Telangana Sand Revenue: 9 నెలలకే సుమారు రూ.720 కోట్ల ఆదాయం
ప్రభుత్వం అక్రమాలపై ఉక్కుపాదం
వేబ్రిడ్జి, సీసీ కెమెరాలతో నిఘా
జీపీఎస్‌తో మానిటరింగ్.. ఓవర్ లోడుకు చెక్
ప్రభుత్వ చర్యలతో పెరిగిన ఆదాయం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కాసుల వర్షం (Telangana Sand Revenue) కురుస్తోంది. అక్రమ ఇసుక రవాణాకు చెక్ పడటంతో కేవలం 9 నెలలకే 720 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఇసుక రీచ్‌ల వద్ద వేబ్రిడ్జి, సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రభుత్వానికి రాబడి వస్తోంది.
ఇసుక అక్రమ రవాణాను చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు సైతం ఒకవైపు మానిటరింగ్, మరోవైపు సమీక్షలు నిర్వహిస్తూ సిబ్బందిని అలర్ట్ చేస్తున్నారు. గోదావరి, మూసీ, కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌ల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. గతంలో ఇసుక రీచ్‌ల నుంచి అక్రమంగా ఇసుక తరలింపుతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడడంతో, అడ్డుకట్ట వేసేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిత్యం గమనిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, మైనింగ్, టీఎస్ఎండీసీలు సంయుక్తంగా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతుందనే ఆరోపణలతో ఇసుక క్వారీలు(రీచ్)లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. అదే విధంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక లోడింగ్‌కు మాత్రమే అనుమతిస్తున్నారు.
Read Also- Dr Suranjan: జంపింగ్ రాజా జంపింగ్.. మున్సిపల్ పీఠం కోసం హస్తం వీడి గులాబీ గూటికి చేరిన నేత..?
ఒక వేబిల్లుపై ఒక వాహనంలో ఒకసారి మాత్రమే ఇసుక తరలించేందుకు వీలుటుంది. రెండోసారి తరలిస్తే గమనించి చర్యలు తీసుకోనున్నారు. అంతేగాకుండా ఇసుక రీచ్‌ల సమీపంలో వేయింగ్ బ్రిడ్జి ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎవరైనా పరిమితికి మించి ఇసుకను వాహనంలో తరలిస్తే జరిమానాతో పాటు సీజ్ చేస్తామని హెచ్చరికలు సైతం జారీ చేశారు. సీసీ కెమెరాలతో మానిటరింగ్‌తో ఫలితాలు రావడంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 60 రీచ్‌లలో ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అంతేగాకుండా ఇసుక రీచ్‌ల వద్ద రవాణాకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 వేలకు లారీలు నమోదు చేసుకోగా, ఇప్పటికే 9,500 లారీలకు జీపీఎస్ అమర్చినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు ప్రతి రోజూ ఏ ఇసుక రీచ్ నుంచి ఎంత ఇసుకను తోడుతున్నారు(రవాణా లోడింగ్) చేస్తున్నారు?, ఏ వాహనంలో ఎంత ఇసుకను తరలిస్తున్నారు?.. ఆయన ప్రభుత్వం చెల్లించిన డీడీ (అమౌంట్)ఎంత? ఎంత లోడింగ్ చేస్తున్నారనే వివరాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయంలో డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసి వివరాలను నమోదు చేస్తున్నారు. అదే విధంగా సీసీ కెమెరాలతో రీచ్ ల మానిటరింగ్ కోసం ఐటీ టీంను సైతం ఏర్పాటు చేశారు. అక్రమ ఇసుక రవాణాకు చెక్ పెట్టారు. దీంతో పాటు మనఇసుకవాహనంపై జిల్లాల అధికారులకు అవగాహన కల్పిస్తూ ప్రతి బిల్లును కంప్యూటర్ ద్వారా ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి తోడు రీచ్ ల వద్ద బిల్లు చెకింగ్ కు సిబ్బందిని నియమిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టి అక్రమ ఇసుక రవాణ జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. కేవలం 9 నెలల 19 రోజులకే 720కోట్ల ఆదాయం వచ్చినట్లు టీజీఎండీసీ అధికారులు తెలిపారు. గతేడాది(2024-25)లో ఏప్రిల్ లో80.15కోట్లు, మేలో 78.06కోట్లు, జూన్ లో 96.49కోట్లు, జూలైలో 51.95 కోట్లు, ఆగస్టు లో 43.20కోట్లు, సెప్టెంబర్ లో 27.08కోట్లు, అక్టోబర్ లో 51.75కోట్లు, నవంబర్ లో 51.12కోట్లు, డిసెంబర్ లో 59.49కోట్లు, జనవరిలో 52.26కోట్లు, పిబ్రవరిలో 58.75కోట్లు, మార్చిలో 88.44కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం గతేడాది 738.74కోట్లు ప్రభుత్వానికి వచ్చింది.
Read Also- Dog Guards Dead Body: మంచులో చనిపోయిన యజమాని.. డెడ్‌బాడీకి 4 రోజులు కాపలా కాసిన పెంపుడు శునకం
ఈ ఆర్థిక సంవత్సరం(2025-26)లో ఏప్రిల్‌లో రూ.80.30కోట్లు, మే నెలలో రూ.88.17 కోట్లు, జూన్‌లో రూ.102.10 కోట్లు, జూలైలో రూ.68.51 కోట్లు, ఆగస్టులో రూ.54.69 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.44.64 కోట్లు, అక్టోబర్‌లో రూ.62.80 కోట్లు, నవంబర్‌లో రూ.77.49 కోట్లు, డిసెంబర్‌లో రూ.91.16 కోట్లు, జనవరిలో 19వ తేదీవరకు రూ.50.90కోట్లు ఆదాయం వచ్చింది. కేవలం 9 నెలల 19 రోజులకే 720.76కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఇంకా ఫిబ్రవరి, మార్చి ఉండటంతో ప్రభుత్వం నిర్ణయించిన టార్గెట్ రీచ్ అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. వెయ్యికోట్ల టార్గెట్ ను ప్రభుత్వం నిర్ణయించగా దాదాపు రీచ్ కాబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. గత ఏడాది వచ్చిన ఆదాయాన్ని జనవరి నెలలో రీచ్ కావడం గమనార్హం.

