Vamshi Arrest | గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో ఉన్న ఆయన్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన్ను విజయవాడ తరలిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నందుకు ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ దాడి కేసులో వంశీ ఏ71గా ఉన్నారు.
ఈ కేసుతో పాటు ఆయనపై మరో కిడ్నాప్ కేసు కూడా ఉంది. ఆ దాడి సమయంలో టీడీపీ ఆఫీసులో ఆపేటర్ గా ఉన్న సత్యవర్ధన్ ఫిర్యాదుదారుడిగా ఉన్నారు. అయితే ఆయన్ను కిడ్నాప్ చేసి వంశీ బెదిరించినట్టు కేసు కూడా నమోదైంది. ఈ కేసుల్లో నిందితుడిగా ఉన్నందుకే ఆయన్ను అరెస్ట్ చేశారని సమాచారం.
ఈ దాడిలో వంశీతో పాటు 88 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో తనన్ను అరెస్ట్ చేయొద్దంటూ గతంలో వంశీ పిటిషన్ కూడా వేశారు. దానిపై ఈ నెల 20న విచారణ జరగబోతోంది. కానీ అంతలోనే ఆయన అరెస్ట్ కావడం గమనార్హం. ఆయన అరెస్ట్ అటు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.