Amardeep Chowdary: బిగ్ బాస్ ఫేమ్, సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరి (Amardeep Chowdary) హీరోగా మారుతున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత తన క్రేజ్‌ని పడిపోనివ్వకుండా నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్న అమర్ దీప్ చౌదరి.. ఇప్పుడు హీరోగా తన ప్రతిభను కనబరిచేందుకు సిద్ధమ్యారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా.. ఎంఎం నాయుడు రచన, దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘సుమతీ శతకం’ (Sumathi Sathakam). అమర్ దీప్ చౌదరి, శైలి చౌదరి (Saylim Chaudhari) జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్, ఆకెళ్ళ గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read- The Raja Saab: భారీ నష్టాలకు కారణం ఆ ఇద్దరేనా? నిర్మాతను నిలువునా ముంచేశారా?
మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా..
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ వదిలారు. ఫిబ్రవరి 6వ తేదీన మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో స్పీచ్ పెంచిన మేకర్స్.. తాజాగా తిరుపతిలోని శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో హీరో అమర్ దీప్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read- Sumathi Sathakam Trailer: పిఠాపురం ఎమ్మెల్యేగారు చెప్పింది నిజమే.. ఏం చెప్పారు?
నేనేంటో నిరూపించుకుంటా..
ఈ సందర్భంగా హీరో అమర్ దీప్ మాట్లాడుతూ.. ‘‘శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఈ పాజిటివ్ వైబ్ చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్ ‘రామ’ (సీరియల్లో నేమ్) అనే పేరుతోనే మొదలైంది. ఇప్పుడు అదే పేరున్న కాలేజీలో మా ‘సుమతి శతకం’ ట్రైలర్ విడుదలవుతుండటం ఒక మంచి సెంటిమెంట్‌గా భావిస్తున్నాను. నేను కూడా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్‌ని, మీ ఎనర్జీ చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. అనంతపురంలో ఒక సామాన్య స్థాయి నుంచి వచ్చాను. ఈ రోజు నాకు ఇంత ప్రేమ లభిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ‘సుమతీ శతకం’ సినిమా కోసం నా ప్రాణం పెట్టి పనిచేశాను. షూటింగ్ సమయంలో గాయాలైనప్పటికీ వెనకాడకుండా కష్టపడ్డాను. అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇందులో మంచి కామెడీతో పాటు డివైన్ ఎలిమెంట్స్, సస్పెన్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. దయచేసి ‘ఒక్క ఛాన్స్’ ఇవ్వాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను. ఒక్క ఛాన్స్ ఇస్తే.. నేనేంటో ఈ సినిమాతో నిరూపించుకుంటాను. మా సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది. ఫిబ్రవరి 6న విడుదలవుతున్న ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూసి సక్సెస్ చేసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనిట్ మొత్తం, ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ‘సుమతీ శతకం’ ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకుంటూ, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

