Municipal Elections: పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని తొర్రూరు పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజే అధికార కాంగ్రెస్ పార్టీ ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి స్వయంగా పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తొర్రూరు పట్టణంలోని 6వ వార్డులో నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలు, పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ప్రజలకు వివరించారు.
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు యశస్విని రెడ్డి
మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజల మద్దతు అత్యంత కీలకమని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో మున్సిపాలిటీలోనూ అదే పార్టీకి బలం చేకూరితే అభివృద్ధి పనులు మరింత వేగంగా సాగుతాయని ఆమె స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు ప్రజల గడపకు చేరాలంటే స్థానిక సంస్థల్లోనూ కాంగ్రెస్ ప్రతినిధులే ఉండాలన్నారు.
Also Read: Municipal Elections: మున్సిపల్ ఎన్నికలకు మోగిన నగారా.. రసవత్తరంగా మున్సిపల్ పోరు..!
కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు
తొరూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా, నామినేషన్ల తొలి రోజే పలు వార్డులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. 6వ వార్డు పెదగాని కళావతి–సోమయ్య,9వ వార్డు: పంజా కల్పన,14వ వార్డు సోమ రజని–రాజశేఖర్ లను అధికారికంగా ప్రకటించినట్లు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు.
వినూత్న ప్రచారానికి విశేష స్పందన
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న శైలిలో ప్రజలకు చేరువయ్యారు. రోడ్డు పక్కన ఉన్న చిన్న వ్యాపారులు, హోటల్ యజమానులు, కార్మికులతో ఆత్మీయంగా మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రచారంలో భాగంగా స్వయంగా దోశలు వేస్తూ ప్రజలతో ముచ్చటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రచార తొలి రోజున 14వ వార్డులో విస్తృతంగా పర్యటించిన ఆమె, మెయిన్ రోడ్డు పరిధిలోని వ్యాపారులను కలుసుకుని వారి సమస్యలపై హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సోమ రజని–రాజశేఖర్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తొరూరు పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారడంతో రానున్న రోజుల్లో ప్రచారం మరింత ఉధృతం కానుంది.
Also Read: Municipal Elections 2026: తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే

