Atchannaidu | ఏపీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా కోళ్ల ఫారాలకు ఫేమస్ అయిన గోదావరి జిల్లాల్లో ఇది బయటపడంతో దీనిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చాలామంది చికెన్ తినడం మానేశారు. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందంటూ జరుగుతున్న ప్రచారంపై తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) స్పందించారు. తాము అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని.. దీనిపై ఎలాంటి భయాందోళన అవసరం లేదన్నారు.
ఉడికించిన చికెన్, కోడిగుడ్లు తింటే ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. ప్రజలు దీని గురించి అనవసరంగా భయపడాల్సిన పనిలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కాబట్టి వైరస్ బతికే అవకాశం లేదన్నారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను పూడ్చేలా చర్యలు తీసుకుంటున్నామని.. పౌల్ట్రీ ఫారాల యజమానులకు నష్టపరిహారం కూడా అందిస్తామంటూ చెబుతున్నారు. సోషల్ మీడియాలో దీనిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని.. తాము ఎప్పటికప్పుడు అప్ డేట్లు ఇస్తామని చెప్పుకొచ్చారు.