్యారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి మంగళవారం పెళ్ళికొడుకు గా ముస్తాబైన పగిడిద్దరాజు అక్కడి నుంచి బయలుదేరి లక్ష్మీపురంలో బసచేశాడు. బుధవారం అక్కడి నుంచి మేడారంలోని పగిడిద్దరాజు గద్దెపైకి వచ్చాడు.
ప్రత్యేక రహస్య పూజలు
కన్నెపల్లి నుంచి సారలమ్మను గిరిజన ఆదివాసి పూజారులు ఆచార సాంప్రదాయాలతో పూజలు నిర్వహించి తల్లిని మేడారంలోని గద్దెపై ప్రతిష్టించారు. అదేవిధంగా ఏటూర్ నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులను ఆచార సాంప్రదాయాలతో తీసుకొచ్చి మేడారంలోని గద్దెపై ప్రతిష్టించారు. గురువారం మహా ఘట్టంలో భాగంగా సమ్మక్క ప్రతిరూపం కుంకుమ భరణి రూపంలో చిలకలగుట్టలో ఉన్న సమ్మక్కను గిరిజన ఐదు వంశస్థులు ప్రత్యేక రహస్య పూజలు నిర్వహించి కుంకుమ భరణి గిరిజన అర్చకులు తీసుకొచ్చి సమ్మక్క గద్దెపై ప్రతిష్టించారు. దీంతో శుక్రవారం మేడారంలో వనదేవతలందరూ తమ తమ గద్దెలపై కి రావడంతో భక్తులు కోలాహాలంగా కదలి వనదేవతల దర్శనాలను చేసుకుంటున్నారు.
Also Read: Husband Suicide: షాకింగ్ ఘటన.. పెళ్లైన 2 నెలలకే భార్య జంప్.. తట్టుకోలేక భర్త ఏం చేశాడంటే?
రాత్రి నాటికే కోటి 30 లక్షలు
మేడారం జాతర ప్రాంగణంతోపాటు గద్దెల ప్రాంతంలో వనదేవతల కోసం జనం తహతహలాడుతూ తమ మొక్కులను చెల్లించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కోరిన కోరికలను తీర్చే కొంగుబంగారంగా భావించే సమ్మక్క సారలమ్మ లను దర్శించుకుని పసుపు, కుంకుమ, బంగారం, కొబ్బరికాయలతో తమ కోరికలను తీర్చాలని తల్లులను వేడుకున్నారు. గురువారం రాత్రి నాటికే కోటి 30 లక్షలకు చేరుకున్న భక్తుల సంఖ్య శుక్రవారం ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు వెల్లడిస్తున్నారు. వనదేవతల దర్శన సమయంలో భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పోలీసు బందోబస్తు నడుమ భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని తమ కోరికలను తీర్చాలని వేడుకుంటున్నారు.
Also Read: Amardeep Chowdary: ఒకే ఒక్క ఛాన్స్.. నేనేంటో నిరూపించుకుంటా!

